బెంగళూరు: కర్ణాటక రాష్ట్రంలో మరో కరోనా మరణం సంభవించింది. కర్ణాటక రాజధాని బెంగళూరులో 70 ఏళ్ల వృద్ధురాలు మరణించింది. దీంతో దేశంలో కరోనా మరణాల సంఖ్య 12కు చేరింది. ఇటీవల ఆ మహిళ మక్కా నుంచి వచ్చింది.  

ఆమె చిక్కబళ్లాపూర్ కు చెందిన మహిళ. హోం క్వారంటైన్ లో ఉన్న మహిళను బెంగళూరులో తరలించారు. అయితే, ఆమె ఆస్పత్రిలో బుధవారం తెల్లవారు జామున మరణించింది.  ఇది వరకు ఓ వ్యక్తి కరోనా వైరస్ తో మరణించిన విషయం తెలిసిందే. కర్ణాటకలో 48 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి.

ఆ వృద్ధురాలి కుమారుడు, కోడలు, మనవళ్లకు పరీక్షలు నిర్వహించారు. ఆమె ఎవరెవరిని కలిసిందో గుర్తించి వారికి కూడా పరీక్షలు నిర్వహించనున్నారు. కర్ణాటకలో ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. ఓ వ్యక్తిపై కేసు నమోదు చేశారు. చేతికి స్టాంప్ వేసినప్పటికీ బయటకు తిరుగుతుండడంతో అతనిపై కేసు నమోదు చేసింది. 

తమిళనాడులో 54 వ్యక్తి కరోనా సోకి మరణించాడు. తమిళనాడులో తొలి కరోనా మరణం రికార్డయిందని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సి. విజయభాస్కర్ చెప్పారు. 

మంగళవారంనాడు మహారాష్ట్ర రాజధాని ముంబైలో 65 ఏళ్ల వృద్ధుడు మరణించాడు. సోమవారంనాడు ముంబైలోని కస్బూర్బా ఆస్పత్రిలో చేరిన అతను మంగళవారం మృత్యువాత పడ్డాడు. ఆస్పత్రిలో చేరిన కొద్ది గంటలకే అతను తుదిశ్వాస విడిచాడు. 

మృతుడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి మార్చి 15వ తేదీన అహ్మదాబాద్ వచ్చాడు. అక్కడి నుంచి 20వ తేదీన ముంబై చేరుకున్నాడు. దగ్గు, జ్వరం రావడంతో సోమవారం ఆస్పత్రిలో చేరాడు. 

మహారాష్ట్ర ముగ్గురు, కర్ణాటకలో ఒకరు, బీహార్ లో ఒకరు, పంజాబ్ లో ఒకరు, పశ్చిమ బెంగాల్ లో ఒకరు, హిమాచల్ ప్రదేశ్ లో ఒకరు, గుజరాత్ లో ఒకరు, ఢిల్లీలో ఒకరు కరోనా వైరస్ బారిన పడి మరణించారు.