కేసీఆర్ ప్రభుత్వం ఏం చేస్తోంది... మీరేం చేస్తున్నారు: జగన్ కు దూళిపాళ్ల లేఖ

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు  టిడిపి  నాయకులు దూళిపాళ్ల నరేంద్ర ప్రభుత్వోద్యోగుల సమస్యలపై బహిరంగ  లేఖ రాశారు. 

TDP Leder dulipalla  narendra open letter to  AP CM  Jagan

అమరావతి: కరోనా మహమ్మారి కారణంగా ప్రభుత్వోద్యోగులు, సాధారణ రైతులకు అన్యాయం చేసేలా వైఎస్  జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని టిడిపి సీనియర్ నాయకులు దూళిపాళ్ల నరేంద్ర మండిపడ్డారు. ఈ  విషయమై  సీఎం జగన్ కు బహిరంగ లేఖ రాశారు.  

జగన్ కు దూళిపాళ్ల రాసిన లేఖ యధావిధిగా

గౌ.ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి,
      
వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి గారికి...  

విషయం : ఉద్యోగుల జీతాల్లో కోత విధించడంపై...

ప్రభుత్వ ఖజానాలో రైతుల పంటలు కొనుగోలు చేసేందుకు, కరోనా నివారణ చర్యలకు సరిపడా నిధులున్నాయి. మార్కెట్ ఇంటర్వెన్షన్ నిధులతో రైతుల నుండి పంటలు కొనుగోలు చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. బడ్జెట్ సమావేశాల్లే పేర్కొన్నారు. ఆప్రక్రియ ఏమైంది.? పక్కనున్న తెలంగాణ ప్రభుత్వం ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేస్తానని ప్రకటించింది. కానీ మీరు మాత్రం కొనుగోలు కాదు కదా.. దాని గురించి కనీస ప్రకటన కూడా చేయలేదు.   

ఆక్వా, ఫౌల్ట్రీ, హార్టీకల్చర్ ఉత్పత్తులను ప్రభుత్వ నిధుల నుండి ఎందుకు కొనుగోలు చేయడం లేదు.? ప్రభుత్వం వద్ద గతేడాది కన్నా ఈ సంవత్సరం రూ.30 వేల కోట్లు అధనంగా ఉన్నాయని ఉద్యోగ సంఘాలే చెబుతున్నాయి. అయినా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల వేతనాల్లో కోతలు ఎందుకు విధించినట్లు.? రైతుల నుండి పంటలను ఎందుకు కొనుగోలు చేయడం లేదు. కరోనాపై ఖర్చు ఎందుకు తగ్గించినట్లు.? కొత్తగా కరోనా నిర్ధారణ ల్యాబ్స్ ఏర్పాటుకు నిధులు ఎందుకు వెచ్చించడం లేదు.? అసలు ప్రభుత్వ ఖజానాలో ఉన్న నిధుల గురించి ఎందుకు ఇంత గోప్యం పాటిస్తున్నారు.? 
(ఉద్యోగ సంఘాలిచ్చిన నిధుల వివరాలు జతపరచడమైనది...)

దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కరోనా ప్రభావం ఉంది. అన్ని చోట్లా వైద్యారోగ్య శాఖ పటిష్టమైన చర్యలు తీసుకుంటోంది. పరిశుభ్రతా చర్యలు తీసుకుంటున్నారు. అయినా ఎక్కడా ఏ రాష్ట్రంలో కూడా ఉద్యోగుల వేతనాలు గానీ, పెన్షన్ దారులకు పెన్షన్ మొత్తంగా గానీ ఆగలేదు. కానీ మన రాష్ట్రంలో కరోనాపై తీసుకుంటున్న చర్యలూ అంతంత మాత్రమే. పరిశుభ్రతా చర్య అంతంత మాత్రంగానే ఉన్నాయి. కానీ.. వేతనాల్లో కోత విధించడం ప్రభుత్వ వైఫల్యానికి అద్దం పడుతోంది. 365 రోజుల్లో 358 రోజులు రాష్ట్రానికి ఆదాయం వస్తోంది. కానీ వారం రోజులు ఆదాయ రాలేదని సాకుగా చూపించి వేతనాల్లో కోతలు పెట్టడం ప్రభుత్వ చేతగాని తనం కాదంటారా.?

చంద్రబాబు నాయుడు గారు 2014లో అధికారంలోకి వచ్చేనాటికి రూ.16వేల కోట్ల లోటు బడ్జెట్ ఉంది. అధికారంలోకి వచ్చీ రాగానే.. హుధూద్ వంటి మహా ప్రళయం రాష్ట్రాన్ని కకావికలం చేసింది. విభజన సమస్యలు వెంటాడాయి. ఉద్యోగులు కూర్చుని పనిచేయడానికి సరైన వసతుల్లేవు. అంతెందుకు ముఖ్యమంత్ర కూర్చోడానికి కుర్చీ లేని పరిస్థితి. అయినా ఏరోజూ ఉద్యోగుల వేతనాల్లో కోతలు కాదు కదా.. ఒక్క రోజు ఆలస్యం కూడా కాలేదు. అయినప్పటికీ.. నాడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న మీరు.. ఎన్నో రకాలైన విమర్శలు చేశారు. ఈ రోజు మీరు అధికారంలోకి వచ్చిన పది నెలలకే పాలన చేతకాక, ఆదాయం సృష్టించడం తెలియక ఉద్యోగులకు వేతనాలు ఎగ్గొట్టడానికి సిద్ధపడ్డారు.

స్థానిక సంస్థలకు 14వ ఆర్ధిక సంఘం ఇవ్వాల్సిన నిధుల్ని ఇటీవలే ఇచ్చినప్పటికీ.. ఇంకా ఈ బీద అరుపులు ఎందుకు.? ఎక్కడా ఉద్యోగులకు వేతనాల చెల్లింపులు ఆపొద్దు. అవసరం అయితే రెండు మూడు నెలల జీతాన్ని అడ్వాన్సుగా ఇవ్వాలని ప్రధానమంత్రి సూచించారు. కానీ.. మీరు మాత్రం జీతాల్లో కోతలు విధిస్తున్నారు. మీరు, మీ మంత్రులు, మీ పేటీఎం బ్యాచ్ చెబుతున్నట్లు ఇది కోత కాదు కొంత మొత్తం ఇప్పుడు చెల్లించి మిగిలినది అందుబాటులో ఉన్నపుడు చెల్లిస్తాం అని చెప్పి ఏమార్చడం చూస్తుంటే.. కనీసం వారం రోజుల పాటు ఆర్ధిక వ్యవస్థను నడిపించలేని మీ అసమర్ధత ఇప్పటికే ప్రజలకు తెలిసిపోయింది.

అసలు ఆర్థిక సంక్షోభం ఉద్యోగుల కారణంగా వచ్చిందా లేక మీ నిర్లక్ష్యపు వైఖరి కారణంగా వచ్చిందా.? లేని ఆర్ధిక సంక్షోభాన్ని ఉన్నట్లుగా ఎందుకు చూపిస్తున్నారు.? ప్రభుత్వాధినేతగా.. అందరికి ఆదర్శంగా నిలవాల్సిన సమయంలో ఈ రకమైన నిర్ణయం తీసుకోవడం బాధాకరం. ముందు చూపు లేకుండా తీసుకున్న ఈ నిర్ణయం సమాజ ఆర్ధిక వ్యవస్థ మీద కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. మీరు తీసుకున్న ఈ ఏకపక్ష నిర్ణయంతో ఉద్యోగులు ఎన్ని రకాలైన ఇబ్బందులు ఎదుర్కొంటారో ఒక్క క్షణమైనా ఆలోచించారా.? మీ నిర్ణయాన్ని పున:సమీక్షించి జీతాలు వెంటనే చెల్లించండి, రైతుల పంటలు కొనుగోలుకు చర్యలు ప్రారంభించండి.

 

                                                                                                                                                                                                                              ధూలిపాళ్ల నరేంద్ర,
                                                                                                                                                                                                                                    మాజీ ఎమ్మెల్యే 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios