అమరావతి:కరోనా ప్రభావంతో రాష్ట్ర ఆదాయం మొత్తం దెబ్బతిందని ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు. అదనపు ఖర్చులు వచ్చి పడడంతో రాష్ట్ర ఆర్ధిక పరిస్థితులపై భారం పడిందన్నారు.

బుధవారం నాడు సీఎం వైఎస్ జగన్ అమరావతిలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని  జీతాలు వాయిదా వేసుకొన్న ప్రజా ప్రతినిధులు, ఉద్యోగులకు సీఎం ధన్యవాదాలు తెలిపారు.  రాష్ట్ర అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాన్ని సమర్ధించినందుకు ఆయన వారిని అభినందించారు.

వ్యవసాయ పనులకు ఎలాంటి ఇబ్బంది లేదని సీఎం జగన్ తేల్చి చెప్పారు. వ్యవసాయ పనులను మధ్యాహ్నం ఒంటి గంట వరకు పూర్తి చేసుకోవాలని సీఎం అనుమతి ఇచ్చారు. అయితే వ్యవసాయ పనులు చేసే సమయంలో సామాజిక దూరాన్ని పాటించాలని ఆయన ప్రజలను కోరారు.

కరోనా కేసులు ఒక్కసారిగా పెరగడం బాధకల్గిస్తోందని సీఎం చెప్పారు. ప్రజలు ఎవరూ కూడ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జగన్ చెప్పారు. కరోనా సులువుగా వ్యాపించే వైరస్ మాత్రమేనన్నారు. వయస్సు మళ్లిన వారు ఈ వైరస్ సోకకుండా జాగ్రత్తగా ఉండాలని సీఎం సూచించారు.

కరోనా జ్వరం లాంటిదేనని.. ఈ వైరస్ గురించి ఎవరూ భయపడొద్దన్నారు సీఎం.కరోనా లక్షణాలు ఉంటే వెంటనే  104 కు ఫోన్ చేయాలని సీఎం జగన్ కోరారు. కరోనాపై పోరాటానికి అన్ని ప్రైవేట్ ఆసుపత్రులు ముందుకు రావాలని ఆయన కోరారు.

also read:ఏపీలో 87 కరోనా కేసులు, ఢిల్లీ నుండి వచ్చిన వారే 70 మంది: సీఎం జగన్

వైరస్ సోకితే ఏదో జరుగుతోందనే అపోహ వద్దని సీఎం సూచించారు.కరోనా రోగులకు సమగ్ర చికిత్స విధానాన్నిఅందించనున్నట్టుగా ఆయన చెప్పారు.
ఆరోగ్య పరిస్థితి గురించి చెప్పుకోవడానికి మొహమాటపడకూదని సీఎం జగన్ సూచించారు. ఒకవేళ చెప్పకపోతే  మీ కుటుంబసభ్యులకు ఇరుగుపొరుగు వారిని ఇబ్బంది పెట్టినవారే అవుతారన్నారు.