గుంటూరు: టిడిపి అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ఓవైపు కరోనాపై సూక్తులు చెబుతూ మరోవైపు అనుచరులతో రాజకీయం చేస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మండిపడ్డారు. కరోనా విజృంభిస్తున్న విపత్కర సమయంలో వైసిపి ప్రభుత్వం, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమర్ధవంతంగా పనిచేస్తుంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. వారిద్దరిపై తీవ్ర  స్థాయిలో విరుచుకుపడ్డారు. 

రాష్ట్రం, దేశం పరీక్షా సమయంలో ఉన్నదనే విషయం అందరికీ తెల్సినటువంటి విషయమే అని అంబటి రాంబాబు అన్నారు. ఈ సందర్భంలో కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ ఉన్న వనరుల మేరకు కరోనా వ్యాధిని ఎదుర్కోవటం కోసం, కరోనా వ్యాధి వచ్చిన వారికి తక్షణం చికిత్స అందించే విధంగా కలిసి కట్టుగా పని చేస్తున్నాయన్నారు. ఈ సందర్భంలో ప్రజలు అందరూ కూడా ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తున్నారు, సహకరిస్తున్నారని అంబటి తెలిపారు. 

కొన్ని చోట్ల ఎక్కడైనా ప్రజలు సహకరించకపోతే వారందరూ సహకరించే విధంగా ప్రభుత్వ యంత్రాంగం పని చేస్తోందన్నారు. అదే విధంగా రాజకీయ పార్టీలు, అన్ని రాజకీయ పక్షాలు కూడా ప్రభుత్వం చేసే విధానాలకు అనుగుణంగా పనిచేయాల్సిన సందర్భం ఇదని అంబటి రాంబాబు కోరారు. రాజకీయ పార్టీల్లో అనేక రకాల విబేధాలు ఉన్నా ఇలాంటి సమయంలో ప్రభుత్వం చేసేటటువంటి ప్రతి పనిని కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లి ప్రతిపక్షాలు సహకరించి వారి ధర్మాన్ని నిర్వర్తించాలన్నారు. 

అయితే మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బయటకు ప్రభుత్వానికి  సహకరించాలి అని చక్కగా చెబుతున్నారని అంబటి అన్నారు.  ఈ సందర్భంలో   జగన్‌ ప్రభుత్వాన్ని విమర్శించకూడదని చంద్రబాబు పైకి చెబుతున్నా ఆయనకు అనుకూలంగా ఉండే సోమిరెడ్డి లాంటి  నాయకులు మాత్రం విమర్శలు చేస్తున్నారని అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఎన్నికలు ఆగిపోయిన సందర్భాన్ని పురస్కరించుకొని సోమిరెడ్డి రాజకీయాలు మాట్లాడుతున్నారు. అయితే తప్పకుండా రాజకీయాలు మాట్లాడుదామని... కానీ దానికి ఇది సమయం కాదన్నారు. కరోనా వైరస్ అంశం ముగిసిన తర్వాత ఎన్నికలు వాయిదాలు.. దాని వెనుక జరిగిన కుట్రలు, రమేష్‌ కుమార్ విషయాలు అన్నీ మాట్లాడుదామని తప్పులేదన్నారు. ఇది సరైన సమయం కాదనే ఇంగిత జ్ఞానం ఎందుకు కోల్పోతున్నారో తనకు అర్థం కావటం లేదని అంబటి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 

చంద్రబాబు నాయుడు ఏమో సూక్తులు చెబుతున్నారు...  కానీ ఆయనకు అనుకూలంగా ఉండే రాజకీయ నాయకులు విమర్శలు చేస్తున్నారని అంబటి అన్నారు.  కొన్ని అనుకూల వెబ్‌సైట్లు, ఫేస్‌బుక్‌లలో ఆయన తాబేదారులు అనేక రకాల విమర్శలు చేస్తున్నారు. ఆయనకు సంబంధించి టీడీపీకి సంబంధించిన మీడియాలో, యూట్యూబుల్లో పెట్టి ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోసే కార్యక్రమం చేస్తున్నారని... ఇది సరైన విధానం కాదని,  ప్రజలు సహించరని అంబటి తెలిపారు. 

''పవన్ కళ్యాణ్‌ గారు నిన్నో, మొన్నో ట్వీట్ చేశారు. అది కొంత బాధ్యతారాహిత్యంగా కనిపించింది. వాలంటీర్లు అందరూ కూడా గట్టిగా పనిచేయాలని, వారు సరిగ్గా పనిచేయటం లేదని సర్వత్రా వినిపిస్తోందని వాలంటీర్ల ఆత్మస్థైర్యం దెబ్బతినేలా పవన్ మాట్లాడటం సరికాదు. వైయస్‌ఆర్‌సీపీ వాలంటీర్లు అనేమాట పవన్ కళ్యాణ్‌ ఎందుకు మాట్లాడుతున్నారు? వారు వైయస్‌ఆర్‌సీపీ వాలంటీర్లా? ప్రభుత్వ వాలంటీర్లు అని మాట్లాడే జ్ఞానం మీకు లేదా?'' అని అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు.