Asianet News TeluguAsianet News Telugu

గాజువాకలో కలకలం: చికెన్ వ్యాపారికి కరోనా పాజిటివ్, వారి కోసం ఆరా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం జిల్లా గాజువాకలో కరోనా కలకలం చెలరేగింది. గాజువాకలో ఓ మాంసం వ్యాపారికి కరోనా సోకినట్లు సమాచారం. మర్కజ్ నుంచి వచ్చిన వ్యక్తి నుంచి అతనికి కరోనా సోకింది.

Coronavirus: Chicken seller identified Corona positive at Gajuwaka
Author
Gajuwaka, First Published Apr 7, 2020, 3:25 PM IST

విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం జిల్లా గాజువాకలో కరోనా కలకలం చెలరేగింది. ఓ చికెన్ వ్యాపారికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు నిర్ధారణ అయింది. అతను ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో జరిగిన మర్కజ్ కు వెళ్లి వచ్చాడు. ఆ తర్వాత శ్రీకాళహస్తిలో జరిగిన మత సమ్మేళనంలో కూడా పాల్గొని వచ్చి మటన్ దుకాణం తెరిచాడు.

ఆ వ్యాపారి ఆదివారం ఉదయం నుంచి యసాయంత్రం వరకు చికెన్ విక్రయించాడు. ఆ రోజు అతని వద్ద చికెన్ కొనుగోలు చేసినవారిని గుర్తించడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు. అతని వద్ద మాంసం కొనుగోలు చేసిన 14 మందిని గుర్తించినట్లు సమాచారం. మరింత మంది కోసం ఆరా తీస్తున్నారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల ఉధృతి తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తోంది. సోమవారం రాత్రి నుంచి ఇప్పటి వరకు తాజాగా ఒక్క కొత్త కేసు మాత్రమే నమోదైంది. గుంటూరులో కొత్తగా ఆ కేసు నమోదైంది. ఈ స్థితిలో గాజువాకలో మరో కేసు బయటపడింది.

గుంటూరులో నమోదైన కేసుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 304కు చేరుకుంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు నలుగురు మృత్యువాత పడ్డారు. ఈ నెల 3వ తేదీన కర్నూలులో ఓ వృద్ధుడు కరోనా వైరస్ తో మరణించినట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు ఏపీ ఆరోగ్య శాఖ మంగళవారం ఉదయం బులిటెన్ విడుదల చేసింది.

కర్నూలు అత్యధికంగా 74 కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ స్థితిగతులపై, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ముఖ్యమంత్రి అదనపు ప్రత్యకే కార్యదర్శి పీవీ రమేష్ వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెంటలేటర్ల మీద ఉన్న రోగులు ముగ్గురు మాత్రమేనని ఆయన చెప్పారు. 

ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో సుమారు 900 వెంటిలేటర్లను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చామని, ఏపీలో 6 ఉన్న టెస్టింగ్ ల్యాబ్ లను అన్ని జిల్లాలో మరో 10 రోజుల్లో అందుబాటులోకి తీసుకువచ్చేలా చర్యలు చేపట్టామని ఆయన చెప్పారు. కర్నూలు, నెల్లూరు జిల్లాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టామని, ప్రస్తుతం ఒక్కో టెస్ట్ రిపోర్ట్ కి ఆరు గంటల సమయం పడుతోందని ఆయన అన్నారు. 

గంటన్నరలో టెస్ట్ ఫలితాలు వచ్చే కిట్ల కొనుగోలుకి సీఎం ఆదేశాలు ఇచ్చినట్లు రమేష్ తెలిపారు. పదిరోజుల్లో ఇలాంటి 3 లక్షల కిట్లు వచ్చేలా ఆదేశాలు ఇచ్చామని చెప్పారు. ఏపీలో ప్రైవేట్ ఆసుపత్రులు అత్యవసర సేవలు ఆపేయాలని ఎలాంటి అదేశాలు లేవని ఆయన స్పష్టం చేశారు. కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు అలా చేస్తున్నాయని, దీనిపై తమకు ఫిర్యాదు చేయాలని కోరుతున్నామని ఆయన చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో అత్యధికంగా కరోనా వైరస్ కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సోమవారం సాయంత్రానికి 303 కేసులు నమోదయ్యాయి. కర్నూలు జిల్లాలో 74, నెల్లూరు జిల్లాలో 42 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రభుత్వం ఈ రెండు జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెడుతోంది.

Follow Us:
Download App:
  • android
  • ios