Asianet News TeluguAsianet News Telugu

ఏపీలో తగ్గిన కరోనా ఉధృతి: కొత్తగా ఒక్క కేసు నమోదు, మృతులు నలుగురు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి కొంత ఊరట లభించింది. సోమవారం రాత్రి నుంచి ఇప్పటి వరకు తాజాగా ఒక్క కేసు మాత్రమే నమోదైంది. దీంతో ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 304కు చేరకుంది.

Coronavirus: Andhra Pradesh gets rekief as only one new case recorded
Author
Amaravathi, First Published Apr 7, 2020, 11:27 AM IST

అమరావతి: కరోనా వైరస్ వ్యాప్తి విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కొంత ఊరట లభించింది. రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల ఉధృతి తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తోంది. సోమవారం రాత్రి నుంచి ఇప్పటి వరకు తాజాగా ఒక్క కొత్త కేసు మాత్రమే నమోదైంది. గుంటూరులో కొత్తగా ఆ కేసు నమోదైంది.

గుంటూరులో నమోదైన కేసుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 304కు చేరుకుంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు నలుగురు మృత్యువాత పడ్డారు. ఈ నెల 3వ తేదీన కర్నూలులో 45 ఏళ్ల వయస్సు గల కరోనా వైరస్ తో మరణించినట్లు ప్రభుత్వం తెలిపింది. కర్నూలులో ఇది తొలి కరోనా మరణం. ఈ మేరకు ఏపీ ఆరోగ్య శాఖ మంగళవారం ఉదయం బులిటెన్ విడుదల చేసింది.

Also Read: ఏపీలో కరోనా కరాళనృత్యం: 8 గంటల్లో కొత్తగా 37 కేసులు, 303కు చేరిన సంఖ్య

కర్నూలు అత్యధికంగా 74 కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ స్థితిగతులపై, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ముఖ్యమంత్రి అదనపు ప్రత్యకే కార్యదర్శి పీవీ రమేష్ వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెంటలేటర్ల మీద ఉన్న రోగులు ముగ్గురు మాత్రమేనని ఆయన చెప్పారు. 

ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో సుమారు 900 వెంటిలేటర్లను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చామని, ఏపీలో 6 ఉన్న టెస్టింగ్ ల్యాబ్ లను అన్ని జిల్లాలో మరో 10 రోజుల్లో అందుబాటులోకి తీసుకువచ్చేలా చర్యలు చేపట్టామని ఆయన చెప్పారు. కర్నూలు, నెల్లూరు జిల్లాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టామని, ప్రస్తుతం ఒక్కో టెస్ట్ రిపోర్ట్ కి ఆరు గంటల సమయం పడుతోందని ఆయన అన్నారు. గంటన్నరలో టెస్ట్ ఫలితాలు వచ్చే కిట్ల కొనుగోలుకి సీఎం ఆదేశాలు ఇచ్చినట్లు రమేష్ తెలిపారు. పదిరోజుల్లో ఇలాంటి 3 లక్షల కిట్లు వచ్చేలా ఆదేశాలు ఇచ్చామని చెప్పారు. 

ఏపీలో ప్రైవేట్ ఆసుపత్రులు అత్యవసర సేవలు ఆపేయాలని ఎలాంటి అదేశాలు లేవని ఆయన స్పష్టం చేశారు. కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు అలా చేస్తున్నాయని, దీనిపై తమకు ఫిర్యాదు చేయాలని కోరుతున్నామని ఆయన చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో అత్యధికంగా కరోనా వైరస్ కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సోమవారం సాయంత్రానికి 303 కేసులు నమోదయ్యాయి. కర్నూలు జిల్లాలో 74, నెల్లూరు జిల్లాలో 42 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రభుత్వం ఈ రెండు జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెడుతోంది.

Follow Us:
Download App:
  • android
  • ios