కరోనా మహమ్మారి కట్టడికి.... నిత్యావసరాలు కూడా ఇక డోర్ డెలివరీ
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మచిలీపట్నం వ్యాపారులతో కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్ర బాబు సమావేశమయ్యారు.
విజయవాడ: రాష్ట్రాన్ని లాక్ డౌన్ చేసిన నేపథ్యంలో కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నిత్యావసర సరుకులు డోర్ డెలివరీకి సాధ్య సాధ్యాలను మర్చంట్స్ అసోసియేషన్ తో చర్చించినట్లు ఎస్పీ రవీంద్రనాథ్ బాబు తెలిపారు. వారు కూడా సరుకుల డోర్ డెలివరీకి అంగీకరించారని...నిత్యావసర సరుకులు రేపటినుండి ఇంటికే చేరవేస్తామన్నారు.
మచిలీపట్నం వాసులు ఈ సౌకర్యం ఉపయోగించుకుని ఇంటి వద్దనే ఉంటూ స్వీయ నియంత్రణ పాటించాలని ఎస్పీ సూచించారు. ప్రజలెవ్వరూ నిత్యావసరాల పేరుతో ఇక బయటకు రాకూడదని ఎస్పీ ఆదేశించారు.
అధికంగా జనాలు గుమిగూడే అవకాశాలుండటం వల్లే టీ స్టాల్స్ ని అనుమతించడం లేదన్నారు. అయినా టీ అత్యవసరం కాదని... తప్పక టీ తాగాలనుకున్న వారు ఇంటివద్దనే కాచుకుని తాగాలని పేర్కొన్నారు.
శుక్రవారం మచిలీపట్నంలో కృష్ణా జిల్లా ఎస్పీ విస్తృతంగా పర్యటించారు. నగరంలోని మోర్, విమార్ట్ తదితర సూపర్ మార్కెట్లను ఆయన సందర్శించారు. అక్కడ లభించే నిత్యావసర సరుకుల ధరలను ఎస్పీ అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు మాట్లాడుతూ... జిల్లాలో లాక్ డౌన్ విజయవంతంగా జరుగుతోందన్నారు. ఇందుకు సహకరించిన ప్రజలు, అధికారులు, ఉద్యోగులందరికీ ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.