కరోనా సోకించే కేంద్రాలను జగన్ ప్రభుత్వమే ఏర్పాటుచేస్తోంది: మాజీ మంత్రి ఫైర్
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా అడ్డుకోవడంలో జగన్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి సుజయకృష్ణ రంగారావు మండిపడ్డారు.
విజయనగరం: రాష్ట్రంలో ఒక్కసారిగా పెరిగిన కరోన బాధితుల సంఖ్య ఆందోళన కలిగిస్తోందని... అందువల్ల రాష్ట్ర ప్రజలు ఇంటికే పరిమితం కావాలని మాజీమంత్రి సుజయ్ కృష్ణ రంగారావు సూచించారు. ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ కి పూర్తిగా సహకరించాలని... సామాజిక దూరంతోనే కరోనాను నియంత్రించగలమన్నారు. విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిని సకాలంలో ప్రభుత్వం గుర్తించలేకపోయిందన్నారు. వాలంటీర్లతో సర్వే సక్రమంగా సాగలేదన్నారు. ప్రభుత్వం కేవలం ప్రకటనలకే పరిమితం అయ్యిందన్నారు.
వాస్తవ పరిస్థితులపై క్షేత్రస్థాయి పర్యవేక్షణ కొరవడిందని అన్నారు. ప్రభుత్వం కరోన సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పటిష్టమైన విధానంతో చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వం రేషన్ దుకాణాల ఎదుట ప్రజల్ని ఈ సమయంలో నిలబెట్టిందన్నారు. లాక్ డౌన్ కి ప్రభుత్వమే తూట్లు పొడుస్తోందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎండల తీవ్రత ఓ వైపు కరోన విజృంభన మరోవైపు విరుచుకు పడుతున్న సమయంలో రేషన్ దుకాణాల ఎదుట జనం గుమిగూడేలా చేసి మరింత ప్రమాదకర పరిస్థితులను సృష్టించిందని మండిపడ్డారు.
రేషన్ దుకాణాలు కరోన సోకించే కేంద్రాలు అయ్యే ప్రమాదం ఉందని ప్రభుత్వానికి అవగాహన లేదా అని నిలదీశారు. ప్రభుత్వం అనాలోచిత చర్యలు కరోన వ్యాప్తికి కారణం అవుతున్నాయన్నారు. రేషన్ సరుకులు ఇంటింటికి పంపిణీ చేయాల్సింది పోయి బ్యాగ్ లతో ఇంటింటికి పంపిణీ చేస్తే కరోన సంచుల ద్వారా వ్యాప్తి చెందుతుందని మంత్రులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.
అరుబయటకు వచ్చి రేషన్ దుకాణాల ఎదుట గుంపులుగా సంచరిస్తే కరోన వ్యాప్తి చెందదని మంత్రులు చెప్పగలరా? అని ప్రశ్నించారు. రేషన్ సరుకులు తెచ్చుకునేందుకు మండుటెండలో ఓ వైపు కరోన భయంతో మరో వైపు పేదలు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం స్పందన రివర్స్ లో ఉండటం బాధాకరమన్నారు.
ప్రభుత్వం ఎంతో గొప్పగా చెప్పుకుంటున్న వాలంటీర్ వ్యవస్థతో రేషన్ సరుకుల పంపిణీ ఎందుకు చేయలేకపోయారని అన్నారు. ఈ వైఫల్యానికి సహేతుకమైన కారణాలు చెప్పకుండా సంచులకు కరోన వైరస్ అంటుతుంది అని మంత్రులు అర్ధరహితంగా, భాద్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని అంటున్నారు.
సామాజిక దూరం పాటించాలని ఇంటికే పరిమితం కావాలని వైద్య నిపుణులు హెచ్చరించిన రేషన్ సరుకుల పంపిణీ ఇందుకు విరుద్ధంగా నిర్వహించడం పూర్తిగా భాధ్యతారహిత్యం కాదా? అని ప్రశ్నించారు. విపత్కర సమయంలో ప్రతిపక్షాలు ప్రజలు ఇస్తున్న సూచనలు పాటించడం ప్రభుత్వం అవమానంగా భావించడం సరికాదన్నారు.
కరోన వ్యాధిగ్రస్తుల సంఖ్య నానాటికీ పెరుగుతోందని... ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఇది సమయం కాదన్నారు. ప్రభుత్వం మెరుగ్గా పని చేయాలని... కరోన నియంత్రణ అందరి ప్రాధాన్యత వుండాలన్నారు. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో ప్రతిపక్షాలపై రాజకీయ ఆరోపణలు... నోటికి ఏది వస్తే అది సాక్షాత్తు మంత్రులు, పార్లమెంట్ సభ్యులు మాట్లాడటం, దిగజారుడు భాషతో దూషణలు చేయటం ప్రజలంతా గమనిస్తున్నారని అన్నారు. ఈ పద్దతి మార్చుకొని కరోన నియంత్రణ ఏర్పాట్లపై పారదర్శకంగా జవాబుదారితనంతో వ్యవహరించాలని మాజీ మంత్రి తెలిపారు.