కరోనా విజృంభణ... బ్లీచింగ్ పౌడర్ అయినా చల్లించావా?: విజయసాయి పై జవహర్ ఫైర్
కరోనా వెరస్ పై అలసత్వం వహిస్తున్న ఎంపీ విజయసాయి రెడ్డిపై మాజీ మంత్రి కేఎస్ జవహర్ మండిపడ్డారు.
గుంటూరు: ఏపి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజల ప్రాణాల పట్ల ఏ మాత్రం బాధ్యత లేకుండా వ్యవహరిస్తూ...బాధ్యతా రాహిత్యానికి బ్రాండ్ అంబాసిడర్ లా మారారని మాజీ మంత్రి, టిడిపి నాయకులు కేఎస్ జవహర్ మండిపడ్డారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కరోనాని సవాలుగా తీసుకుని యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటుంటే జగన్, ఆయన మంత్రులు మాత్రం కరోనాకి భయపడి సన్యాసం తీసుకుని ఇంట్లో కూర్చున్నారని విమర్శించారు.
జగన్ కేబినెట్ లోని మంత్రులు కనీసం వారి నియోజకవర్గాల్లో కూడా కరోనాపై సమీక్షలు నిర్వహించడం లేదని ఆరోపించారు. కరోనా దెబ్బకి ప్రజలు అందోళన చెందుతుంటే వైసిపి ప్రభుత్వం నామమాత్రపు చర్యలు చేపట్టి చేతులు దులుపుకునే ప్రయత్నం చేయడం బాధాకరమన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు కనీసం కరోనా పట్ల అధికారులు అవగాహన కల్పించిన దాఖలాలు లేవన్నారు. కనీసం శానిటైజర్స్, మాస్కులు కూడా ఇవ్వలేదన్నారు. వాలంటీర్ల ద్వారా రాష్ట్రాన్ని ఉద్దరిస్తున్నట్లు డప్పు కొట్టుకుంటున్న వైసీపీ రేషన్ కోసం ప్రజలని ఎండలో ఎందుకు నిలబెడుతున్నారు? అని ప్రశ్నించారు. విశాఖ జిల్లాలో ఎండలో నిలబడి వృద్ధురాలు ఎందుకు చనిపోయింది? అని అడిగారు.
''వాలంటీర్ల ద్వారా రేషన్ ఇంటింటికీ ఎందుకు సరఫరా చేయటం లేదు? ప్రజలను ఎండలో నిలబెట్టి వారి ప్రాణాలు తీసేదానికి ఇక వాలంటీర్లకు జీతాలు దేనికి? విపత్కర పరిస్థితుల్లో వైసీపీ నేతలు రాజకీయాలు మాట్లాడడం సిగ్గుచేటు'' అని విమర్శించారు.
''వైసిపి ఎంపీ విజయసాయిరెడ్డి కరోనా నివారణకు ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలన్నారు. ఆయన ఉండే ఏరియాలోనైనా కనీసం బ్లీచింగ్ పౌడర్ చల్లించాడా? స్థానిక ఎన్నికల్లో డబ్బు సంచులు చేత పట్టుకొని తిరిగిన విజయసాయి అండ్ కో.. ఇప్పుడెందుకు ఇళ్ళ నుంచి బయటకు రావటం లేదు? మీకు మీ పార్టీ మీద ఉన్న శ్రద్ధ ప్రజల ప్రాణాల మీద లేదా? ఎన్నికల్లో డబ్బులు పంచటమే కాదు, ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలకు మాస్కులు పంచటం కూడా నేర్చుకోవాలి'' అని మండిపడ్డారు.
''ఇక మంత్రి కొడాలి నాని చంద్రబాబు నాయుడిని తిట్టడం మాని సరుకుల పంపిణీపై దృష్టి పెట్టాలి. ప్రభుత్వం ఇకనైనా కరోనా నివారణకు పటిష్ట చర్యలు తీసుకోవాలి'' అని జవహర్ సూచించారు.