విజయవాడ: కరోనా రోగులకు రైల్వే ఏసీ కోచ్ లను ఐసోలేషన్ వార్డులుగా తయారు చేస్తున్నారు. రైల్వే శాఖ విజయవాడ డివిజన్ పరిధిలో నాలుగు కేంద్రాల్లో  రైల్వే కోచ్ లను ఐసోలేషన్ వార్డులుగా తయారు చేసే ప్రక్రియ కొనసాగుతోంది.

కరోనాను పురస్కరించుకొని దేశ వ్యాప్తంగా రైల్వే శాఖ రైళ్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకొన్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో ఏసీ రైల్వే కోచ్ లను ఐసోలేషన్ వార్డులుగా తీర్చిదిద్దుతున్నారు.

కోచ్ ల్లో ఉన్న మిడిల్ బెర్త్ లను తీసివేస్తున్నారు. రెండు బెర్తులను ఏర్పాటు చేశారు. ఒక్కో కోచ్ లో 9 క్యాబిన్ లలో 18 బెర్తులను ఏర్పాటు చేశారు. బెడ్స్ పక్కనే ఆక్సిజన్ సిలిండర్లు పెట్టేలా కోచ్ లో మార్పులు చేర్పులు చేశారు. 

Also read:కరోనా ఎఫెక్ట్: ఏపీలో జైళ్ల నుండి 259 మంది ఖైదీల విడుదల

కోచ్ లో కుడివైపున రోగులు, ఎడమ వైపున పారా మెడికల్ సిబ్బంది ఉండేలా బెర్తులను సిద్దం చేశారు.కోచ్ లో ఉన్న వాష్ రూమ్‌ల్లో కూడ మార్పులు చేర్పులు చేస్తున్నారు. 

విజయవాడ డివిజన్ పరిధిలోని విజయవాడ, నర్సాపురం,కాకినాడ, మచిలీపట్నం ప్రాంతాల్లో ఏసీ కోచ్ లను ఐసోలేషన్ వార్డులుగా మార్చుతున్నారు. ఈ డివిజన్ పరిధిలో 40 కోచ్‌లను ఐసోలేషన్ వార్డులుగా మారుస్తున్నారు. ఈ డివిజన్ పరిధిలో తొలి విడతలో 700 పడకలను సిద్దం చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు 161 నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకొంటుంది. రాష్ట్రంలోని నాలుగు చోట్ల ప్రత్యేక ఆసుపత్రులను ఏర్పాటు చేసింది. మరో వైపు నియోజకవర్గంతో పాటు జిల్లా కేంద్రాల్లో ఐసోలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసింది.