అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8కి చేరుకుంది. తాజాగా చిత్తూరు జిల్లా కాళహస్తిలో ఓ కరోనా పాజిటివ్ కేసు నిర్ధారణ అయింది. దీంతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8కి చేరుకుంది. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తికి చెందిన 25 ఏళ్ల యువకుడికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. 

ఆ యువకుడు శ్రీకాళహస్తికే చెందిన మిత్రుడితో కలిసి లండన్ లో ఎంసీఏ చదువుతున్నాడు. ఇద్దరు కలిసి ఈ నెల 18వ తేదీ రాత్రి లండన్ నుంచి బయలుదేరి 19వ తేదీ మధ్యాహ్నం చెన్నైకి చేరుకున్నాడు. అక్కడి నుంచి కారులో శ్రీకాళహస్తి వచ్చాడు. 

దగ్గు, జ్వరం, జలుబు ఉండడంతో ఈ నెల 23వ తేదీన తిరుపతి రుయా ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడు. అతని నమూనాలను సేకరించి స్విమ్స్ లో పరీక్షించారు. దాంతో అతనికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. విశాఖలో ఇటీవల పాజిటివ్ వచ్చిన వ్యక్తి కూతురు నమూనాలను కూడా పరీక్షించారు. ఆమెకు నెగెటివ్ వచ్చిందని వైద్యులు తేల్చారు. 

ఇదిలావుంటే, అనంతపురం బోధనాస్పత్రిలో కరోనా నిర్ధారణ పరీక్షలు మంగళవారం నుంచి ప్రారంభమయ్యాయి. త్వరలో కడప, గుంటూరు, విశాఖ నగరాల్లోనూ ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

కాగా, పొరుగు రాష్ట్రం తెలంగాణలో సోమవారంనాడు మరో మూడు కరోనా కాంటాక్ట్ కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో కరోనా వైరస్ సోకినవారి సంఖ్య 39కి చేరుకుంది. సోమవారంనాడు ఒక్క రోజే ఆరు కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు తెలంగాణలో 6 కాంటాక్ట్ కేసులు నమోదయ్యాయి.

సోమవారంనాడు నమోదైన కేసుల్లో మూడు కాంటాక్ట్ కేసులు కాగా, మూడు విదేశాల నుంచి వారి కేసులు. హైదరాబాదులోని మణికొండలో 64 వృద్ధురాలికి కోరనా అంటుకుంది. కాగా, కొత్తగూడెం డీఎస్పీ, ఆయన ఇంటి పనిమనిషి కరోనా బారిన పడ్డారు. 

విదేశాల నుంచి వచ్చిన ముగ్గురికి కరోనా వైరస్ సోకినట్లు సోమవారం నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. ఈ ముగ్గురు లండన్, జర్మనీ, సౌదీల నుంచి వచ్చారు. లండన్ నుంచి వచ్చిన హైదరాబాదు వచ్చిన 49 ఏళ్ల వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు నిర్ధారణ అయింది. ఇతను హైదరాబాదులోని కోకాపేటకు చెందినవాడు.