Asianet News TeluguAsianet News Telugu

టాప్ 10 కంపెనీలోకి టెస్లా : విద్యుత్ కార్ల సంస్థ ఎం-క్యాప్ 321 బిలియన్ డాలర్లు..

విద్యుత్ కార్ల తయారీ సంస్థ టెస్లా షేర్ జెట్‌ స్పీడ్‌లో దూసుకెళుతోంది. త్వరలో ఎస్ అండ్ పీ- 500 ఇండెక్స్‌లో అడుగుపెట్టనున్నది. సోమవారం ఒక దశలో 16 శాతం దూసుకెళ్లడంతో సంస్థ మార్కెట్ క్యాపిటలైజేషన్ 321 బిలియన్‌ డాలర్లకు  చేరుకున్నది. తద్వారా టాప్‌-10 కంపెనీల జాబితాలో చోటు చేసుకుంది. 
 

Tesla Is Now Bigger Than Bank of America and American Express Combined
Author
Hyderabad, First Published Jul 14, 2020, 3:40 PM IST

వాషింగ్టన్: కరోనా కష్టకాలంలోనూ గ్లోబల్‌ ఆటో దిగ్గజం టెస్లా ఇంక్‌ షేరు లాభాలతో కదం తొక్కుతోంది. అమెరికాలో లిస్టయిన ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా షేర్.. పలు రికార్డులు సృష్టించడంతో ఇటీవల తరచుగా వార్తల్లో పతాక శీర్షికలకెక్కుతోంది. 

ఇందుకు అమెరికాలోని పలు రాష్ట్రాలలో లాక్‌ డౌన్‌ కొనసాగుతున్నా, వాహన విక్రయాలను పెంచుకోగలగడం, ఎస్‌అండ్‌పీ ఇండెక్స్‌లో చోటు లభించనున్న అంచనాలు వెలువడుతున్నాయి. సోమవారం నాస్‌డాక్‌, ఎస్‌అండ్‌పీ ఇండెక్సులు 2-1 శాతం మధ్య వెనకడుగు వేశాయి.

టెస్లా ఇంక్‌ షేర్ 3 శాతం క్షీణించి 1497 డాలర్ల వద్ద ముగిసింది. తొలుత 16 శాతం దూసుకెళ్లి 1795 డాలర్లకు చేరింది. ఇది సరికొత్త గరిష్టంకాగా దీంతో కంపెనీ మార్కెట్‌ క్యాపిటలైజేషన్ విలువ 321 బిలియన్‌ డాలర్లను తాకింది. 


అమెరికా స్టాక్‌ మార్కెట్లలో లిస్టయిన టాప్‌-10 కంపెనీల జాబితాలో చోటు సాధించింది. అంతేకాక మార్కెట్‌ విలువలో ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం ప్రాక్టర్‌ అండ్‌ గ్యాంబుల్‌ (పీఅండ్‌జీ)ను వెనక్కి నెట్టేసింది. అయితే చివర్లో అమ్మకాలు ఊపందుకుని చతికిలపడటంతో మార్కెట్‌ విలువ దాదాపు 278 బిలియన్‌ డాలర్లకు దిగివచ్చింది.

also read కారు కొనాలనుకుంటున్నారా.. అయితే లోన్ ఎలా పొందాలంటే ? ...

ఈ ఏడాది ఇప్పటివరకూ టెస్లా ఇంక్‌ షేరు 200 శాతం దూసుకెళ్లింది. ఈ నెలలో 38 శాతం లాభపడింది. ఈ బాటలో మార్కెట్‌ విలువ రీత్యా ఈ నెల మొదటి వారంలో జపనీస్‌ ఆటో దిగ్గజం టయోటాను అధిగమించిన విషయం విదితమే.

ఇందుకు ప్రధానంగా రెండు త్రైమాసికం కాలంలో అంచనాలను మించుతూ 90,650 కార్లను విక్రయించడం ప్రభావం చూపింది. మోడల్‌ 3, మోడల్‌ ‘వై’ కార్లు ఇందుకు సహకరించినట్లు నిపుణులు పేర్కొన్నారు. అంతక్రితం జనవరి-మార్చిలో 72వేల వాహనాలు విక్రయించారు. కానీ పరిశ్రమవర్గాలు 83వేల వాహన అమ్మకాలను అంచనా వేశాయి.

మరోపక్క ఎస్‌అండ్‌పీ-500 ఇండెక్స్‌లో టెస్లా ఇంక్‌ షేర్‌కు త్వరలో చోటు లభించనున్న అంచనాలు పెరుగుతున్నట్లు విశ్లేషకులు తెలిపారు. ఎస్‌అండ్‌పీలో చోటు లభిస్తే ఈటీఎఫ్‌, ఇండెక్స్‌ ఫండ్స్‌ తదితర మరిన్ని సంస్థలు కంపెనీలో ఇన్వెస్ట్‌ చేయాల్సి ఉంటుందని అభిప్రాయ పడ్డారు. 

గతేడాది టెస్లా దాదాపు 25 బిలియన్‌ డాలర్ల ఆదాయాన్ని సాధించింది. ఈ బాటలో వాహనాల సేల్స్ పెరుగుతుండటంతో మరింత మెరుగైన ఫలితాలు సాధించగలదని అంచనాలు బలపడుతున్నాయి. దీంతో 2025కల్లా కంపెనీ ఆదాయం 100 బిలియన్‌ డాలర్లను తాకవచ్చని జేఎంపీ సెక్యూరిటీస్‌ నిపుణులు జో ఓషా అంచనా వేశారు.

టెస్లా ఇంక్‌ షేర్‌కి జో వేసిన 1500 డాలర్ల టార్గెట్‌ను ఇప్పటికే అధిగమించింది. కంపెనీ ఏప్రిల్‌-జూన్‌ ఫలితాలను ఈ నెల 22న వెల్లడించనుంది.

లాక్‌డౌన్‌ వల్ల గ్లోబల్‌ ఆటోమొబైల్ సంస్థలు జనరల్‌ మోటార్స్‌, టయోటా, ఫియట్‌ క్రిస్లర్‌, ఫోర్డ్‌ వంటి కంపెనీల అమ్మకాలు నీరసిస్తున్నట్లు నిపుణులు తెలిపారు. అయితే, టెస్లాను పూర్తిస్థాయి ఆటో దిగ్గజ కంపెనీలతో పోల్చడం సరికాదని పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి.
 

Follow Us:
Download App:
  • android
  • ios