Asianet News TeluguAsianet News Telugu

రాజమండ్రిలో మరో రెండు కొత్త కరోనా కేసులు: ఏపీలో 164కు చేరిన సంఖ్య

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజమండ్రిలో మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో తూర్పూ గోదావరి జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పదికి చేరుకుంది. ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది.

coronavirus, covid-19: Two more Corona positive cases in East Godavari district
Author
Rajahmundry, First Published Apr 4, 2020, 9:35 AM IST

రాజమండ్రి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో తూర్పు గోదావరి జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 10కి చేరుకుంది. కాగా, ఢిల్లీలోని నిజాముద్దీన్ వెళ్లి వచ్చినవారి కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 164కు చేరుకుంది. కరోనా పాజిటివ్ నమోదైనవారిలో ఇప్పటి వరకు నలుగురు కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. కరోనా పాజిటివ్ కేసులు అత్యధికంగా నెల్లూరు జిల్లాలో 32 నమోదయ్యాయి. శుక్రవారం ఒక్క రోజే అదనంగా 15 కేసులు నమోదయ్యాయి. వీరంతా ఢిల్లీ నుంచి వచ్చినవారే. కరోనా వ్యాధి సోకి ఒక వ్యక్తి మరణించిన విషయం తెలిసిందే.

నిజాముద్దీన్ వెళ్లినవారు ఏపీ ఎక్స్ ప్రెస్ రైల్లో రాష్ట్రానికి వచ్చినట్లు అనుమానిస్తున్నారు. ఈ రైలులో 180 మంది దాకా ప్రయాణికులు వచ్చినట్లు తెలుస్తోంది. వారు రాజమండ్రిలోనూ సామర్లకోటలోనూ దిగినట్లు గుర్తించారు. వారి కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శుక్రవారంనాడు 161 కరోనా పాజిటివ్ కేసులు నమోదైన విషయం తెలిసిందే. వీరిలో 140 మంది ఢిల్లీలో జరిగిన జమాత్ కు వెల్లి వచ్చినవారే కావడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి 1089 మంది మర్కజ్ ప్రార్థనలకు వెళ్లినట్లు గుర్తించారు. వారిలో 881 మందికి వైద్య పరీక్షలు నిర్హించారు. 

కర్ణాటకలో కరోనా వైరస్ సోకి మరో వ్యక్తి మరణించాడు. దీంతో కర్ణాటకలో కరోనా మృతుల సంఖ్య నాలుగుకు చేరుకుంది. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 128కు చేరుకుంది. పొరుగు రాష్ట్రం తెలంగాణలో 229 కేసులు నమోదు కాగా, 11 మంది మరణించారు.

భారతదేశంలో కరోనా వైరస్ విస్తరిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. శుక్రవారం ఒక్క రోజే కొత్తగా 478 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. శనివారం ఉదయం 6.30 గంటల సమయానికి భారతదేశంలో కరోనా కేసుల సంఖ్య 2,547కు చేరుకుంది. ఇందులో 157 మంది కోలుకున్నారు. దేశవ్యాప్తంగా 62 మంది మరణించారు. 

మహరాష్ట్రలో అత్యధికంగా 335 కేసులు నమోదయ్యాయి. 16 మంది మరణించారు. ఆ తర్వాతి స్థానం తమిళనాడు ఆక్రమించింది. తమిళనాడులో 309 కేసులు నమోదు కాగా, ఒకరు మరణించారు. కేరళలో 286 కేసులు నమోదు కాగా ఇద్దరు మరణించారు. ఢిల్లీలో 219 కేసులు నమోదయ్యాయి. నలుగురు మరణించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 172 కేసులు నిర్ధారణ కాగా, ఇద్దరు మరణించారు. 

ఏప్రిల్ 3వ తేదీనాటికి తబ్లిగి జమాత్ కు సంబంధించినవే 647 కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ చెప్పారు. 

ప్రపంచవ్యాప్తంగా 1,097,909 కేసులు నమోదు కాగా, వందలాది దేశాలు లాక్ డౌన్ ను అమలు చేస్తున్నాయి. అమెరికా, ఇటలీల్లో పరిస్థితి దారుణంగా ఉంది. అమెరికాలో 276,995 కేసులు నమోదు కాగా, ఇటలీలో 119,827 కేసులు నమోదయ్యాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios