లాక్ డౌన్: తెలంగాణలో చిక్కుకున్న విద్యార్థులు...ఏపి హైకోర్టు కీలక ఉత్తర్వులు

ఇరు తెలుగు రాష్ట్రాలు కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ కావడంతో ఇతరప్రాంతాల్లో చిక్కుకున్న విద్యార్థుల గురించి ఏపి హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. 

Coronavirus... Ap Highcourt Decision on Lockdown

అమరావతి: లాక్  డౌన్ నేపథ్యంలో తెలంగాణ, ఇతర ప్రాంతాల నుంచి ఏపీకి వచ్చేవారిపై రాష్ట్ర హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ పోలీసులు  ఇచ్చిన ఎన్‌వోసీని ఎంట్రీ పాయింట్‌లోనే పరిశీలించాలని... ఆరోగ్యపరంగా బాగుంటేనే అనుమతించాలని స్పష్టం చేసింది. 

ఒకవేళ ఆరోగ్యంగా లేకపోతే క్వారంటైన్‌కు తరలించాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. క్వారంటైన్‌ అవసరం లేకపోతే గృహనిర్బంధంలో ఉంచి ఎప్పటికప్పుడు డాక్టర్లతో పర్యవేక్షించేలా చూడాలని సర్కార్‌కు హైకోర్టు తెలిపింది. 

లాక్ డౌన్ కారణంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు ఇతర ప్రాంతాల్లో చిక్కుకున్నారని... రాష్ట్రానికి రావడానికి జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటూ బీజేపీ నేత వెలగపూడి గోపాలకృష్ణ హైకోర్టు పిటిషన్‌ వేశారు. రాష్ట్ర సరిహద్దుల్లో రాష్ట్రానికి చెందిన ప్రజలు, విద్యార్థులు ప్రభుత్వం, పోలీస్ ఆంక్షల కారణంగా నిలిచిపోతున్నారంటూ  పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ పై  శుక్రవారం ఏపి హైకోర్టు విచారించి ప్రజలను  రాష్ట్రంలోకి అనుమతించాలంటూ ప్రభుత్వాన్ని సూచించింది. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. దీంతో ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 12కు చేరుకుంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుక్రవారం బులిటెన్ విడుదల చేసింది. తాజా కేసుతో విశాఖపట్నంలో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 3కు చేరుకుంది.

బర్మింగ్ హామ్ నుంచి వచ్చిన వ్యక్తితో కాంటాక్ట్ లోకి వచ్చిన వ్యక్తికి విశాఖపట్నంలో తాజాగా కరోనా వైరస్ సోకింది. ఇప్పటి వరకు 384 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. వీరిలో 317 మందికి కరోనా లేదని తేలింది. మరో 55 మంది రిపోర్టులు రావాల్సి ఉంది. 

 గురువారంనాడు విజయవాడలో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలిన విషయం తెలిసిందే. 28 ఏళ్ల యువకుడికి కోరనా పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. అతను ఈ నెల 18వ తేదీన స్వీడన్ నుంచి ఢిల్లీకి వచ్చాడు. అక్కడి నుంచి విజయవాడకు చేరుకున్నాడు. అతను జీజీహెచ్ లో చేరాడు. దీంతో విజయవాడలో కూడా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3కు చేరుకుంది. 

బుధవారంనాడు వాషింగ్టన్ నుంచి వచ్చిన 21 ఏళ్ల యువకుడి కరోనా పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. గుంటూరు ఓ కేసు బయటడింది. ఢిల్లీలో జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని వచ్చిన వ్యక్తికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలింది. పొరుగు రాష్ట్రం తెలంగాణలో 45 కరోనా కేసులు నమోదయ్యాయి.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios