ఇండియన్ ఆటోమొబైల్ పరిశ్రమను వెంటాడుతున్నా కరోనా వైరస్.....

ఇండియన్ ఆటోమొబైల్ పరిశ్రమను కరోనా భయాలు వెంటాడుతున్నాయి.  పరిస్థితి ఇలాగే కొనసాగితే చైనా విడిభాగాల దిగుమతులు ఆగిపోతాయని సియామ్‌ ఆందోళన చెందుతున్నది. 
 

Coronavirus no setback for Chinese automakers in India

న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్‌ ప్రభావం తమపై గణనీయంగా ఉంటుందని దేశీయ ఆటో పరిశ్రమ ఆందోళన వ్యక్తం చేస్తున్నది. రోజురోజుకూ విస్తరిస్తున్న ఈ ప్రాణాంతక మహమ్మారి.. చైనా నుంచి భారత్‌కు వచ్చే ఆటో విడిభాగాల దిగుమతులను ప్రభావితం చేస్తుందేమోనని భారతీయ ఆటోమొబైల్‌ తయారీదారుల సంఘం (సియామ్‌) పేర్కొంది. కరోనా తీవ్రతకు చైనా వణికిపోతున్న విషయం తెలిసిందే. 

ఈ వైరస్‌ ధాటికి వందల మంది చనిపోగా, వేల మంది మృత్యువుతో పోరాడుతున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు చైనా.. కరోనా అదుపుపైనే దృష్టిపెట్టగా, ఉత్పత్తి ఒక్కసారిగా పడిపోయింది. కరోనా వ్యాప్తిని అడ్డుకోవడంలో భాగంగా చైనాలోని పారిశ్రామిక సంస్థలు తయారీ కేంద్రాలను మూసేస్తున్నాయి. 

also read హోండా డియో బిఎస్ 6 స్కూటర్ లాంచ్....అప్ డేట్ ఫీచర్స్ కూడా...

ఐటీ తదితర సంస్థలు ఉద్యోగులచే ఇంటి నుంచే పని చేయిస్తుండగా, ఉత్పాదక సంస్థలు మాత్రం సెలవులను ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే చైనా ఆటో సంస్థలు ప్లాంట్లను మూసివేసిన సంగతి తెలిసిందే. ఆటో విడిభాగాల తయారీ సంస్థల సంగతి అలాగే ఉంది. దీంతో తమ సభ్యుల నుంచి ప్రస్తుత స్థితిగతుల వివరాలను సేకరిస్తున్నట్లు సియామ్‌ డైరెక్టర్‌ జనరల్‌ రాజేశ్‌ మీనన్‌ సోమవారం మీడియాకు తెలిపారు.

బీఎస్‌-4 నుంచి బీఎస్‌-6కు మారుతున్న భారతీయ వాహన రంగాన్ని కరోనా వైరస్‌ దెబ్బతీస్తున్నది. ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి బీఎస్‌-6 వాహన అమ్మకాలు మాత్రమే దేశీయ మార్కెట్‌లో జరుగాలని కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. 

Coronavirus no setback for Chinese automakers in India

వాతావరణ కాలుష్య నియంత్రణలో భాగంగా బీఎస్‌-4 నుంచి బీఎస్‌-6కు ఆటో పరిశ్రమ పరివర్తన చెందుతున్నది. ఇందుకు కావాల్సిన విడిభాగాలు చైనా నుంచే పెద్ద మొత్తంలో భారత్‌కు వస్తున్నాయి. దీంతో వైరస్‌ కారణంగా మూతబడే అక్కడి పరిశ్రమ.. ఇక్కడి విడిభాగాల అవసరాల కొరతకు దారితీస్తుందన్న అనుమానాలు ఇప్పుడు ఆటో పరిశ్రమను వెంటాడుతున్నాయి.

చైనాలో కరోనా వైరస్‌ వ్యాప్తి, ఉత్పాదక రంగంపై దాని ప్రభావం మధ్య ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి బీఎస్‌-6 వాహన అమ్మకాల నిబంధన గడువు  పొడిగిస్తారా? అన్నదానికి ఇప్పుడే చెప్పలేమని సియామ్‌ పేర్కొన్నది. మరో రెండు, మూడు రోజుల్లో దీనిపై స్పష్టత వస్తుందని సియామ్ తెలిపింది.

also read మారుతి సుజుకి నుండి కొత్త జిమ్నీని మీరు చూశారా...?

 ప్రస్తుతం దీనిపై ఏమీ చెప్పలేమని, వైరస్‌ ప్రభావం చైనా విడిభాగాల సరఫరాపై ఏ స్థాయిలో ఉంటుందో అంచనా వేయలేమని మారుతీ సుజుకీ ఎండీ, సీఈవో కెనిచి అయుకవా పీటీఐతో అన్నారు.

దేశీయ మార్కెట్‌లో ప్యాసింజర్‌ వాహన విక్రయాలు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. గత నెలలో 6.2 శాతం క్షీణించాయి. జీడీపీ మందగమనం, పెరిగిన ధరలు కొనుగోళ్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. సియామ్‌ తెలిపిన తాజా వివరాల ప్రకారం జనవరిలో 2,62,714 యూనిట్ల అమ్మకాలు జరిగాయి. గతేడాది జనవరిలో ఇవి 2,80,091 యూనిట్లు ఉన్నాయి. 

కార్ల విక్రయాలు 8.1 శాతం తగ్గి గతంతో పోల్చితే 1,79,324 యూనిట్ల నుంచి 1,64,793 యూనిట్లకు పడిపోయాయి. ‘బీఎస్‌-4 నుంచి బీఎస్‌-6కు వాహనాలను ఆధునికీకరిస్తుండటంతో ధరలు పెరుగుతున్నాయి. ఇది కొనుగోళ్లను దెబ్బతీస్తున్నది’ అని సియామ్‌ అధ్యక్షుడు రాజన్‌ వధేరా అన్నారు. ద్విచక్ర వాహన విక్రయాలూ జనవరిలో 16.06 శాతం క్షీణించాయన్నారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios