ఎమ్మెల్యేకు ఎదురైన అరుదైన ఘటన: ఆ పిల్లలు ఏం చేశారంటే...
నంద్యాల ఎమ్మెల్యే రవికిశోర్ రెడ్డిని ఇద్దరు చిన్నారులు ఆశ్చర్యానికి గురి చేశారు. తమ జన్మ దిన వేడుకలకు తల్లిదండ్రులు ఇచ్చిన డబ్బును, కిడ్డీ బ్యాంక్ డబ్బులను సీఎం సహాయ నిధికి అందజేశారు.
కర్నూలు: కర్నూలు జిల్లా నంద్యాలలో ని చిన్నారులు మానవత్వం చాటుకున్నారు. వయసు చిన్నదే అయినా మనసు మాత్రం పెద్దదే అంటూ నిరూపించారు. కరోనా మహమ్మారిపై యుద్ధం చేసేందుకు ప్రభుత్వానికి తమ వంతు సహాయ సహకారాలు అందించారు. తల్లిదండ్రులు తమ జన్మదినం కోసం ఇచ్చినటువంటి డబ్బులను ప్రభుత్వానికి అందించి పెద్దమనసుని చాటుకున్నారు.
ఈ చిన్నారుల ని ఆదర్శంగా తీసుకుని మరింత మంది ముందుకు వచ్చి ప్రభుత్వానికి అండదండలు అందించాలని నంద్యాల ఎమ్మెల్యే శిల్ప రవి కిషోర్ రెడ్డి పిలుపునిచ్చారు, పుట్టిన రోజు కోసం దాచుకున్న రూ 2 వేల నగదును ముఖ్యమంత్రి సహాయనిధికి అప్పగించిన చిన్నారులనునంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి అభినందించారు.
కర్నూలు జిల్లా నంద్యాల పట్ఠణంలో జనాల రాకపోకలను నియంత్రించేందుకు తిరుగుతున్న ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి అనుకోకుండా ఓ అరుదైన సంఘటన ఎదురైంది. సాయిశ్రేష్ట, శేషు అనే ఇద్దరు చిన్నారులు ఎమ్మెల్యే ను కలిసి 2.వేల.10 రూపాయల నగదును ముఖ్యమంత్రి సహాయనిధికి అందచేయాలని ఎమ్మెల్యే ను కోరారు.
ఎమ్మెల్యే ఆరా తీయగా, పుట్టిన రోజును రద్దు చేసుకొని, కిడ్డి బ్యాంకు లో దాచుకున్న నగదును కరోనా నేపథ్యంలో ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇస్తున్నట్లు ఆ చిన్నారులు తెలిపారు. చిన్నారుల స్పూర్తి ని ఎమ్మెల్యే అభినందించారు.