కరోనా నుండి ప్రజల దృష్టి మరల్చడానికే... ఆ నిర్ణయం సరైనదే: సజ్జల
కరోనా మహమ్మారిపై ఏపి ప్రభుత్వం అద్భుతంగా పోరాడుతోంది కాబట్టి ప్రజలను ఈ విషయం నుండి మరల్చడానికే చంద్రబాబు, ఇతర టిడిపి నాయకులు యూనివర్సిటీల పాలక మండళ్లపై రాజకీయాలు చేస్తున్నారని వైసిపి నాయకులు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు.
తాడేపల్లి: రాష్ట్రంలోని యూనివర్సిటీలను విద్యాపరంగా అత్యున్నతంగా తీర్చిదిద్దడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని ప్రభుత్వం పాలక మండళ్ళను నియమించిందని ప్రభుత్వ ప్రజావ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాకే యూనివర్సిటీల పాలక మండలి నియామకం తొలిసారి జరిగిందన్నారు.
దేశ చరిత్రలో తొలిసారిగా సీఎం జగన్మోహన్ రెడ్డి 50 రిజర్వేషన్లతో యూనివర్సిటీ పాలక మండలి పోస్టులు భర్తీ చేశారని... దీంతో బీసీ, ఎస్సి ,ఎస్టీ, మైనార్టీలకు పాలక మండలిలో అవకాశం కల్పించారని తెలిపారు. పాలక మండలిలో మహిళలకు సైతం 50 శాతం మేర అవకాశం కల్పించబడిందని...సామాజిక న్యాయం జరగాలనే ఉద్దేశ్యంతో సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారని అన్నారు.
రాష్ట్రంలోని 14 యూనివర్సిటీల్లో 50 శాతం రిజర్వేషన్లు దాటి బీసీ, ఎస్సి, ఎస్టీ, మైనార్టీలకు జగన్ అవకాశం కల్పించారని అన్నారు. మొత్తం 116 మంది పాలకమండలి సభ్యులకు గాను 58 మంది మహిళలకు స్దానం కల్పించారని... పాలకమండలి సభ్యుల నియామక ప్రక్రియ ప్రజాస్వామ్యబద్దంగా జరిగిందని వెల్లడించారు. ఎవరైతే అప్లయ్ చేసుకున్నారో వారి అర్హతలు, ఉన్నత విద్యలను ప్రత్యేక కమిటి పరిశీలించిందని... ఇలా 390 మంది దరఖాస్తు చేసుకుంటే వారిని అన్ని విధాలా వడపోత పోసి యూనివర్శిటిల అభివృధ్దికి దోహదపడే 116 మందిని నియమించారని అన్నారు.
అయితే కొందరు కావాలనే వైసిపి నాయకులు సిఫార్స్ చేసినవారికే ఈ పదవులు వచ్చాయని తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. కానీ నియమితులైన సభ్యులలో అందరూ కూడా ఆయా రంగాలలో నిష్ణాతులేనని... పైగా రిజర్వేషన్ లకు లోబడి నియమించబడ్డవారని అన్నారు. ఉన్నత విద్యావంతులు, సమాజంలో ఆయా రంగాలలో ఉన్నతమైన వ్యక్తులను పాలకమండలి పదవుల్లో నియమించామన్నారు.
పాలక మండలి సభ్యులు నియామకం పై టీడీపీ నేతలు ఇకనైనా దుష్ప్రచారం చేయడం ఆపాలన్నారు. పాలకమండళ్ల నియామకాలలో సామాజిక న్యాయం పాటించడాన్ని పచ్చ మీడియా తట్టుకోలేకపోతోందని... మూడు రోజుల నుంచి పసిరిక పాములా తప్పుడు వార్తలు వండివారుస్తోందన్నారు.
ప్రపంచ మంతా కరోనా వైరస్ గురించి ఆలోస్తుంటే పచ్చమీడియాలో మాత్రం తప్పుడు వార్తలు రాస్తోందని మండిపడ్డారు. లాక్ డౌన్ ఉందని, రాజకీయ పాలక మండలి అంటూ మెడకాయమీద తలకాయలేని వార్తలు రాస్తున్నాయని విమర్శించారు. కరోనా లాంటి మహమ్మారి విజృంభిస్తూ ప్రజలంతా ఆందోళనలో వున్న నేపథ్యంలో తాము మంచి పని చేసి కూడా చెప్పుకోలేకపోతున్నామని పేర్కొన్నారు.
కరోనా ను ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొంటున్న తీరు నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్ కి పని చేయడమే తప్ప దాన్ని ప్రచారం చేసుకునే అలవాటు లేదన్నారు. యూనివర్సిటీ పాలకమండల్లకు సంబంధించి అన్ని పదవులు అర్హులకే కట్టబెట్టారని సజ్జల స్పష్టం చేశారు.
యూనివర్సిటీ పాలక మండలి పోస్టుల భర్తీ విషయంలో రిజర్వేషన్లు ఖచ్చితత్వం పాటించాలని సీఎం ఆదేశించారని...మహిళ రిజర్వేషన్లు విషయంలో కేవలం రెండు పోస్టులు తగ్గితే సీఎం ఒప్పుకోలేదని వెల్లడించారు. రిజర్వేషన్ల ప్రకారం మహిళలకు, బడుగు, బలహీన వర్గాలకు పదవులు దక్కవలసిందేనని సీఎం స్పష్టంగా చెప్పారన్నారు.
గతంలో చంద్రబాబు హయాంలో 11 యూనివర్సిటీల పాలక మండలి భర్తీలో పదవులను నామినేటెడ్ పద్దతిలో నియమించారని....దాని కోసం ప్రత్యేక జీవో కూడా జారీ చేశారని గుర్తుచేశారు. కానీ ఇప్పటి పాలకమండలి నియామకానికి ప్రత్యేకంగా ఓ కమిటిని ప్రభుత్వం నియమించిందన్నారు.
చంద్రబాబు హయాంలో అయితే ఆయన క్లాస్ మేట్ శ్రీనివాసులు నాయుడు తయారు చేసిన పాలక మండలి సభ్యులు జాబితాను ఆమోదించారని ఆరోపించారు. అసలు శ్రీనివాసులు నాయుడుకు ఏ అర్హత ఉందని పాలకమండలి సభ్యులను నియమించారో కూడా తెలియదన్నారు. దీనిపై ఎల్లో మీడియా అప్పుడు ఎందుకు వార్తలు రాయలేదని ప్రశ్నించారు.
ఏకంగా సంబంధిత శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావుకు కూడా తెలియకుండా యూనివర్సిటీ పాలక మండలి సభ్యులను నియమించారని తెలిపారు. ఈ విషయం అప్పట్లో అందరికి తెలుసన్నారు. చంద్రబాబు హయాంలో పాలకమండలి సభ్యుల నియామకాల్లో తప్పులు జరిగితే ఎల్లో మీడియా గాడిదలు కాసిందా అని విమర్శించారు. చంద్రబాబు హయాంలో జరిగిన తప్పులుపై పచ్చమీడియా ఎందుకు నోరు మెదపలేదని సజ్జల ప్రశ్నించారు.