నాపై పచ్చ మీడియా కుట్ర, నేను వెళ్లలేదు: డిప్యూటీ సీఎం బాషా
తాను నిజాముద్దీన్ లో జరిగిన మత ప్రార్థనలకు వెళ్లినట్లు వచ్చిన వార్తలపై ఏపీ డిప్యూటీ సీఎం అంజాద్ భాషా భగ్గుమన్నారు. తనపై, తమ ప్రభుత్వంపై పచ్చ మీడియా కుట్ర పన్నిందని ఆయన అన్నారు.
అమరావతి: తనపై, తమపై ప్రభుత్వంపై పచ్చ మీడియా పెద్ద కుట్రకు తెరలేపిందని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా ఆరోపించారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో బాధ్యతాయుతంగా ఉండాల్సిన కొన్ని మీడియా సంస్థలు రాజకీయాలకు తెరలేపుతున్నాయని ఆయన విమర్శించారు.
"నేను ఈ నెల 2వ తేదీన ముస్లింలకు వైఎస్సార్ ఇచ్చిన 4 శాతం రిజర్వేషన్ కేసు విషయమై ఢిల్లీ వెళ్ళాను. కానీ నేను అక్కడి మత ప్రార్థనలకు వెళ్లినట్లు దుష్ప్రచారం మొదలుపెట్టారు. నేను ఒక రాష్ట్రానికి డెప్యూటీ సీఎంను..నాకు ప్రోటోకాల్ ఉంటుంది. అందులో నా ప్రతి ఒక్క అడుగు నమోదు అవుతుంది" అని ఆయన అన్నారు.
"ఆ రోజు నేను ఏపీ భవన్ లొనే బస చేసాను..మరుసటి రోజు సీఎంను కలిశాను...న4వ తేదీ కాబినెట్ లోనూ ఉన్నాను..ఆ తర్వాత కడప చేరుకుని ఎన్నికల పనుల్లో పడ్డాం నిజాలు తెలుసుకోకుండా ఇష్టారీతిన రాయడమే జర్నలిజమా? కనీసం నా వివరణ కూడా అడగలేదు" అని అంజాద్ బాషా అన్నారు.
"ఇదంతా ఈ కరోనా సమయంలో ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని, నన్ను ఇబ్బంది పెట్టాలని పచ్చ మీడియా పన్నిన కుట్ర అందుకే నేను చట్టపరంగా క్రిమినల్ కేసు పెడతాను...పరువు నష్టం దావా వేస్తాను. ప్రజలంతా వాస్తవాలు తెలుసుకోవాలి...పచ్చ మీడియా రాసిన పిచ్చి రాతలను నమ్మొద్దు" అని ఆయన అన్నారు.