గుజరాత్ రాష్ట్రంలోని జామ్ నగర్  జిల్లాలో ఈ నెల 5వ తేదీన 14 నెలల బాలుడికి కరోనా వైరస్ సోకినట్టుగా వైద్యులు గుర్తించారు.ఈ చిన్నారి వలస కూలీ దంపతుల కొడుకు. మంగళవారం నాడు రాత్రి ఆ చిన్నారి శరీరంలో పలు అవయవాలు దెబ్బతిని మృతి చెందినట్టుగా వైద్యులు తెలిపారు.ఆసుపత్రిలో చేరిన సమయం నుండి ఆ చిన్నారి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు కుటుంబసభ్యులకు చెప్పారు.

రెండు రోజుల క్రితం ఈ చిన్నారికి కరోనా సోకిందని వైద్యులు గుర్తించారు. అతడిని వెంటిలేటర్ పై ఉంచి వైద్యం చేస్తున్నారు. అయితే వైద్యానికి ఆ బాలుడి శరీరం సహకరించలేదు. గంట గంటకు అతడి శరీరంలో అవయవాలు దెబ్బతిన్నాయి. మల్టీపుల్  ఆర్గాన్స్ దెబ్బతిని మృతి చెందాడు.

గుజరాత్ రాష్ట్రంలో ఈ వ్యాధికి మృతి చెందిన అతి చిన్న వయస్సున్న బాలుడిగా అధికారులు చెప్పారు. 14 నెలల బాలుడి మృతితో రాష్ట్రంలో కరోనా వైరస్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 16కి చేరుకొంది.

జామ్ నగర్ జిల్లాలో ఈ 14 నెలల బాలుడికి కరోనా వైరస్ సోకడంతో ఈ జిల్లాలో ఇదే మొదటి కేసుగా అధికారులు చెప్పారు. ఈ బాలుడికి ఎలా ఈ వైరస్ సోకిందనే విషయమై  అధికారులు ఆరా తీస్తున్నారు.

మృతుడి తల్లిదండ్రులు ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు. వీరు పోర్టులో క్యాజువల్ లేబర్ గా పనిచేస్తున్నారు.

also read:కరోనా: ముంబై ధారావిలో ఏడుగురికి పాజిటివ్, రాష్ట్రంలో 891కి చేరిన కేసులు

ఇటీవల కాలంలో మృతుడి తల్లిదండ్రులు ఎక్కడకు కూడ ప్రయాణం చేసిన చరిత్ర లేదని కూడ అధికారులు చెప్పారు. అయినా కూడ వీరి కొడుకుకు కరోనా వైరస్ సోకింది. దీంతో తల్లిదండ్రులను కూడ అధికారులు క్వారంటైన్ చేశారు.

జామ్ నగర్ పట్టణానికి సమీపంలో డేర్డ్ గ్రామంలో ఈ బాలుడి తల్లిదండ్రులు నివాసం ఉంటున్నారు. గుజరాత్ రాష్ట్రంలో 175 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.