అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం లాక్ డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న రాష్ట్ర ప్రజలను ఆదుకోవడంలో విఫలమైందని ఏపి టిడిపి అధ్యక్షులు కిమిడి కళా వెంకట్రావు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం భారీ ప్యాకేజీని ప్రకటించినా వాటిని కూడా ప్రజలకు అందించడం లేదని అన్నారు. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దృష్టికి తీసుకెళుతూ ఓ బహిరంగ  లేఖ రాశారు కళా వెంకట్రావు. 

కళా వెంకట్రావు లేఖ యదావిదిగా.... 

గౌ. కేంద్ర ఆర్ధిక శాఖా మంత్రి  

శ్రీమతి నిర్మలా సీతారామన్ గారికి,

విషయం : కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ ప్రజలకు పక్కగా అమలు కావాలి మరియు పేదలకు నిత్యావసరాల పంపిణీలో సక్రమంగా జరగాలి.

దేశంలో కరోనా మహమ్మారిని అడ్డుకోవడానికి ప్రభుత్వం ప్రకటించిన లాక్ డౌన్ వలన పేదలు, కార్మికులు, రోజువారీ కూలీలు అవస్థలు పడకుండా ఉండేందుకు బియ్యం, పప్పు, ఒక గ్యాస్ సిలిండర్ వంటి వాటిని ఉచితంగా అందించాల్సిందిగా మీరు తీసుకున్న నిర్ణయం అభినందనీయం. అయితే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం పరిస్థితులు మీ నిర్ణయానికి భిన్నంగా ఉన్నాయి. కేంద్రం ప్రకటించిన సరుకుల్లో ఇప్పటి వరకు రాష్ట్రంలో ఒక్కరికి కూడా ఉచితంగా అందించిన దాఖలాలు లేవు. 

అసంఘటిత కార్మికులు అధికంగా ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి. లాకౌన్ కారణంగా లక్షలాది మంది కార్మికులు, కూలీలు ఇళ్లకే పరిమితమయ్యారు. ఆదాయం లేక ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవలి కాలంలో ఇసుక కొరత కారణంగా భవన నిర్మాణ కార్మికులు సహా సుమారు 20 లక్షల మంది ఉపాధి లేక రోడ్డున పడ్దారు. ఇప్పుడు లాక్ డౌన్ కారణంగా మరళా ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 

రాష్ట్రంలో నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అయినా వాటిని అదుపు చేయడంలో ప్రభుత్వం విఫలమైంది. రెండు వారాల క్రితం ఉన్న ధరల కంటే ప్రస్తుతం మూడు నాలుగు రెట్లు ఎక్కువ వసూలు చేస్తున్నారు. దీంతో సామాన్య, మధ్యతరగతి కుటుంబాల బడ్జెట్ తలకిందులవుతోంది. కూలీలు, కార్మికులు, దినసరి వేతన జీవుల బతుకు భారమవుతోంది.

రాష్ట్ర ప్రభుత్వ పథకాలను సక్రమంగా లబ్దిదారులకు చేరవేయడమే లక్ష్యంగా నియమితులైన గ్రామ, వార్డు వాలంటీర్లే అక్రమాలకు పాల్పడుతున్నారు. పెన్షన్లను సగమే ఇస్తూ.. మిగిలిన మొత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం అంటూ బలవంతంగా లాక్కుంటున్నారు. రేషన్ కార్డు దారులకు అందించాల్సిన బియ్యం, పప్పుల్లోనూ కోత విధిస్తున్నారు. ప్రశ్నించిన వారిపై దాడులకు పాల్పడుతున్నారు. 

రాష్ట్ర ప్రభుత్వం రేషన్ సరుకులను పంపిణీ చేస్తున్నట్లు చెబుతూ.. కేంద్రం ప్రకటించిన ఉచిత బియ్యం, పప్పును పంపిణీ చేయకుండా నిలిపివేస్తోంది. దీంతో కేంద్ర పథకాలు ప్రజలకు చేరడం లేదు.విద్యార్ధులకు ఆహార భద్రత కల్పించేందుకు ప్రారంభించిన మధ్యాహ్న భోజనం అమలు అత్యంత దుర్భరంగా తయారైంది. మధ్యాహ్న భోజనం అందించలేని పక్షంలో సదరు భత్యాన్ని లేదా అందుకు సరిపడా మొత్తాన్ని డబ్బు రూపంలో విద్యార్ధికి చేరవేయాల్సిందిగా మీరు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు. కానీ ఆంధ్రప్రదేశ్ లో ఆ దిశగా తీసుకున్న చర్యలు శూన్యం. ఫలితంగా రాష్ట్రంలో మధ్యాహ్న భోజనంపైనే ఆధారపడిన విద్యార్ధుల కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, ప్రజల అవస్థలను గుర్తించి కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ ప్రతి పౌరుడికీ అందేలా తగు చర్యలు తీసుకోగలరు. 


                                       

                                                                                                                                                                                                                                       కిమిడి కళా వెంకట్రావు
                                                                                                                                                                                                                                      టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు