కరోనా నివారణకు రంగంలోకి ప్రత్యేక టీంలు... అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు

కరోనా మహమ్మారిని తరిమి కొట్టేందుకు అధికారులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పలు సలహాలు, సూచనలిచ్చారు.  

AP CM YS Jagan Review  meeting with  officers over Coronavirus

అమరావతి: కోవిడ్‌ –19 ( కరోనా వైరస్‌) నివారణా చర్యల గురించి అన్ని జిల్లాల కలెక్టర్లు, మున్సిపల్‌ కమిషనర్లు, ఆర్డీఓలు, ఎస్పీలతో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎంతో పాటు మంత్రులు కన్నబాబు, బొత్స సత్యనారాయణ, చీఫ్‌ సెక్రటరీ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్‌ సహా ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. 

కరోనాకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటివరకూ గట్టి చర్యలే తీసుకున్నారని అన్నారు. అందరూ సమిష్టిగా పనిచేస్తున్నారని...గ్రామ, వార్డు వాలంటీర్లు, గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది, డాక్టర్లు, ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు, పోలీసు సిబ్బంది గట్టిగానే పనిచేస్తున్నారని అన్నారు. లాక్‌డౌన్‌ను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని... దేశం మొత్తం ఒకే దిశగా అడుగులు వేస్తోందన్నారు.

కరోనా నివారణకు తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకోవాలని... లేకపోతే లాక్‌డౌన్‌కు సంబంధించిన ఉద్దేశం నెరవేరదన్నారు. అర్బన్‌లో ఉన్న ప్రజలమీద కరోనా వైరస్‌ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందని... జనసాంద్రత ఎక్కువుగా ఉండడం, విదేశాలనుంచి ఎక్కువమంది వచ్చిన వారు అర్బన్‌ప్రాంతాల్లో ఉండడం దీనికి కారణం కావొచ్చన్నారు. అర్బన్‌ ప్రాంతాల్లో పరిస్థితులు పూర్తిగా అదుపులో ఉండాలని...కలెక్టర్లతోపాటు మున్సిపల్‌ కమీషనర్లు చాలా ముఖ్యమైన పాత్ర పోషించాల్సి ఉంటుందన్నారు. 

అర్బన్‌ ప్రాంతాలపై అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రెండు రకాల బృందాలతో కోవిడ్‌–19 నివారణా చర్యలను పటిష్టంగా చేపట్టాలన్నారు. 
మొదటి దశ టీంలో వార్డు వాలంటీర్లు, స్వయం సహాయక సంఘాల ప్రైమరీ రీసోర్స్‌ పర్సన్లు, వార్డు సచివాలయంలో ఉండే హెల్త్‌ సెక్రటరీ, అదనపు ఏఎన్‌ఎం, ఆశా వర్కర్‌ ఉంటారని.... విదేశాలనుంచి వచ్చిన వారు ఉన్నా, లేకున్నా సరే ప్రతి ఇంటిమీదా వీరు దృష్టి పెట్టాలన్నారు. ప్రతి ఇంటినీ సర్వే చేసి వైరస్‌ లక్షణాలు ఉన్నవారిని గుర్తించాలని సూచించారు. 

ఇక  రెండో స్థాయిలో ప్రతి వార్డుకూ ఒక వైద్యుడ్ని ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి కార్పొరేషన్‌, ప్రతి వార్డుకూ డాక్టర్‌ను ఏర్పాటు చేయాలని... మున్సిపాల్టీల్లో ప్రతి మూడు వార్డులకు ఒక డాక్టర్‌ను ఉంచాలన్నారు. మొదటి స్థాయి టీం నుంచి వచ్చే డేటాను ప్రతిరోజూ మానిటర్‌ చేసి ఆ మేరకు చర్యలు తీసుకోవాలన్నారు.

''మొదటిరోజు ఒక వ్యక్తిని మనం చూసినప్పుడు వైరస్‌ లక్షణాలు కనిపించకపోవచ్చు, ఆతర్వాత కనిపించవచ్చు. అందుకనే ప్రతిరోజూ కూడా ప్రతి ఇంటినీ సర్వే చేయాలి. 
ఇంట్లోనే వైద్యం తీసుకుంటూ కోలుకున్న సందర్భాలు ఉన్నాయి. అందువల్ల ఎవ్వరూ భయపడాల్సిన పనిలేదు. కాకపోతే ముందుగానే గుర్తించడం వల్ల బాగా మేలు జరుగుతుంది. 
వయస్సు ఎక్కువగా ఉన్నవారు, బీపీ, షుగర్‌ లాంటి వ్యాధులతో బాధపడుతున్న వారిమీద ఇది ఎక్కువ ప్రభావం చూపుతోంది. అందుకనే ప్రైమరీ లెవల్‌ టీమ్స్, సెకండర్‌ లెవల్‌ టీమ్స్‌ బాగా పనిచేయాల్సి ఉంది'' అని జగన్ పేర్కొన్నారు. 

ఈ టీమ్స్‌ బాగా పనిచేయాల్సిన బాధ్యత కలెక్టర్లు, మున్సిపల్‌ కమిషనర్ల మీద ఉందన్నారు. కార్పొరేషన్‌లో వార్డుకు, మున్సిపాల్టీలో ప్రతి మూడు వార్డులూ వైద్యులను ఉండాలంటే.. అందుబాటులోకి మరింతమంది వైద్యులను తీసుకురావాల్సి ఉంటుందన్నారు. ఇందుకోసం ప్రయివేటు వైద్యులను ఎంపానెల్‌ చేయమని ఇదివరకే చెప్పినట్లు...  దీనిమీద దృష్టిపెట్టాలని అధికారులను సీఎం కోరారు. 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios