గుంటూరులో టెన్షన్ టెన్షన్... హాస్పిటల్ నుండి కరోనా రోగి పరారీ
కరోనా మహమ్మారిని తరిమికొట్టాలని ప్రభుత్వాలు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా కొందరు ఆ ప్రయత్నాలను అడ్డుకుంటూనే వున్నారు. తెలివితక్కువ తనంతో ప్రభుత్వ నిబంధనలను పాటించచకుండా కరోనా మహమ్మారి వ్యాప్తికి కారణమవుతున్నారు.
అమరావతి: గుంటూరు పట్టణంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. జిజిహెచ్ లో క్వారంటైన్ లో వున్న ఓ కరోనా రోగి హాస్పిటల్ సిబ్బంది కళ్లుగప్పి పరారయ్యాడు. సదరు యువకుడు కేసు షీటు కూడా తీసుకుని పారిపోయాడు. దీంతో పట్టణంలోనే కాదు జిల్లావ్యాప్తంగా ఆందోళన నెలకొంది. జిజిహెచ్ వైద్యులు, హాస్పిటల్ సిబ్బంది
యువకుడి కోసం ఎంత వెలికినా లాభంలేకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు రంగంలోకి దిగి అతడి కోసం గాలింపు చేపట్టారు. అతడి నుండి కరోనా మహమ్మారి ఇతరులకే వ్యాప్తిచెందే అవకాశం వుండటంతో వీలైనంత తొందరగా ఆచూకీ కనుక్కోవాలని పోలీసులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.
ఏపిలోని విశాఖపట్నంలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. దీంతో ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 12కు చేరుకుంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుక్రవారం బులిటెన్ విడుదల చేసింది. తాజా కేసుతో విశాఖపట్నంలో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 3కు చేరుకుంది.
బర్మింగ్ హామ్ నుంచి వచ్చిన వ్యక్తితో కాంటాక్ట్ లోకి వచ్చిన వ్యక్తికి విశాఖపట్నంలో తాజాగా కరోనా వైరస్ సోకింది. ఇప్పటి వరకు 384 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. వీరిలో 317 మందికి కరోనా లేదని తేలింది. మరో 55 మంది రిపోర్టులు రావాల్సి ఉంది.
గురువారంనాడు విజయవాడలో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలిన విషయం తెలిసిందే. 28 ఏళ్ల యువకుడికి కోరనా పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. అతను ఈ నెల 18వ తేదీన స్వీడన్ నుంచి ఢిల్లీకి వచ్చాడు. అక్కడి నుంచి విజయవాడకు చేరుకున్నాడు. అతను జీజీహెచ్ లో చేరాడు. దీంతో విజయవాడలో కూడా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3కు చేరుకుంది.
బుధవారంనాడు వాషింగ్టన్ నుంచి వచ్చిన 21 ఏళ్ల యువకుడి కరోనా పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. గుంటూరు ఓ కేసు బయటడింది. ఢిల్లీలో జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని వచ్చిన వ్యక్తికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలింది. పొరుగు రాష్ట్రం తెలంగాణలో 45 కరోనా కేసులు నమోదయ్యాయి.