గుంటూరు: కరోనా వైరస్ వ్యాప్తిని  అరికట్టేందుకు సామాజిక దూరం పాటించాలని ప్రభుత్వం ఒక వైపు నిబంధనలు పెడుతూనే మరో వైపు ఉదయం పూట నిత్యావసరాల కొనుగోలు సమయంలో నిబంధనలకు నీళ్లొదిలిందని టిడిపి అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ మండిపడ్డారు. ఒక వైపు కూరగాయలు, నిత్యావసరాలు, మరో వైపు రేషన్ బియ్యం కోసం ప్రజలు బారులు తీరినా ప్రభుత్వం మాత్రం పట్టిపట్టనట్లుగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. 

కోవిడ్-19 నేపథ్యంలో దేశవ్యాప్తంగా కొనసాగుతున్న లాక్ డౌన్ ను ఆసరాగా చేసుకున్న వ్యాపారస్థులు ధరలు పెంచడంతో సామాన్యులు హడలిపోతున్నారని అన్నారు. పాలు, కూరగాయలు, దుకాణాల్లో సరుకుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని... వ్యాపారస్థులు ఇష్టానుసారంగా ధరల పెంచడంతో ప్రజలపై ఆర్థికభారం పడుతోందన్నారు. ఇలాంటి సమయంలో ప్రజలకు ధరలు అందుబాటులో ఉండేలా చూడాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని పేర్కొన్నారు. 

నిత్యావసర ధరల నియంత్రణ చేయడంలో జగన్ వైఫల్యం చెందారని అన్నారు.  నిత్యావసరాలు అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని, నిత్యావసర వస్తువుల విక్రయాలపై కాల్ సెంటర్ ఏర్పాటు లాంటివి మాటలకే పరిమితం చేశారు గాని ఎక్కడా ఆచరించిన పాపాన పోలేదన్నారు. ధరల నియంత్రణకు అధికారులు మోనిటరింగ్ చేస్తున్నా అది కింది స్థాయి వరకు వెళ్లడం లేదని తెలిపారు. 

వేరుశనగ నూనె రూ.140, బొంబాయిరవ్వ కిలోరూ. 32 నుంచి రూ.42, గోధుమ రవ్వ కిలో రూ.32 నుంచి రూ.44, కందిపప్పు కిలో రూ.80 నుంచి రూ.100, చక్కెర కిలో  రూ.30 నుంచి రూ.40, బెల్లం కిలో రూ.40 నుంచి రూ.60 వరకు అమ్ముతున్నారని అన్నారు. అన్ని రకాల వస్తువులపై దాదాపు రూ.10 నుంచి రూ.20 వరకు ధరలు పెంచి అమ్ముతున్నా  ప్రజలు విధిలేక కొనుక్కోవాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. 

వ్యాపారస్థులు నిత్యావసరాల ధరలను ఇప్పటికే రెండింతలు చేశారని తెలిపారు. పది రోజుల క్రితం చికెన్ కేజీ రూ.60 ఉండగా ఇప్పుడు రూ.200కి పెరిగిందన్నారు. కేజీ రూ.20గా ఉన్న టమాటాలు ఇప్పుడు రూ.40కి విక్రయిస్తున్నారని.... ఇంతటి వ్యత్యాసం ఈ పదిరోజుల్లోనే ఇలా ఉంటే మున్ముందు ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చని పంచుమర్తి అనురాధ మండిపడ్డారు.