విజయనగరం: యావత్ ప్రపంచాన్ని కరోనా మహమ్మారి భయకంపితులను చేస్తుంటే ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రజలను కాపాడటం మానేసి రాజకీయాలు చేస్తోందని టిడిపి నాయకులు, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఆరోపించారు.  లాక్ డౌన్ తో ఆదాయాన్ని కోల్పోయిన ఆకలితో అలమటిస్తున్న వారికోసం కేంద్రం ఇస్తున్న 1000 రూపాయలను ఇస్తోందని... వీటిని  అర్హులకు కాకుండా కేవలం వైకాపా నాయకులు పంచి రాజకీయానికి వాడుకోవడం సరికాదని అన్నారు. ఈ విపత్కర సమయంలో ఇలా చేయడం తగదని జగన్ ప్రభుత్వంపై మండిపడ్డారు. 

ఓవైపు రాష్ట్రంలో  కరోనా విజృంభిస్తుంటే దీని నివారణపై ముఖ్యమంత్రి అవగాహన లోపంతో వ్యవహరిస్తున్నారని  అన్నారు. దీంతో రాష్ట్ర ప్రజలందరూ నవ్వుకునే పరిస్థితి వుందన్నారు. ఎవరైనా చట్టానికి లోబడే పనిచేయాల్సిందేనని అన్నారు. విపత్కర పరిస్థితుల్లో ఉద్యోగుల జీతాలలో కోత విధించడం తగదని... ఈ నిర్ణయంపై ప్రభుత్వం మరోసారి పునరాలోచించుకోవాలని సూచించారు.

కరోనా నివారణకు కుటుంబాలను వదులుకుని 24 గంటలు కష్టపడుతున్న డాక్టర్లుకు, పోలీసులకు, పారిశుధ్ధ్య కార్మికులకు అధనంగా ప్రోత్సాహకాలు ఇవ్వాలని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు సూచించారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ కరాళనృత్యం చేస్తోంది. సోమవారం 8 గంటల వ్యవధిలో కొత్తగా 37 కేసులు నమోదయ్యాయి. దాంతో ఏపీలో కరోనా వైరస్ కేసులు 303కు చేరుకున్నాయి. కొత్తగా కర్నూలు జిల్లాలో 18, కడప జిల్లాలో 4, నెల్లూరు జిల్లాలో 8 కేసులు నమోదయ్యాయి. ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో కొత్త ఒక్కటేసి కేసులు నమోదయ్యాయి.

కర్నూలు జిల్లాలో అత్యధికంగా 74 కేసులు నమోదయ్యాయి. నెల్లూరుల 42 కేసులు నమోదయ్యాయి. కృష్ణా జిల్లాలో 29, కడప జిల్లాలో 27, విశాఖపట్నం జిల్లాలో 20, అనంతపురం ఆరు కేసులు నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలో 32 కేసులు రికార్డయ్యాయి. మర్కజ్ వెళ్లి వచ్చినవారికే ఎక్కువగా కరోనా వైరస్ సోకినట్లు తెలుస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లాలో 20 కేసులు నమోదయ్యాయి.

ఢిల్లీకి వెళ్లినవచ్చినవారందరినీ గుర్తించామని, వారికి సంబంధించినవారిని కూడా గుర్తించామని, వారందరినీ క్వారంటైన్ కు తరలించామని ప్రభుత్వం చెబుతోంది. కర్నూలు జిల్లాలో మరో 70 మందికి సంబంధించిన రిపోర్టులు రావాల్సి ఉంది. కృష్ణా జిల్లాలో సోమవారం మరో రోగి రికవరీ అయినట్లు, అతన్ని డిశ్చార్జీ చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. ఇప్పటి వరకు ఆరుగురు కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జీ అయినట్లు తెలిపింది. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో కరోనా వైరస్ కేసులు నమోదు కాలేదు.