క్వారంటైన్‌లో ఉన్న జమాత్ సభ్యులు కొంతమంది మహిళా పోలీసులు, నర్సులతో అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. దీంతో ఘజియాబాద్‌లోని ఐసోలేషన్ వార్డులో పూర్తిగా పురుష సిబ్బందినే  ప్రభుత్వం విధుల్లో నియమించింది.

అంతకుముందు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆరుగురు జమాత్ సభ్యులపై జాతీయ భద్రతా చట్టం కింద కేసు నమోదు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఈ చట్టం ప్రకారం తప్పు చేశారని రుజువైతే, ఎలాంటి అభియోగాలు నమోదు చేయకుండానే ఏడాది పాటు అదుపులోకి తీసుకోవచ్చు.

Also Read:తబ్లీగి జమాత్: అప్పట్లో పోలియో చుక్కలు వద్దన్నారు, ఇప్పుడు కరోనా పరీక్షలు

వాళ్లు చట్టాన్ని అనుసరించరు.. ఆదేశాలను అంగీకరించరు, మానవత్వానికి శత్రువులని యోగి వ్యాఖ్యానించారు. మహిళా వైద్య సిబ్బంది పట్ల వారు ప్రవర్తించిన తీరు శిక్షార్హం. వీరిపై నేషనల్ సెక్యూరిటీ యాక్ట్‌ను ప్రయోగిస్తున్నామని, వారిని ఎట్టి పరిస్ధితుల్లోనూ వదిలేది లేదని సీఎం స్పష్టం చేశారు.

ఇండోర్‌లో వైద్య సిబ్బందిపై దాడి చేసిన లాంటి ఘటనలు మన రాష్ట్రంలో ఎక్కడా కనిపించొద్దని, ఇందుకోసం చట్ట ప్రకారం ఏ చర్యనైనా తీసుకుంటామని యోగి ఆదిత్యనాథ్ హెచ్చరించారు.

Also Read:నర్సులతో అసభ్య ప్రవర్తన... జమాత్ సభ్యులపై ఆ చట్టం ప్రయోగం: యోగి కీలక నిర్ణయం

కాగా దేశంలో నమోదవుతున్న కరోనా కేసులకు ఢిల్లీ తబ్లీగ్ జమాత్‌కు సంబంధం ఉందని తేలడంతో యూపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ సదస్సుకు హాజరైనవారి వివరాలను సేకరించేందుకు అధికారులు నానా తంటాలు పడుతున్నారు.

ఘజియాబాద్‌కు చెందిన 136 మంది తబ్లీగ్ జమాత్‌లో పాల్గొన్నారని పోలీసులు గుర్తించారు. వీరిలో ఆరుగురికి కరోనా లక్షణాలు కనిపించడంతో ఎంఎంజీ హాస్పిటల్‌లో చేర్పించగా పరీక్షలు చేయించారు. ఒకరికి పాజిటివ్ అని తేలింది.