బ్రిటన్ ప్రధానిగా వైఎస్ జగన్...నెలకు రూ.400 కోట్ల ప్రజాధనం దోచి...: బుద్దా వెంకన్న
కరోనా వైరస్ వ్యాప్తిని నిరోదించాల్సిన ప్రభుత్వమే ప్రజలను కరోనా బారిన పడేలా వ్యవహరిస్తోందని టిడిపి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆరోపించారు.
గుంటూరు: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, వైసిపి ఎంపీ విజయసాయి రెడ్డిలపై టిడిపి అధికార ప్రతినిధి, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మరోసారి విరుచుకుపడ్డారు. రాష్ట్ర ప్రజలను కరోనా బారినుండి కాపాడాల్సిన ప్రభుత్వమే తమ చర్యలతో కరోనా వచ్చేలా చేస్తున్నారని మండిపడ్డారు. తండ్రి, బాబాయ్ చావులతో రాజకీయాలు చేసినవారు ఎవరో చెప్పాలి విజయసాయి రెడ్డి అంటూ సీఎం జగన్ పై సంచలన ఆరోపణలు చేశారు.
''వైఎస్ జగన్ గారి పబ్లిసిటీ పిచ్చి పీక్స్ కి చేరింది.దానికి ఎంపీ విజయసాయి రెడ్డి సైకో తెలివితేటలు తోడయ్యాయి. వెరసి జగన్ బ్రిటన్ ప్రధాని అయ్యారు.వాలంటీర్ల పేరుతో వైకాపా కార్యకర్తలకు నెలకు 400 కోట్లు ప్రజా ధనం దోచిపెడుతున్నారు'' అని ఆరోపించారు.
''ప్రజలు కష్టాల్లో ఉంటే రేషన్ సరుకులు ఇంటికి ఇవ్వలేని వాలంటీర్ వ్యవస్థ ఎందుకు దండగ. రేషన్ కోసం జనాల్ని గుంపులుగా నిలబెట్టి కరోనా బారిన పడేలా చేస్తారా?'' అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
''ఇంత అస్తవ్యస్తంగా ఉన్న జగన్ గారి చెత్త పాలనని బ్రిటన్ లాంటి దేశాలు ఆదర్శంగా తీసుకున్నాయి అని బ్లాక్ పేపర్ లో వార్తలు రాయించుకోవడానికి సిగ్గుగా లేదు సాయి రెడ్డి గారు?'' అని ఎద్దువా చేశారు.
''కరోనా వచ్చి ప్రజలు ఇబ్బందులు పడుతున్నా చిల్లర రాజకీయం మొదలుపెట్టిన విజయసాయి రెడ్డికి చిన్న నిజరోనా టెస్ట్ పెడుతున్నా తండ్రి శవం దొరక్కముందే ముఖ్యమంత్రి కుర్చీ పై కన్నేసి సంతకాలు సేకరించి శవాల పై పేలాలు ఏరుకున్నది ఎవరు?'' అంటూ ప్రశ్నలు సంధించారు.
''పెద్ద జబ్బుతో పోయిన వాడు మా నాన్న కోసం పోయాడు అంటూ ఓదార్పు పేరుతో బుగ్గలు నిమిరి సగం మందికి మాత్రమే సహాయం అందించి మిగిలిన వాళ్ళకి ఎగ్గొట్టి శవాలపై పేలాలు ఏరిన నాయకుడు ఎవరు? ఆఖరికి బాబాయ్ హత్యని కూడా రాజకీయం కోసం వాడుకొని శవాలపై పేలాలు ఏరుకున్న వారు ఎవరు?'' అని విమర్శించారు.
''సాయి రెడ్డి గారు ఈ ప్రశ్నలకు సమాధానం మీ ట్విట్టర్ లో పెడతారని ఆశిస్తున్నా. శవాలపై పేలాలు ఏరే బ్రాండ్ అంబాసిడర్ వైఎస్ జగన్ గారు అయితే వెనుక డప్పు కొట్టేది మీరు అని మర్చిపోతే ఎలా సాయి రెడ్డి గారు'' అంటూ వెంకన్న మండిపడ్డారు.