పోలీసులూ మనుషులే: దురుసు చర్యలను వెనకేసుకొచ్చిన గౌతమ్ సవాంగ్
లాక్ డౌన్ అమలు విషయంలో పోలీసులు అక్కడక్కడ దురుసుగా వ్యవహరించడాన్ని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ వెనకేసుకొచ్చారు. కావాలని చేయలేదని, వారు కూడా మనుషులేనని, విసిగిపోయి కొన్ని చోట్ల అలా చేసి ఉంటారని ఆయన అన్నారు.
అమరావతి: లాక్ డౌన్ సందర్భంగా పోలీసులు కొన్ని చోట్ల దురుసుగా వ్యవహరించిన తీరును ఆంధ్రప్రదేశ్ డీజీపి గౌతమ్ సవాంగ్ వెనకేసుకొచ్చారు. పోలీసులు కూడా మనుషులేనని, ప్రజల ప్రవర్తన పట్ల విసిగిపోయి అలా ప్రవర్తించి ఉంటారని, అది సమాజ శ్రేయస్సు కోసమేనని ఆయన అన్నారు. కొన్ని చోట్ల అతిగా ప్రవర్తించిన సందర్భాలు ఉన్న విషయం నిజమేనని, వారిపై చర్యలు కూడా తీసుకున్నామని ఆయన శనివారం మీడియాతో చెప్పారు.
దురుసుగా ప్రవర్తించిన పోలీసులపై చర్యలు తీసుకోవద్దని ప్రజలు కోరుతున్నారని, తమకు ఫోన్లు కూడా వస్తున్నాయని ఆయన చెప్పారు. ఓ గ్రామంలో కొంత మంది ఇష్టం వచ్చినట్లు తిరుగడం ప్రారంభించారని, గ్రామస్థులు చెప్పినా వినకుండా వారిపైనే తిరగబడ్డారని, పోలీసులు ఐదుసార్లు ఆ గ్రామానికి వెళ్లారని, చివరగా పోలీసులు అక్కడికి వెళ్లి కాస్తా కఠినంగా వ్యవహరించడంతో పోలీసులపైకి కూడా తిరగబడ్డారని ఆయన వివరించారు.
కావాలని పోలీసులు దురుసుగా ప్రవర్తించలేదని, విసిగిపోయి వ్వహరించారని ఆనయ చెప్పారు. అటువంటి సంఘటనలు జరగడం బాధాకరమేనని ఆయన అన్నారు. ఎవరినీ కొట్టాలనే ఉద్దేశం పోలీసులకు లేదని, ప్రజల మంచికోసమే వారు పనిచేస్తున్నరని, రోడ్ల మీద నిలబడి విధులు నిర్వహిస్తున్నారని ఆయన చెప్పారు. సమాజంకోసం, రాష్ట్రం కోసం, దేశం కోసం వారు పనిచేస్తున్నారని ఆయన చెప్పారు.
పోలీసులు దురుసుగా వ్యవహరించినట్లు చెప్పే వాటిని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని, అది మంచిది కాదని ఆయన చెప్పారు ప్రజలు పోలీసులకు సహకరించాలని ఆయన అన్నారు. పబ్లిక్ హెల్త్ ఎమర్జన్సీ, నేషనల్ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఏ దేశంలో కూడా పోలీసులతో ప్రజలు వాదించబోరని, మనది ప్రజాస్వామ్యం కాబట్టి ఎదురు తిరుగుతున్నారని ఆయన అన్నారు.
రేపటి నుంచి పరిస్థితి మరింత మెరగవుతుందని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఎవరు కూడా బయటకు రావద్దని, అందరూ ఇళ్లలోనే ఉండాలని ఆయన చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా లాక్ డౌన్ పటిష్టంగా అమలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.