విజయవాడ: ఇటీవల ఓ పానీపురి వ్యాపారి మక్కాకు వెళ్లి తిరిగి వచ్చిన నేపథ్యంలో విజయవాడలోని కృష్ణలంక ప్రాంతంలో అధికారులు అప్రమత్తమయ్యారు. కృష్ణా జిల్లా కలెక్టర్ కృష్ణలంక బంద్ ను ప్రకటించారు. పానీపురి వ్యాపారికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలింది. అతను 20 తోపుడు బండ్లతో పానిపురి వ్యాపారం చేస్తుంటాడు. 

పానీపురి వ్యాపారికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలడంతో 8 మంది అతని కుటుంబ సభ్యులకు, 14 మంది కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. అతను ఎవరెవరిని కలిశాడనే విషయంపై కూడా ఆరా తీస్తున్నారు. 

ఇటీవల ఢిల్లీలోని జమాతేకు వెళ్లి వచ్చినవారిపై కూడా అధికారులు ఆరా తీస్తున్నారు. జమాతేకు వెళ్లి వచ్చిన ఓ వ్యక్తికి, అతని ద్వారా భార్యకు కరోనా పాజిటివ్ ఉన్నట్లు ప్రకాశం జిల్లాలోని చీరాలలో తేలిన విషయం తెలిసిందే. దీంతో వారు ఎవరెవరిని కలిశారనే విషయంపై ఆరా తీస్తున్నారు. 

గుంటూరు, ప్రకాశం, ఉభయగోదావరి జిల్లాల్లో అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో ఐదుగురిని క్వారంటైన్ చేశారు. అలాగే వినుకొండలో ముగ్గురిని క్వారంటైన్ చేశారు. ప్రకాశం జిల్లాలో నలుగురిని క్వారంటైన్ కు పంపించారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 23 కరోనా పాజిటివ్ కేసులు ఉన్నట్లు నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. విశాఖపట్నంలో అత్యధికంగా కేసులు నమోదయ్యాయి.