అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  వైయస్‌.జగన్, తెలంగాణ సీఎం శ కేసీఆర్‌ మధ్య సంప్రదింపులు జరుగుతున్నాయి. కోవిడ్‌–19 నివారణలో భాగంగా ప్రస్తుతం ఎక్కడి వారిని అక్కడే ఉండేట్టుగా చూడాలని ఇరువురు ముఖ్యమంత్రులు నిర్ణయించుకున్నారు. జగ్గయ్యపేట వద్ద ప్రస్తుతం వేచిచూస్తున్న ఏపీ వారికి హెల్త్‌ ప్రోటోకాల్‌ పాటించి రాష్ట్రంలోకి అనుమతించాలని జగన్ నిర్ణయం తీసుకున్నారు. 

ఇక హైదరాబాద్‌ నుంచి ఎవ్వరు వచ్చినా అనుమతించేది లేదని ఏపీ అధికారులు స్పష్టం చేశారు. ఇలా చేయడంవల్ల వారికేకాక, కుటుంబ సభ్యుల ఆరోగ్యం కూడా రిస్క్‌లో పెట్టినట్టే అవుతుందని అధికారులుఅంటున్నారు. దయచేసి ఎక్కడివారు అక్కడే ఉండాలని ఏపి అధికారులు కోరారు. హాస్టళ్లు, పీజీ మెస్‌లు మూసివేయవద్దంటూ ఇదివరకే తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పదికి చేరుకుంది. తాజాగా గుంటూరు, విజయవాడల్లో ఈ కేసులు నమోదయ్యాయి. వాషింగ్టన్ నుంచి విజయవాడ వచ్చిన 21 ఏళ్ల యువకుడికి కరోనా సోకినట్లు నిర్ధారించారు.

మరో వైపు, గుంటూరు జిల్లాలో ఓ కరోనా కేసు బయటపడింది. ప్రత్యేక ప్రార్థనల్లో పొల్గొని ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు తేలింది. ఈ రెండు కేసులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పదికి చేరుకుంది. 

చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తికి చెందిన యువకుడికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలిన విషయం తెలిసిందే. లండన్ లో ఎంసిఏ చదువుతున్న ఆ యువకుడు ఈ నెల 18వ తేదీన లండన్ నుంచి బయలుదేరి 19వ తేదీన శ్రీకాళహస్తి చేరుకున్నాడు. 

తెలంగాణలో మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దాంతో తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 41కి చేరుకుంది. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోంది. మహారాష్ట్రలో అత్యధికంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.