ఆమె మృతికి మంత్రే కారణం... జగనే ఆ శాఖ బాధ్యతలు తీసుకోవాలి: దేవినేని ఉమ

కరోనా వైరస్ నుండి ప్రజల ప్రాణాలను కాపాడాలన్న ప్రయత్నం ఓ వృద్ద మహిళ మృతికి కారణమవడంపై మాజీ మంత్రి, టిడిపి నాయకులు దేవినేని ఉమ స్పందించారు. 

TDP Leader Devineni Uma Reacts in Vizag Lady Death over ration

విశాఖ జిల్లా చోడవరం ద్వారకా నగర్ కు చెందిన షేక్ మీరాబీ రేషన్ కోసం వెళ్లి క్యూ లైన్ లో ఉండి మృతి చెందటం చాల బాధాకరమని... దీనిపై  సీఎం జగన్ స్పదించి మృతురాలి కుటుంబానికి ఎక్స్ గ్రేషియో ప్రకటించాలని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు డిమాండ్ చేసారు . సోమవారం గొల్లపూడి కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... పౌర సరఫరాల శాఖ నుండి మంత్రి కొడాలి నాని ని తొలగించి సీఎం స్వయంగా బాధ్యత తీసుకోవాలని కోరారు. 

ఇంటింటికీ రేషన్ పంపుతామని స్వయంగా చెప్పిన మంత్రి  కొడాలి నాని వృద్ధురాలి మృతికి నైతిక బాధ్యత వహించి రాష్ట్ర ప్రజలకు ఏం సమాధానం చెప్తారని డిమాండ్ చేసారు. ప్రజలు కట్టిన పన్నులు రూ.3800కోట్లుతో వాలంటీర్ల జీతాలు కడుతూ రాష్ట్రాన్ని ఉద్ధరిస్తామంటూ 7 దశాబ్దాలుగా పనిచేస్తున్న రెవెన్యూ వ్యవస్థను చంపెసారని ఆవేదన వ్యక్తం చేసారు. 

ఇంటింటికి వెళ్లి రేషన్ ఇస్తామని గొప్పలు చెప్పి ఊదరగొట్టారని... ఈ పని సత్వరమే చేపట్టాలని కోరారు.   రైతు బజార్లలో పూర్తి స్థాయిలో షాపులు లేవని, కూరగాయలు నిత్యావసరాలు పూర్తి స్థాయిలో సరఫరా చేయలేకపోతున్నారని... ప్రభుత్వం మాటలు కోటలు దాటుతుంటే చేతలు గడపలు దాటడం లేదని ఎద్దేవా చేశారు. రోజు పత్రికల్లో మాట్లాడుతూ ఊదరగొడుతున్నారే తప్ప క్షేత్రస్థాయిలో పనులు శూన్యమని ఆరోపించారు. 

ముఖ్యమంత్రి జగన్ తన మొదటి ప్రెస్ మీట్ లో పారాసిట్మాల్, బ్లీచింగ్ పౌడర్... రెండో మీట్ లో ఆ ప్రస్తావనే లేదని...ఇక  మూడో ప్రెస్ మీట్ లో ఏం మాట్లాడుతున్నారో ఆయనకే ఆర్థం కాలేదన్నారు. మంత్రులు, అధికారులు మాట్లాడే మాటలకు సమన్వయం లేకుండా పోయిందన్నారు. వాలంటీర్ వ్యవస్థ లేని రోజుల్లో ఇదే రెవెన్యూ అధికారులతో హుద్ హుద్, తిత్లీ తుఫానుల సమయంలో సమర్థవంతంగా పనిచేశామన్నారు.

ఈ సమయంలో ముఖ్యమంత్రిగా వున్న చంద్రబాబు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ మూడు జిల్లాల్లో 25 కేజీల బియ్యం 5లీటర్ల కిరోసిన్, 1 కేజీ పంచదార, 2కేజీల కందిపప్పు, 1కేజీ ఉప్పు, 1లీటర్ పామాయిల్  అరకేజీ కారం, 3కేజీల బంగాళదుంపలు, 2కేజీల ఉల్లిపాయలు ఉచితంగా పంపిణీ చేయించారని... అదే పని ఇప్పుడు వైయస్ జగన్ ప్రభుత్వం ఎందుకు చేయలేకపోతుందని ప్రశ్నించారు. 

విదేశాల నుండి 29,672 మంది రాష్ట్రానికి వచ్చినట్లు, వీరిలో 29,494 మంది సెల్ఫ్ క్వారంటైన్ లో ఉన్నట్లు, 175 మంది  ఆసుపత్రుల్లో ఉన్నట్లు ప్రభుత్వం వారు  చెబుతున్నారని, ఏ ఏ ప్రాంతాల్లో ఎంత  మంది ఉన్నారో తెలిపితే ఆ ప్రాంత ప్రజలు ఎక్కువగా జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉందని సూచించారు. వెయ్యి కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చు పెట్టి నియమించుకున్న సలహాదారులు ప్రభుత్వానికి ఏం సలహాలిస్తున్నారో చెప్పాలని...సజ్జల రామకృష్ణారెడ్డి, హై లెవల్ కమిటీ సభ్యులు ఏం చేస్తున్నట్లని ప్రశ్నించారు.   

రెండో పంట చేతికొచ్చిన తరుణంలో ఎక్కడ గోదాములు ఖాళీ ఉన్నాయో సంబంధిత మంత్రి ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నారని ఆరోపించారు. పక్క రాష్ట్రాల్లో ప్రభుత్వ యంత్రాంగం కోటి 5 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తామని చెప్పారని, కానీ ఏపిలో సార్వా పంట ధాన్యమే ఇంత వరకు పూర్తిగా కొనుగోలు చేయలేదని, కొనుగోలు చేసిన ధాన్యానికి  డబ్బులు చెల్లించలేదని అన్నారు. ధాన్యం కొనుగోలు పూర్తిగా ఆగిపోయిన విషయం  సీఎం దృష్టిలో ఉందో లేదో చెప్పాలని దేవినేని ఉమ డిమాండ్ చేశారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios