డిఎస్పీ సస్పెండ్: విలేకరులపై పోలీసుల దాడి...మంత్రి నాని సీరియస్
అతి భయంకరమైన కరోనా వైరస్ కు సంబంధించిన సమాచారాన్ని ప్రాణాలను తెగించి ప్రజలకు అందిస్తున్న మీడియా ప్రతినిధులపై పోలీసులు దాడి చేయడంపై ఆంధ్ర ప్రదేశ్ మంత్రి పేర్ని నాని సీరియస్ అయ్యారు.
విజయవాడ: కరోనా మహమ్మారి విజృంభిస్తున్నా ప్రాణాలకు తెగించి తమ విధులు నిర్వర్తిస్తున్న మీడియా సిబ్బంది అడుగడుగునా అవమానాలు ఎదుర్కొంటున్నారు. ఇరు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా మీడియాను అత్యవసర విభాగంగా పరిగణించి వారి విధులకు ఆటంకం కలిగించవద్దని చెబుతున్నా పోలీసుల తీరు మారడం లేదు. ఇటీవల హైదరాబాద్ లో మీడియా సిబ్బందిపై జరిగిన పోలీసుల దాడిపై స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించి ఇలాంటి ఘటనలు జరక్కుండా చూడాలని మీడియా సమక్షంలోనే డిజిపికి ఆదేశించారు. అయినప్పటికి పోలీసుల తీరులో మార్పు రావడం లేదు.
తాజాగా ఆంధ్ర ప్రదేశ్ లోనూ ఇదే తరహాలో తమ విధుల్లో భాగంగా న్యూస్ కవరేజి కోసం రోడ్డెక్కిన మీడియా సిబ్బందిపై విజయవాడ పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. కొన్ని మీడియా సంస్థలకు చెందిన ప్రతినిధులపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. జర్నలిస్టులను నోటికి వచ్చిన బూతులను తిడుతూ దారుణంగా దాడిచేశారు.
పోలీసుల దాడిలో పలువురు మీడియా ప్రతినిధులు తీవ్రంగా గాయపడ్డారు. అయితే అదే గాయాలతో వారు రోడ్డుపైనే బైఠాయించి నిరసన తెలియజేశారు. విచక్షణ కోల్పోయి మీడియా వ్యక్తుల పై దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ ఘటనపై రాష్ట్ర సమాచార రవాణా శాఖ మంత్రి పేర్ని నాని సీరియస్ గా స్పందించారు. దాడికి పాల్పడిన ఏలూరు డిఎస్పీని సస్పెండ్ చేస్తామని జర్నలిస్టులకు హామీ ఇచ్చి నిరసన విరమింపజేశారు. గాయపడిన జర్నలిస్టులతో మాట్లాడిన మంత్రి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని హామీ ఇచ్చారు.