కరోనా భయంతో ఆత్మహత్య: కొడుక్కి ఫోన్ చేసి.... చెప్పిందేమిటంటే....
తనకు కరోనా సోకిందనే భయంతో తన వల్ల ఊరు నష్టపోకూడదని 44 ఏళ్ల వ్యక్తి గుంటూరు జిల్లాలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఇటీవలే అతను హైదరాబాద్ నుంచి వచ్చాడు. ఆత్మహత్యకు ముందు కొడుక్కి ఫోన్ చేశాడు.
అమరావతి: తనకు కరోనా వైరస్ సోకిందనే అనుమానంతో ఓ వృద్ధుడు చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన గుంటూరు జిల్లా మాచర్ల మడలం కొత్తపల్లి గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. అతన్ని 44 ఏళ్ల అక్కల సంజీవయ్యగా గుర్తించారు.
ఇతను ఇటీవలే హైదరాబాదు నుంచి వచ్చాడు. గత రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. కుమారుడికి ఫోన్ చేసి తనకు కరోనా వైరస్ సోకిందనే అనుమానం కలుగుతోందని, తన వల్ల ఊరంతా వైరస్ వస్తుందని, తాను పోతే దూరంగా ఉండి చూడాలని చెప్పాడు. ఆ తర్వాత శనివారం ఉదయం 7 గంటల ప్రాంతంలో చెట్టుకు ఉరేసుకుని మరణించాడు.
Also Read: ఐసోలేషన్ వార్డుకు ఎమ్మెల్యే ముస్తఫా: మరో 14 మంది సైతం..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లా జమ్మలమడుగులో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. అనతు రాజస్థాన్ కు చెందినవాడు. అతన్ని ఐసోలేషన్ వార్డుకు తరలించారు. అతనితో పాటు మరో 16 మందిని కూడా ఐసోలేషన్ వార్డుకు తరలించారు. తాజా కరోనా పాజిటివ్ కేసుతో ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 14కు చేరుకుంది.
శుక్రవారంనాడు ఏపీలో 13 కరోనా కేసులు బయటపడ్డాయి. కొత్తగా విశాఖ, గుంటూరు నగరాల్లో ఒక్కొక్కటి చొప్పున కరోనా పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. ఈ విషయాన్ని వైద్య ఆరోగ్య శాఖ శుక్రవారంనాడు తెలిపింది. బర్మింగ్ హామ్ నుంచి ఈ నెల 17వ తేదీన వచ్చిన వ్యక్తి విశాఖ ఆస్పత్రిలో చేరాడు. మరోవైపు గుంటూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఒకరికి వైరస్ సోకినట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.
ఇదిలావుంటే, తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఇద్దరు మంత్రులను ఇంచార్జీలుగా నియమించింది. ఏపీ ఇంచార్జీగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నియమితులయ్యారు. తెలంగాణ ఇంచార్జీగా జి. కిషన్ రెడ్డి నియమితులయ్యారు. రాష్ట్రస్థాయి అధికారులతో మాట్లాడి నివేదిక ఇవ్వాలని వారిని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ప్రతి రోజూ వాళ్లు కేంద్రానికి నివేదికలు సమర్పిస్తారు.
కోవిడ్ 19 వ్యాప్తి కట్టడి బాధ్యతను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీనియర్ అధికారులకు అప్పగించింది. జిల్లాకో ఐఎఎస్ అధికారిని నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. తక్షణమే ఆయా జిల్లాలకు వెళ్లాలని ప్రభుత్వం ఆదేశించింది.