కరోనా ఎఫెక్ట్: జైళ్ల నుండి ఖైదీల విడుదల... జగన్ సర్కార్ కీలక నిర్ణయం
రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా నిరోధించేందుకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.
అమరావతి: కరోనా మహమ్మారి కారణంగా దేశాలకు దేశాలనే లాక్ డౌన్ అవుతున్నాయి. ఇప్పటికే ఈ వైరస్ దాటికి భారత్ కూడా విలవిల్లాడిపోతోంది. ఆంధ్ర ప్రదేశ్ లోనూ ఈ మహమ్మారి విజృంభిస్తుండటంతో ఇప్పటికే ప్రభుత్వం అనేక ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది. తాజాగా జైళ్లశాఖపై కూడా ఈ వైరస్ ప్రభావం పడింది. వివిధ జైళ్లలో ఉన్న ఖైదీలకు కరోనా సోకకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటోంది.
సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఖైదీలకు తాత్కాలిక ఉపశమనం కల్పించాలని జగన్ ప్రభుత్వం భావిస్తోంది. ఇందులోభాగంగా తాత్కాలిక బెయిల్,పెరోల్ పై ఖైదీలని విడుదల చేయాలని నిర్ణయించింది. అర్హత ఉన్న ఖైదీల గుర్తింపునకు ముగ్గురు అధికారులతో కూడిన హైపవర్ కమిటీ ఏర్పాటు చేసింది ఏపి ప్రభుత్వం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పదికి చేరుకుంది. తాజాగా గుంటూరు, విజయవాడల్లో మరో రెండు కేసులు నమోదయ్యాయి. వాషింగ్టన్ నుంచి విజయవాడ వచ్చిన 21 ఏళ్ల యువకుడికి కరోనా సోకినట్లు నిర్ధారించారు. మరో వైపు, గుంటూరు జిల్లాలో ఓ కరోనా కేసు బయటపడింది. ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు తేలింది. ఈ రెండు కేసులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పదికి చేరుకుంది.
చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తికి చెందిన యువకుడికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలిన విషయం తెలిసిందే. లండన్ లో ఎంసిఏ చదువుతున్న ఆ యువకుడు ఈ నెల 18వ తేదీన లండన్ నుంచి బయలుదేరి 19వ తేదీన శ్రీకాళహస్తి చేరుకున్నాడు.
తెలంగాణలో మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దాంతో తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 41కి చేరుకుంది. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోంది. మహారాష్ట్రలో అత్యధికంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.