న్యూఢిల్లీ: ఆర్థిక మందగమనానికి తోడు ముడి సరుకుల ధరలు పెరుగుదల, బీఎస్-4 నుంచి బీఎస్-6 ప్రమాణాల్లోకి ఆటోమొబైల్ పరిశ్రమ పరివర్తన చెందుతోంది. ఫలితంగా పెరిగిన వాహనాల ధరలతో జనవరిలో దేశీయ ప్రయాణికుల వాహనాల అమ్మకాలు 6.2 శాతం తగ్గాయని వాహన తయారీదారుల సంఘం సియామ్ తెలిపింది.

వృద్ధి మందగమనం, యాజమాన్య వ్యయం పెరగడానికి తోడు డిమాండ్ తగ్గడమూ దీనికి కారణమని సియామ్ అధ్యక్షుడు రాజన్ వధేరా పేర్కొన్నారు. సియామ్ తెలిపిన గణాంకాల ప్రకారం 2019 డిసెంబర్​లో అమ్ముడైన పాసింజర్ వాహనాల సంఖ్య 2,80,091కాగా, 2020 జనవరిలో ఈ వాహన అమ్మకాలు 2,61,714 యూనిట్లకు పడిపోయాయి.

also read ఇండియన్ ఆటోమొబైల్ పరిశ్రమను వెంటాడుతున్నా కరోనా వైరస్..... 

అన్ని రకాల వాహనాలను పరిగణనలోకి తీసుకుంటే 2019 జనవరిలో 20,19,253 యూనిట్లు అమ్ముడుపోగా, 2020 జనవరి నాటికి 13.83 శాతం క్షీణించి 17,39,975కు పడిపోయాయి. వచ్చే ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి బీఎస్​-4 నుంచి బీఎస్​-6 వాహనాల వైపు మారడానికి ఆటోమొబైల్ సంస్థల యాజమాన్యాలు సన్నద్ధమవుతున్నాయి. 

ఈ నేపథ్యంలో తయారీ ఖర్చులు పెరుగుతున్నాయంటూ పలు కంపెనీలు వాటి వాహనాల ధరలను పెంచేశాయి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై, మౌలిక సదుపాయాలపై ఇటీవల ప్రభుత్వం చేసిన ప్రకటనలు... వాహన అమ్మకాలు వృద్ధి చెందడానికి దోహదపడతాయని ఆశిస్తున్నట్లు సియామ్ అధ్యక్షుడు రాజన్ వధేరా తెలిపారు. 

ముఖ్యంగా వాణిజ్య వాహనాలు, ద్విచక్రవాహనాల అమ్మకాలు పుంజుకుంటాయని సియామ్ రాజన్ వధేరా ఆశాభావం వ్యక్తం చేశారు. త్రీ-వీలర్లు మినహాయించి, మిగతా వాహనాల అమ్మకాలు బాగా క్షీణించాయని సియామ్ డైరెక్టర్ రాజేష్​ మీనన్​ చెప్పారు.

పండగ సీజన్​లోనూ వాహనాల అమ్మకాలు తగ్గాయని సియామ్ డైరెక్టర్ రాజేష్​ మీనన్​ పేర్కొన్నారు. అయితే ఆటో ఎక్స్​పో 2020కి వినియోగదారుల నుంచి మంచి స్పందన వచ్చిందని, ఇప్పటికే 70 నూతన ఆవిష్కరణలు, ప్రయోగాలు వాహన రంగం పుంజుకోవడానికి దోహదం పడతాయన్నారు.

also read హోండా డియో బిఎస్ 6 స్కూటర్ లాంచ్....అప్ డేట్ ఫీచర్స్ కూడా...

జనవరిలో మారుతి సుజుకీ ఇండియా అమ్మకాలు 0.29 శాతం పెరిగాయి. మొత్తం 1,33,844 యూనిట్లు అమ్ముడుపోయాయి. దక్షిణ కొరియా మేజర్ హ్యుండాయ్ మోటార్ ఇండియా అమ్మకాలు మాత్రం 8.3శాతం క్షీణించి.. 42,002 యూనిట్లు మాత్రమే అమ్ముడుపోయాయి. మహీంద్రా అండ్ మహీంద్రా అమ్మకాలు 17.05 శాతం క్షీణించి 19,794 యూనిట్లకు పడిపోయాయి.

ద్విచక్ర వాహన విభాగంలో మార్కెట్​ లీడర్ హీరో మోటోకార్ప్ అమ్మకాలు 14.37 శాతం తగ్గి 4,88,069 యూనిట్లే అమ్ముడయ్యాయి. హోండా మోటార్ సైకిల్, స్కూటర్ ఇండియా అమ్మకాలు కూడా 6.63 శాతం క్షీణించి 3,74,114 యూనిట్లతో సరిపెట్టుకున్నాయి.

చైన్నైకు చెందిన టీవీఎస్ మోటార్స్ అమ్మకాలు జనవరిలో 28.72 శాతం క్షీణించాయి. 1,63,007 యూనిట్లు మాత్రమే అమ్ముడుపోయాయి. జనవరిలో దేశీయ ప్రయాణికుల వాహనాల అమ్మకాలు 6.2 శాతం తగ్గాయని సియామ్ తెలిపింది. వృద్ధి మందగమనం, యాజమాన్య వ్యయం పెరగడానికి తోడు డిమాండ్ తగ్గడమూ ఇందుకు కారణమని సియామ్ అధ్యక్షుడు రాజన్ వధేరా పేర్కొన్నారు.