నిధుల కొరత లేదు... కేంద్రం నుండి రూ.460 కోట్లు విడుదల: మంత్రి పెద్దిరెడ్డి
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో మరింతమంది కూలీలకు ఉపాధి కల్పించేందుకు ప్రయత్నిస్తున్నట్లు... అందుకోసం కేంద్ర ప్రభుత్వం కూడా సహకరిస్తోందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు.
అమరావతి: రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్న కూలీలకు సంబంధించిన రూ. 460.81 కోట్ల వేతనాలను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ విడుదల చేసిందని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. కూలీల వేతన బకాయిలను తక్షణమే విడుదల చేయాలని కోరుతూ మార్చి 27, 2020 న కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ కు తాము రాసిన లేఖకు స్పందనగా ఈ నిధులను విడుదల చేశారని... ఏప్రిల్ 5 వ తేదీ వరకు పని చేసిన కూలీలందరికి నేరుగా వారి ఖాతాలకే వేతనాలు జమ అయ్యాయని ఆయన చెప్పారు.
కరోనా వ్యాధి వ్యాప్తితో లాక్ డౌన్ అమల్లో వున్న నేపథ్యంలో ఆర్థిక బాధలతో సతమతమవుతున్న ఉపాధి హామీ కూలీలకు ఇది ఎంతో ఊరట నిస్తుందని ఆయన తెలిపారు. కరోనా తీవ్రతను అవగాహన పరుస్తూ, భౌతిక దూరం పాటిస్తూ 13 జిల్లాల్లో అడిగిన ప్రతి కూలీకి పని కల్పిస్తున్నామని...ఈ విషయంలో ముఖ్యమంత్రి ఆదేశాలు పాటిస్తున్నామన్నారు.
కూలీలు నడిచి వెళ్ళే దూరంలోనే సాధ్యమైనంత వరకు పనులు కల్పిస్తూ, వ్యక్తిగత పనులకు ప్రాధాన్యత ఇస్తూ, వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని మంత్రి అన్నారు.
మొత్తం రూ. 2149.78 కోట్లు మదర్ శాంక్షన్ చేయగా, అందులో ప్రస్తుతం రూ. 460.81 కోట్ల నిధులను కేంద్రం విడుదల చేసిందన్నారు. మరో 1688.97 కోట్ల నిధులు అందుబాటులో ఉన్నాయని, ఇవి దాదాపు జూన్ మాసాంతం వరకు వేతన చెల్లింపులకు సరిపోతాయని మంత్రి పెద్దిరెడ్డి చెప్పారు. కూలీల వేతనం కూడా రూ.211 నుంచి రూ.237 పెరిగిందని, దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన వేసవి అలవెన్సు కూలీలకు మరింత భరోసా ఇస్తుందని తెలిపారు.
నిధులకు ఎలాంటి కొరత లేనందున, ఉపాధి హామీ సిబ్బంది కూడా వ్యక్తిగతంగా తగు రక్షణ చర్యలు తీసుకుంటూ ఈ కష్టకాలంలో మరిన్ని పనులు ఇచ్చి, కూలీలను ఆదుకోవాలని డ్వామా పిడి లను మంత్రి పెద్దిరెడ్డి కోరారు.