దేశంలో కరోనా కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి. వైద్య సిబ్బంది, పోలీసులు, జర్నలిస్టులు వైరస్ వ్యాప్తి నిరోధానికి తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్‌‌లో ఓ జర్నలిస్ట్‌కు కరోనా వైరస్ సోకినట్లుగా తేలింది.

మార్చి 20న అప్పటి ముఖ్యమంత్రి కమల్‌నాథ్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి హాజరైన జర్నలిస్టుకు ఇప్పుడు పాజిటివ్ అని తేలింది. అంతేకాకుండా ఆ విలేకరి కుమార్తెకు కూడా కరోనా సోకినట్లుగా సమాచారం.

Also Read:కర్ణాటకలో మరో కరోనా మృతి: దేశంలో 12కు చేరిన మృతుల సంఖ్య

మధ్యప్రదేశ్‌‌ అసెంబ్లీకి బలపరీక్షకు ముందుగానే కమల్‌నాథ్ సీఎం పదవికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ప్రకటించేందుకు ఆయన ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి సదరు జర్నలిస్ట్‌ హాజరయ్యారు.

అయితే వైరస్‌ను కట్టడి చేసేందుకు గాను కమల్‌నాథ్ మీడియా సమావేశానికి హాజరైన జర్నలిస్టులు, అధికారులు అంతా ఇప్పుడు క్వారంటైన్‌ అవ్వాల్సి ఉంటుంది. ఇప్పటికే మాజీ సీఎం కమల్‌నాథ్ తనంత తానుగా క్వారంటైన్ అయ్యారు. కాగా మధ్యప్రదేశ్‌లో ఇప్పటి వరకు కరోనా సోకిన వారి సంఖ్య 14కి చేరింది.

Also Read:దేశంలో కరోనా కేసుల సంఖ్య 566: రాష్ట్రాల వారీగా తాజా లెక్కలు ఇవీ...

మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా సోకిన బాధితుల సంఖ్య 562కి చేరింది. కోవిడ్ 19 వ్యాప్తిని అరికట్టేందుకు గాను 21 రోజుల పాటు దేశవ్యాప్త లాక్‌డౌన్ ప్రకటించారు ప్రధాని నరేంద్రమోడీ. అత్యవసర, ముఖ్యమైన సేవలు మినహా మిగిలిన అన్ని కార్యక్రమాలు నిలిపివేస్తున్నట్లు మోడీ వెల్లడించారు.

లాక్‌డౌన్ ఆదేశాలను ప్రజలు పాటించకపోతే పరిస్ధితి అదుపుతప్పి పోతుందని, ఇక మన చేతుల్లో ఏం ఉండదని మోడీ పేర్కొన్నారు. లాక్‌డౌన్ నిర్ణయం ప్రతీ ఇంటికీ లక్ష్మణరేఖ అని, గీత దాటితే కరోనాను ఇంట్లోకి ఆహ్వానించినట్లేనని తెలిపారు. తాను ప్రధానిగా చెప్పడం లేదని, మీ ఇంటి కుటుంబసభ్యుడిగా చెబుతున్నానని మోడీ అన్నారు.