గుంటూరు: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి దేశాలకు దేశాలే లాక్ డౌన్ ను ప్రకటించాయి. ఈ క్రమంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం  కూడా ఈ వైరస్ నివారణకు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది. రాష్ట్రాన్ని లాక్ డౌన్ చేయడంతో పాటు విదేశాల నుండి వచ్చిన వారి వివరాలను సేకరిస్తూ హోంక్వారంటైన్ లో గానీ క్వారంటైన్ సెంటర్లకు తరలించడం గానీ చేస్తున్నారు. అయితే ఈ వైరస్ వ్యాప్తిని తగ్గించేందుకు ప్రభుత్వం తీసుకువచ్చిన నిబంధలను అమలు చేయడంలో అలసత్వం వహించిన ఓ సీఐ సస్పన్షన్ కు గురయిన సంఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. 

గుంటూరు జిల్లా పిడుగురాళ్ల పట్టణ సీఐ సురేంద్ర బాబుని గుంటూరు రూరల్ ఎస్పీ హెచ్ విజయరావు సస్పెండ్ చేసి వీఆర్ కు పంపించారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు విదేశాల నుండి వచ్చే వారి డేటా సేకరించాలని  ప్రభుత్వం స్థానిక పోలీసులను ఆదేశించింది. అయితే  ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న కారణంతో సీఐని సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది. 

ఇకపై కూడా ఎవరైనా  విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను తూచా తప్పకుండా అమలుచేయాలని... లేదంటే శాఖాపరమైన చర్యలు తప్పవని జిల్లా పోలీసులకు ఎస్పీ హెచ్చరించారు. 

పశ్చిమగోదావరి జిల్లాలో కూడా లాక్ డౌన్ పాటించకుండా ఓ యువకుడు బయటకు వచ్చాడని పోలీసు చితకబాదాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కాగా ఎస్ఐ ని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.  

పశ్చిమగోదావరి జిల్లా పేరవల్లి ఎస్ఐ లాక్ డౌన్ నేపథ్యంలో విధులు నిర్వహిస్తున్నాడు. రూల్స్ పాటించకుండా ఓ కుటుంబం బయట అడుగుపెట్టింది. దీంతో ఎస్ఐ... ఆ కుటుంబం పై లాఠీ ఛార్జ్ చేశాడు. మహిళలను కూడా వదలకుండా కొట్టాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో హోంశాఖ మంత్రి సదరు ఎస్ఐ ని సస్పెండ్ చేశారు.