అమరావతి: కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తున్న ఆపత్కాలంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ముందు చూపులేని జగన్ వంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండటం దౌర్బాగ్యమని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. ముఖ్యమంత్రిగా విశేషమైన అనుభవం వున్న టిడిపి అధ్యక్షులు చంద్రబాబు నాయుడు సూచనలను జగన్ ప్రభుత్వం పరిగణలోకి తీసుకోకపోవడం సిగ్గుచేటని...ఈ సమయంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటే బాగుండేదని ప్రజల భావిస్తున్నారని పేర్కొన్నారు. 

ప్రపంచ వ్యాప్తంగా 13 లక్షల మంది కరోనా బారిన పడ్డారని... దాదాపు 73వేల మంది మృత్యువాత పడ్డారని తెలిపారు.  ఇటలీ, స్పెయిన్, అమెరికా, చైనా, జర్మనీ లాంటి దేశాలు ఈ మహమ్మారి బారినపడి అతలాకుతలం అవుతున్నాయని... మన దేశంలోనూ దాదాపు 4,285 మందికి కరోనా పాజిటివ్ రావడం ఆందోళన కలిగిస్తోందన్నారు.  ఏపిలోనూ 303 పాజిటివ్ కేసులు రావడం ప్రజల ఆందోళనలను మరింత పెంచిందని అన్నారు. 

కరోనాను కట్టడి చేయడంలో ప్రభుత్వ అధికారులు, వైద్య నిపుణులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు, మీడియా పడుతున్న శ్రమను ఎప్పటికీ మరిచిపోలేమని...వారికి జీవితాంతం రుణపడి ఉంటామన్నారు. ఇంత చేస్తున్నా ఇప్పటి వరకు ముగ్గురు చనిపోయారని... వైద్యులు మంచి సేవలను అందించి మరణాలను తగ్గించాలని కోరుకుంటున్నాని పేర్కొన్నారు. 

బాధ్యత గల మంత్రులు, శాసనసభ్యులు పని తీరు బాధకలిగిస్తోందని అన్నారు. చంద్రబాబు నాయుడు సూచనలను ప్రభుత్వం ఎందుకు పరగణలోకి తీసుకోవడం లేదో చెప్పాలన్నారు. పైపెచ్చు రాజకీయంగా ఎదురు దాడి చేయడం ఎంత వరకు సమంజసం? అని ప్రశ్నించారు. ప్రజలు భయబ్రాంతులకు గురి అవుతున్న సమయంలో వాళ్లకు భరోసాను ఇవ్వకుండా రాజకీయ విమర్శలు చేయడం వలన అధికార పార్టీ నాయకులు మనుషులేనా అన్న సందేహం కలుగుతోందని మండిపడ్డారు. 

మాజీ ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు సలహాలు ఇవ్వాలని స్వయంగా ప్రధాని మోదీ కోరుతున్నారని.... కాని ఏపీలో మాత్రం అధికారపక్షం అలాంటివారి సూచనలు పాటించటం లేదు? అని అన్నారు. కరోనాను అరికట్టేందుకు టెస్టులు పెరిగితే దాని ద్వారా మనం కంట్రోల్ చేసే అవకాశం ఉందని చంద్రబాబు నాయుడు ముందే చెబితే అధికారపక్షం నాయకులు ఎదురుదాడి చేశారని... నేడు జగన్ టెస్టులు పెరగాలి సూచనలు ఇస్తున్నారని పేర్కొన్నారు. 

వైద్యసేవలకే కాదు ఈ విపత్కర సమయంలో ప్రాణాలకు తెగించి సేవలందించే ఎవరికి మాస్కులు ఇవ్వలేని పరిస్థితి వుందన్నారు. కేంద్ర నుండి వచ్చిన కిట్స్ అధికారపక్షం నాయకులు తీసేసుకున్నారని... కానీ డాక్టర్లకు ఆయుధాలు ఇవ్వకుండా యుద్ధాలు చేయమంటున్నారని తెలిపారు. మెడ్ టెక్ పార్క్ ను అధికారపక్షం నిర్వీర్యం చేసిందని... ఆనాడే దానిని పట్టించుకొని ఉంటే మనమే ఇతర దేశాలకు మందులు సరఫరా చేసి ఉండేవాళ్లమన్నారు. వీటి గురించి ఆలోచించకుండా చంద్రబాబు నాయుడు మీద దాడి చేయాలన్న ధ్యాసే తప్ప వైకాపా నాయకులకు మరొకటి లేదన్నారు. 

 ప్రధానమంత్రి రూ.1000, 5 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, గ్యాస్ ఉచితంగా ఇస్తున్నారని అన్నారు. ఇతర రాష్ట్రాల్లో అసంఘటిత కార్మికులను ఆదుకుంటున్నారని... మన రాష్ట్రంలో కేంద్రం ఇచ్చిన డబ్బులను జగన్ ఇచ్చినట్లుగా ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపించారు. రాజకీయ నీచానికి పాల్పడుతున్నది వైకాపా నాయకులు కాదా? అని ప్రశ్నించారు.

అధికార పక్షం తీరును ఎన్నికల కమీషన్ తప్పుపడుతున్నా వాళ్లకు బుద్ధి రాలేదన్నారు. రైతాంగం చాలా ఆందోళనలో ఉన్నారని... మంత్రులు దాని మీద రివ్యూలు పెట్టరు? అని అన్నారు. గతంలో రూ.16,000 వచ్చిన అరటి పంట నేడు రూ.3వేలకు మించి రావడం లేదని...  బొప్పాయి గతంలో రూ.13,000 వుంటే నేడు రూ.7వేలకు మించి రావడం లేదన్నారు. 

నేడు దయనీయ పరిస్థితిలో ఆక్వా రైతలు ఉన్నారని... గతంలో టన్ను లక్షా 80వేలు ఉంటే నేడు రూ.70వేలు వుందన్నారు. ఇలా రైతులు తెగనమ్ముకుంటుంటే ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారని అన్నారు. జగన్ పాలన మొదలైనప్పటి నుండి రాష్ట్ర ప్రజలు అల్లాడిపోతున్నారని... 10 రోజుల్లోనే ఉద్యోగస్థులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలోకి ప్రభుత్వం వెళ్లడం బాధాకరమన్నారు. 

వైకాపా కాంట్రాక్టర్లకు, దళారులకు మాత్రం రూ.6400 కోట్లు చెల్లించుకుని.... ఉద్యోగస్థులకు ఇవ్వాలంటే మాత్రం ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉండవా? అని నిలదీశారు.  దాదాపు 1.42 లక్షల మందిలో ఎంత మందికి రేషన్ సరుకులు ఇచ్చారు?  రూ.1000 ఎంత మందికి ఇచ్చారు? అని ప్రశ్నించారు. ఇవి కూడా కేవలం వైకాపా కార్యకర్తలకు మాత్రమే ఇచ్చారు అని ఆరోపించారు. 

ఒక పక్క ఇసుక దందాలు చేసుకుంటున్నారని... వీటికి లాక్ డౌన్ అడ్డం కాదా? అని ప్రశ్నించారు. భయటకు వెళ్లి పని చేసుకునే సామాన్యుడికి మాత్రమే సామాజిక దూరమా... అదే వైకాపా కాంట్రాక్టర్లకు సామాజిక దూరం అవసరం లేదా? అని నిలదీశారు. కరోనా పరిస్థితిలోను దోచుకుంటున్న దౌర్బాగ్యమైన ప్రభుత్వం వైకాపాది మాత్రమే అన్నారు. 

''కరోనా అంటే కేవలం జ్వరం మాత్రమే, పారాసిట్మాల్, బ్లీచింగ్ వేస్తే సరిపోతుందని ముఖ్యమంత్రి చెప్పడం ఆయన అవగాహన లోపానికి అద్దం పడుతుంది. రివ్యూలు పెట్టి ఇసుక, గ్రావెల్, మట్టి అమ్ముకోమని చెబుతున్నారు. ఇటువంటి ముఖ్యమంత్రి ఏపీకి పట్టిన చీడపురుగు'' అని మండిపడ్డారు.

''మచిలీపట్నంలో సరైన నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితిలో సమాచారా శాఖా మంత్రి ఉన్నారు. మచిలీపట్నంలో కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తికి మార్చి 25 నుంచి ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. ఏప్రిల్ 1న మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. 4వ తేదీన విజయవాడ తరలించారు. ఆయన మీద అనుమానాలు ఉన్న వెంటనే ఆయనను విజయవాడ పంపి ఉంటే ప్రాణాలతో ఉండేవారు. ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా?  అతనికి కరోనా అవునో కాదో రిపోర్టు ఇవ్వలేదని వారి కుటుంబ సభ్యలు ఆందోళనలో ఉన్నారు'' అని ఆరోపించారు. 

'' క్వారంటైన్ లో ఉన్న వారికి సరైనా పర్యవేక్షణ లేదు. మచిలీపట్నంలో చనిపోయిన వ్యక్తి ప్రదేశంలో కనీసం శానిటైజ్ చేయడం లేదు. కేవలం ప్రతికల కోసం ఫోటోలకు ఫోజులు ఇస్తున్నారు. ప్రతి ఒక్క ఆంధ్రడు ఈ సమయంలో చంద్రబాబు నాయుడు ఉంటే ఇటువంటి పరిస్థితి ఉండేదా అని అందరూ మాట్లాడుతున్నారు. ఎదురుదాడి చేయడమే ప్రధమావధిగా వైకాపా నాయకులు భావిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలకు జీతాలు ఇవ్వకుండా వైకాపా ప్రభుత్వం అన్యాయం చేసింది'' అని రవీంద్ర మండిపడ్డారు.