హెడ్ కానిస్టేబుల్ కుమారుడికి కరోనా పాజిటివ్: పోలీసులంతా హోం క్వారంటైన్
పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల పోలీసు స్టేషన్ కు చెందిన హెడ్ కానిస్టేబుల్ కుమారుడికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు నిర్దారణ అయింది. దీంతో కాళ్ల పోలీసు స్టేషన్ లోని సిబ్బంది అంతా హోం క్వారంటైన్ కు వెళ్లారు.
ఏలూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల పోలీసు స్టేషన్ లో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. కాళ్ల పోలీసు స్టేషన్ లో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ కుమారుడికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారణ అయింది.
దాంతో పోలీసు స్టేషన్ సిబ్బంది యావత్తూ హోం క్వారంటైన్ కు వెళ్లారు. ఫలితంగా పోలీసు స్టేషన్ కు కొత్త సిబ్బంది వచ్చి పనిచేస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లాలో 14 మందికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలిన విషయం తెలిసిందే. ఢిల్లీలోని జమాత్ కు వెళ్లి వచ్చినవారికి కరోనా వైరస్ సోకినట్లు తేలింది.
Also Read: కరోనా దెబ్బ: పాజిటివ్ కేసు నమోదు, మంగళగిరిలో రెడ్ జోన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమాంతం కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగింది. 132 మందికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. గుంటూరు జిల్లాలో అత్యధికంగా 20 మందికి కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
జమాత్ కు వెళ్లినవచ్చినవారికే ఎక్కువగా కరోనా పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారణ అయిందని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెప్పారు. 111 మంది రోగులు నిజాముద్దీన్ ప్రాంతంలో జరిగిన ప్రార్థనల్లో పాల్గొని తిరిగి వచ్చినవారని ఆయన చెప్పారు.