అమరావతి: తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ లోని స్వగ్రామాలకు కొంత మంది బయలుదేరి ఇంకా ఇబ్బందులు పడుతున్న వైనంపై ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి స్పందించారు. తెలంగాణ రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావుతో ఆయన గురువారం ఫోన్ లో మాట్లాడారు. 

బుధవారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సరిహద్దులో జరిగిన ఘటనల నేపథ్యంలో కొత్తగా ఎవరూ హైదరాబాదు నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాకుండా చూడాలని ఆయన కేటీఆర్ ను కోరారు. అందరి క్షేమం కోసం దేశమంతా లాక్ డౌన్ ఉన్న నేపథ్యంలో ఎక్కడి వారు అక్కడే ఉండేలా చొరవ చూపాలని ఆయన కేటీఆర్ కు సూచించారు. 

అదే విషయాన్ని ఫోన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ డిజీపీ గౌతమ్ సవాంగ్ దృష్టికి గౌతమ్ రెడ్డి తీసుకుని వెళ్లారు. గుంటూరు జిల్లా దాచేపల్లి వద్ద ఆగిపోయిన విద్యార్థులను, ప్రజలను తక్షణమే వైద్య పరీక్షలు నిర్వహించి ఏపీ రాష్ట్రంలోకి అనుమతించేలా చూడాలని ఆయన సూచించారు. 

గుంటూరు రూరల్ ఎస్పీ విజయ్ కుమార్తో కూడా గౌతమ్ రెడ్డి మాట్లాడారు. పరీక్షల అనంతరం అవసరమైతే సమీపంలోని క్వారంటైన్ కు తరలి వెళ్లేందుకు సుముఖంగా ఉన్నవారిని అనుమతించి, వారికి అత్యవసరమైన సదుపాయాలు అందించాలని చెప్పారు. 

ఇక ముందు ఎవరు కూడా ఎక్కడికీ ప్రయాణాలు చేయవద్దని ఆయన ప్రజలకు సూచించారు. ఏ అవసరమైనా, అత్యవసరమైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అదేశాలకు అనుగుణంగా మెలగడం ప్రతి పౌరుడి బాధ్యత అని ఆయన అన్నారు. ప్రజలకు ఏ లోటు లేకుండా, రాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన చెప్పారు. 

కరోనాను ఎదుర్కునేందుకు తమ కుటుంబాలను, ప్రాణాలను లెక్కచేయకుండా మీ కోసం పనిచేస్తున్నవారికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు. ప్రభుత్వ నిబంధనలన్నీ మన బంధాలకు దూరం కాకూడదనే..ఎవరినీ ఇబ్బంది పెట్టాలని కాదని ఆయన అన్నారు. కరోనా నేపథ్యంలో అశ్రద్ధతో ఒక్కరు బయటికి వచ్చినా మనతో పాటు ఎన్నో ప్రాణాలకు ముప్పు అని గుర్తుంచుకోవాలని అన్నారు.

యువత అజాగ్రత్తగా ఉండకూడదని, మిమ్మల్ని చూసి కుటుంబాలు, సమాజం ఆచరించే విధంగా ఆదర్శంగా ఉండాలని ఆయన సూచించారు. యచేసి సామాజిక మాధ్యమాల్లో వస్తున్న అసత్య వార్తలను నమ్మవద్దని, సామాజిక దూరం తప్పక పాటించాలని ఆయన సూచించారు. భయపడకండి, ఇంట్లోనే భరోసాగా ఉండండని గౌతమ్ రెడ్డి పిలుపునిచ్చారు.