అమరావతి:  కోవిడ్‌ –19 విస్తరణ, నివారణా చర్యలపై సీఎం వైయస్‌.జగన్‌ సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కరోనా విస్తరణ, ప్రస్తుత పరిస్థితులను అధికారులు సీఎంకు వివరించారు.కొత్తగా 19 కేసులు నమోదయ్యాయని, మొత్తంగా 180 పాజిటివ్‌ కేసులు రాష్ట్రంలో రికార్డయ్యాయని అధికారులు వివరించారు.  

కొత్తగా నమోదైన 19 కేసుల్లో ఢిల్లీలో జమాత్‌కు హాజరైన వారు 10 మంది, ప్రైమరీ కాంటాక్ట్స్‌ 9 మందికి వైరస్‌ సోకిందని వెల్లడించారు. ఢిల్లీ వెళ్లినవారికి, ప్రైమరీ కాంటాక్ట్‌ అయిన వారికి మొత్తమ్మీద సుమారు 1900 పరీక్షలు నిర్వహిస్తున్నామని...ఇప్పటికే చాలావరకు పరీక్షలు పూర్తయ్యాయని, మిగిలిన వాటికీ పరీక్షలు ఒకటి రెండు రోజుల్లో పూర్తిచేస్తున్నామన్నారు అధికారులు. అలాగే రాష్ట్రంలోని 1.45 కోట్ల కుటుంబాల్లో 1.35 కోట్ల కుటుంబాల సర్వే పూర్తయ్యిందని, మిగతా ఇళ్ల సర్వేకూడా పూర్తవుతుందని తెలిపారు. 

లక్షణాలు ఉన్నవారిని గుర్తించి వైద్యులచేత పరీక్షలు చేయిస్తున్నామని, వీరిలో ఎవరికి టెస్టులు నిర్వహించాలన్నదాన్ని వైద్యులే నిర్ధారిస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అధికారులకు పలు సలహాలు, సూచనలిచ్చారు. అత్యవసర వైద్యసేవలకు ఇబ్బంది రాకుండా చూడాలని సీఎం ఆదేశించారు. 

కోవిడ్‌–19 నివారణా చర్యల్లో నిమగ్నమైనప్పటికీ మరోవైపు మిగతా పేషెంట్లకు ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కిడ్నీ, తలసేమియా పేషెంట్లు, గర్భిణీలు లాంటి కేసులకు వైద్యం అందడంలో ఎలాంటి ఇబ్బంది రాకూడదని స్పష్టంచేశారు. ముఖ్యమైన కేటగిరీలతో జాబితాను తయారుచేసి వారికి వైద్యం అందడంలో ఎలాంటి ఇబ్బంది రాకుండా చూడాలన్న సీఎం సూచించారు. వారికి వైద్యం అందించకుండా నిరాకరించడాన్ని తీవ్రంగా పరిగణించాలన్నారు. 

అలాగే ప్రస్తుత పరిస్థితిని సానుకూలంగా తీసుకుని చికిత్సకయ్యే రేట్లు కూడా పెంచితే తీవ్రమైన చర్యలు ఉంటాయని స్పష్టంచేశారు. ఈమేరకు అందరికీ సరైన సందేశం పంపాలని అధికారులకు ఆదేశించారు సీఎం జగన్.

ఇక వ్యవసాయం, ధరలు, మార్కెటింగ్‌పై కూడా సీఎం సమీక్షించారు. పంటలు, ధరలు, వాటి పరిస్థితిపై క్షేత్రస్థాయి నుంచి నిరంతరం సమాచారం తెప్పించుకోవాలని సూచించారు. ప్రతిగ్రామంలో ఉన్న అగ్రికల్చర్‌ అసిస్టెంట్, రైతు భరోసాకేంద్రాల సిబ్బంది ద్వారా నిరంతరం వ్యవసాయంపై సమాచారం తెప్పించుకోవాలన్నారు. ఈ సమాచారం ఆధారంగా వ్యవసాయం, మార్కెటింగ్, పౌరసరఫరాల అధికారులు కూర్చుని చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. 

నిల్వచేయలేని పంటల విషయంలో రైతులు నష్టపోకుండా వెంటనే చర్యలుతీసుకోవాలని సీఎం ఆదేశించారు. అనంతపురం, కడపల నుంచి దాదాపు 200 లారీల ఉత్పత్తులను ఢిల్లీ, హర్యానాకు పంపించగలిగామని అధికారులు సీఎంకు తెలిపారు. దేశవ్యాప్తంగా వ్యవసాయ మార్కెట్ల విషయంలో చాలా ఒడిదుడుకులు ఉన్నాయని... యాభైశాతం మార్కెట్లు మూతబడ్డాయని, ఉన్న మార్కెట్లలో కూడా కార్యకలాపాలు 20–30శాతానికి మించి ఉండడంలేదని వెల్లడించిన అధికారులు. 

అందుకనే స్థానికంగా ఉన్న మార్కెట్లు, అలాగే గ్రామాల వారీగా చిన్నచిన్న మార్కెట్లను ఏర్పాటుచేసి రైతు నష్టపోకుండా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు వెల్లడించారు. 
అలాగే ఇతర రాష్ట్రాలకు రవాణా పరంగా ఉన్న ఇబ్బందులను ఎప్పకటిప్పుడు పరిష్కరిస్తున్నామని వెల్లడించారు.  పంట చేతికొచ్చిన ప్రస్తుత సమయంలో తూర్పుగోదావరిలో 427 పంటనూర్పిడి యంత్రాలు, పశ్చిమగోదావరిలో 380 యంత్రాలు, కృష్ణాలో 300 యంత్రాలను సిద్ధంచేశామని అధికారులు సీఎంకు తెలిపారు. 

ప్రతి గంటకూ రూ.1800 నుంచి 2200 మధ్య రేటు ఖరారుచేశామని, ఇంతకుమించి ఎవరైనా రైతులనుంచి ఎక్కువ వసూలు చేస్తే వాటి లైసెన్సులు కూడా రద్దుచేస్తామని అధికారులు వెల్లడించారు. కోవిడ్‌ నివారణా చర్యలపై ప్రస్తుతం పనిచేస్తున్న టాస్క్‌ఫోర్స్‌లో వైద్య ఆరోగ్యం, వ్యవసాయం, మార్కెటింగ్‌... శాఖలు చాలా కీలకమని  సీఎం అన్నారు. 

కోవిడ్‌ –19 కారణంగా తలెత్తిన సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని, ఆమేరకు కార్యాచరణతో ముందుకు సాగాలని సంబంధిత అధికారులకు స్పష్టంచేశారు జగన్. రాష్ట్రవ్యాప్తంగా క్యాంపుల్లో ఉన్న వారికి అందుతున్న సదుపాయాలు, ఇచ్చిన ఆదేశాలు అమలు చేస్తున్న తీరును అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. కూలీలు అయినా, కార్మికులైనా, వలస కూలీలు అయినా ఎవ్వరుకూడా ఆకలితో ఉన్నారన్న మాట రాకూడదని సీఎం తెలిపారు. ఇలాంటి వారు ఎక్కడ ఉన్నా వారిని ఆదుకోవాలని జగన్ అధికారులకు స్పష్టంచేశారు.