అనంతలో 7 కొత్త కరోనా కేసులు: హిందూపురంలో డాక్టర్లకు పాజిటివ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో కొత్తగా ఏడు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లాలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 13కు పెరిగింది. హిందూపురంలో ఇద్దరు వైద్యులకు కూడా కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలింది.

Coronavirus: Seven news Covid 19 cases recorded in Ananthapur

అనంతపురం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో కొత్తగా ఏడు కరోనా పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. దీంతో అనంతపురం జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 13కు చేరుకున్నాయి. మక్కా నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తులకు అనంతపురంలో కరోనా పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారణ అయింది.

అలాగే, కల్యాణదుర్గం నుంచి ఢిల్లీలో జరిగిన జమాత్ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వ్యక్తికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలింది. కాగా, ఇటీవల హిందూపురంలో కరోనా వైరస్ పాజిటివ్ తో ఓ వ్యక్తి మరణించిన విషయం తెలిసిందే. ఆ వ్యక్తికి చికిత్స అందించిన ఇద్దరు వైద్యులకు, ఇద్దరు నర్సింగ్ స్టాఫ్ కు కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలిందని కలెక్టర్ చంద్రుడు చెప్పారు.   

ఇదిలావుంటే, తిరుమల శ్రీవారి సన్నిధిలోని వేద పాఠశాలలో కరోనా కలకలం చెలరేగింది. ముగ్గురు వేద విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వారిని అశ్విని ఆస్పత్రికి తరలించారు. ఓ విద్యార్థికి కరోనా లక్షణాలు ఉండడంతో రుయా ఆస్పత్రికి పంపించారు. విద్యార్థులు గత నెలలో మహారాష్ట్రకు వెళ్లినట్లు సమాచారం. 

ఇదిలావుంటే, కర్నూలు జిల్లాలో లాక్ డౌన్ ఆంక్షలు కఠినంగా అమలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు అత్యధికంగా కర్నూలు జిల్లాలోనే నమోదయ్యాయి. ఇప్పటి వరకు 74 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 70 మంది రిపోర్టులు రావాల్సి ఉంది.

కర్నూలు జిల్లాలో కర్ఫ్యూను కఠినంగా అమలు చేస్తున్నట్లు ఎస్పీ ఫకీరప్ప చెప్పారు. ప్రస్తుతం 600 మంది క్వారంటైన్ కేంద్రాల్లో ఉన్నారు. 463 మంది నమూనాలను పరీక్షలకు పంపించారు. వీరిలో 338 ఢిల్లీ నిజాముద్దీన్ ప్రాంతానికి వెళ్లివచ్చినవారే. ఈ స్థితిలో ఆంక్షలు ఉలంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. జిల్లాలో 28 హాట్ స్పాట్లను గుర్తించినట్లు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బుధవారం ఉదయానికి 329 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మంగళవారంనాటికి 314 కేసులు నమోదు కాగా, బుధవారం ఉదయానికి మరో 15 కేసులు నమోదయ్యాయి. నెల్లూరులో 49 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. కర్నూలు జిల్లా నుంచే ఎక్కువ మంది నిజాముద్దీన్ కు వెళ్లినవచ్చినవారున్నట్లు చెబుతున్నారు. మరో 40 మంది ఇంకా కర్నూలు జిల్లాకు రాలేదని చెబుతున్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios