ఏపీలో కరోనా టెస్టింగ్ కేంద్రాలు పెంచాలి: బాబు
కరోనా కారణంగా ఆర్ధిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు
హైదరాబాద్: కరోనా కారణంగా ఆర్ధిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణను పాటించాల్సిందేనని ఆయన కోరారు.
శుక్రవారం సాయంత్రం టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు హైద్రాబాద్ లో మీడియాతో మాట్లాడారు.కరోనా వైరస్ కారణంగా ఆక్వా, పౌల్ట్రీ రైతులు ఇబ్బందుల్లో ఉన్నారని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రభుత్వం సూచించిన గైడ్‌లైన్స్ కు అనుగుణంగా ప్రజలు సహకరించాలని చంద్రబాబు కోరారు. ఎక్కడ ఉన్నవారంతా అక్కడే ఉండాలని ఆయన ప్రజలను కోరారు.చాలా గ్రామాల్లో ప్రజలు స్వీయ నియంత్రణ పెట్టుకోవడాన్ని ఆయన అభినందించారు. ప్రజలంతా తొందరపాటుతో కాకుండా సంయమనంతో వ్యవహరించాలని ఆయన సూచించారు.
ఏపీ రాష్ట్రంలో నామమాత్రంగా టెస్టింగ్ సెంటర్లు ఉన్నాయని ఆయన విమర్శించారు.టెస్టింగ్ సెంటర్లను పెంచాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రధానమంత్రి తీసుకొన్న జనతా కర్ఫ్యూ, లాక్ డౌన్ నిర్ణయం సరైందని ఆయన అభిప్రాయపడ్డారు. అన్ని పార్టీలు, నాయకులు ఈ విషయంలో ప్రభుత్వానికి సహకరించాలని ఆయన కోరారు.
Also read:విదేశాల నుండి ఏపీకి 28 వేల మంది,కరోనా కట్టడికి చర్యలు: మంత్రి పేర్ని నాని
రైతు బజార్లను విస్తరించాలని చంద్రబాబు ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. విదేశాల నుండి వచ్చిన వారంతా క్వారంటైన్ లో ఉంటే ఈ పరిస్థితులు ఉత్పన్నమయ్యే పరిస్థితి వచ్చేది కాదని చంద్రబాబు చెప్పారు.
సామాజిక దూరం పాటించడం, ఇంటికే పరిమితం కావడం ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా నిరోధించే అవకాశం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.