జగన్ సర్కార్ చెప్పినట్లే చేయండి...: ఏపి ప్రజలకు కళా వెంకట్రావు పిలుపు
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వం విధించిన నియమనిబంధనలను పాటించాలని... ఇదే క్రమంలో ప్రభుత్వం కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఏపి తెలుగుదేశం అధ్యక్షులు కళా వెంకట్రావు సూచించారు.
గుంటూరు: కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి ప్రజలు వారి ఇంటికే పరిమితం కావాలని ప్రభుత్వం ఆదేశించిందని... దీన్ని పౌరులందరూ పాటించాలని ఏపి తెలుగుదేశం అధ్యక్షులు కళా వెంకట్రావు పిలుపునిచచ్చారు. అయితే రెక్కాడితేగాని డొక్కాడని జనం రోడ్ల మీదకు రాకుండా నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం లక్షా 70 వేల కోట్లతో ఒక ప్యాకేజీ ప్రకటించిందని... దీనికితోడు చాలా రాష్ట్రాలు ప్రత్యేక ప్యాకేజి ప్రకటించాయని గుర్తుచేశారు. ఇలా ఏపి ప్రభుత్వం కూడా ప్రత్యేక చొరవ చూపించాలని కళా వెంకట్రావు డిమాండ్ చేశారు.
''అన్ని వర్గాల, అన్ని రంగాల్ని ఆదుకోవడానికి కేరళ ప్రభుత్వం రూ.20 వేల కోట్ల ప్యాకేజీ ప్రకటించింది. అలాగే కేజ్రీవాల్ ప్రభుత్వం రూ.5 వేల వరకు పెన్షన్ ప్రకటించింది. పంజాబ్‌లో ప్రతి కార్మికునికి రూ.3 వేలు బ్యాంకు ఖాతా ద్వారా అందజేసింది. తెలంగాణా రూ.2,417 కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది.... ఇలాగే ఇంకా అనేక రాష్ట్రాలు చేస్తున్నాయి. ఏపి ప్రభుత్వం కూడా ఇలాగే ప్రత్యేక ప్యాకేజి ప్రకటించాలి'' వెంకట్రావు కోరారు.
''గతంలో చంద్రబాబు నాయుడుప్రభుత్వం రూ.16 వేల కోట్ల లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ ఏపీలో తెలంగాణకు ధీటుగా వివిధ వర్గాలకు లబ్ది చేకూర్చడం జరిగింది. విశాఖ హుదూద్ తుఫాన్‌కు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించడం జరిగింది. కానీ జగన్ ప్రభుత్వం మాత్రం కేవలం రూ.1000, రేషన్ మాత్రమే ప్రకటించింది. ఇది ఏమూలకు చాలదు'' అని అభిప్రాయపడ్డారు.
జగన్ ప్రభుత్వానికి కళా వెంకట్రావు చేసిన డిమాండ్లివే
1. కేరళ ప్రభుత్వం రూ.5 వేల కోట్ల హెల్త్ ప్యాకేజీ ప్రకటించింది. ఈ స్ఫూర్తితో రాష్ట్రంలో హెల్త్ ప్యాకేజీ ప్రకటించాలి.
2. ప్రతి పేద కుటుంబానికి రూ.5 వేల నగదు సాయం అందించాలి.
3. వైద్య సేవ ఉద్యోగుల సంఘం విజ్ఞప్తి మేరకు ఎన్95 మాస్కులు, శానిటైజర్లు, ప్రత్యేక గుర్తింపు కార్డులు వారికి ఇవ్వాలి.
4. తగినన్ని టెస్టింగ్ సెంటర్లు, మాస్కులు, శానిటైజర్లు, వెంటిలేటర్లు, ఐసోలేషన్ వార్డులు, సిబ్బంది సంఖ్యను పెంచాలి.
5. రైతు బజార్లు విస్తరించాలి. సరుకు కొరత నివారించాలి. ధరపై నియంత్రణ పెట్టాలి.
6. పౌల్ట్రీ, ఆక్వా రంగాలకు ప్యాకేజీ ప్రకటించాలి.
7. అరటి, మామిడి, కర్బూజ, బొప్పాయి, బత్తాయి తదితర పండ్ల తోట రైతుకు మద్దతు ధరలు ప్రకటించాలి. తగు రవాణా సౌకర్యాలు కల్పించాలి. టమోటా, మిర్చి, పత్తి పంటలను కూడా మార్కెట్‌కు చేర్చడానికి తగిన చర్యలు తీసుకోవాలి.
8. నిత్యావసర సరుకులను ప్రభుత్వమే ఇంటింటికీ సరఫరా చేయాలి.
9. పొరుగు రాష్ట్రాలలో, విదేశాల్లో వున్న ఆంధ్రప్రదేశ్ పౌరులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ముందస్తు చర్యలు తీసుకోవాలి. ప్రత్యేక అధికారులను నియమించాలి.
10. పోలీసులకు ప్రజలు సహకరించాలి. పౌరులతో పోలీసులు సంయమనంతో వ్యవహరించాలి.
11. ఉపాధి హామీ కూలీలకు కేరళ తరహా ప్యాకేజీ ఇవ్వాలి.
12. ఢల్లీ, కేరళ తరహాలో అన్నార్తులకు భోజన సదుపాయం.
13. చేతివృత్తులు, చిన్నతరహా పరిశ్రమల మనుగడకు ప్యాకేజి ఇవ్వాలి.
14. భవన నిర్మాణ కార్మికులకు చెస్ నిధుల నుండి ప్యాకేజి ప్రకటించాలి.
15. ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ బకాయిలు చెల్లించి ఆ హాస్పిటల్స్‌ను కరోనా ట్రీట్‌మెంట్‌కు ఉపయోగించుకోవాలి.
16. ఇప్పుడు టెస్ట్ చేస్తున్న కేసుల సంఖ్య చాలా పరిమితంగా ఉంది. ఈ సంఖ్యను గణనీయంగా పెంచడానికి తగిన ఎక్విప్‌మెంట్‌ను సమకూర్చాలి.