టయోటా, హోండా కార్లలో సమస్యలు... 60 లక్షల యూనిట్ల రీకాల్
కార్ల తయారీ సంస్థలు టయోటా, హోండా ప్రపంచ వ్యాప్తంగా 60 లక్షల కార్లను రీకాల్ చేయనున్నాయి. ఆ సంస్థలకు చెందిన కార్లలో ఎయిర్ బ్యాగ్ సమస్యలను పరిష్కరించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాయి.
న్యూఢిల్లీ: ఆటో మొబైల్ దిగ్గజ సంస్థలైన టయోటా, హోండా భారీ సంఖ్యలో తమ కార్లను రీకాల్ చేయనున్నాయి. ఈ రెండు సంస్థలు వాటి కార్లలో వేర్వేరు ఎయిర్ బ్యాగ్ సమస్యలను గుర్తించాయి. ఈ నేపథ్యంలో 60 లక్షల యూనిట్ల వరకు రీకాల్ చేయాలని నిర్ణయించాయి.
also read కియా మోటార్స్ కొత్త కారు రికార్డు: ఒక్కరోజులోనే 1410 ఆర్డర్లు!
టయోటా తమ కార్లలో కొన్ని ప్రమాదానికి గురైనప్పుడు ఎయిర్ బ్యాగ్లు తెరుచుకోవడంలో సమస్యలు తలెత్తుతున్నట్లు గుర్తించింది. ఆ లోపాలను సరిదిద్దేందుకు ప్రపంచవ్యాప్తంగా 34 లక్షల కార్లను రీకాల్ చేయనున్నట్లు ప్రకటించింది. కార్లలో ప్రయాణికుల కోసం తయారుచేసిన సీట్ బెల్టులు కూడా సరిగ్గా పని చేయడం లేదని టయోటా నిర్ధారణకు వచ్చింది.
టయోటా డీలర్లు తాము విక్రయించిన కార్లలో ఎయిర్ బ్యాగ్ కంట్రోల్ కంప్యూటర్, వైరింగ్ హార్నెస్ మధ్య నాయిస్ ఫిల్టర్ ఇన్‌స్టాల్ చేస్తారని టయోటా తెలిపింది. గతేడాది మార్చి మధ్యలో టయోటా కార్ల కొనుగోలుదారులు సమస్యను గుర్తించారు. 2011 నుంచి 2019 మధ్య విక్రయించిన వివిధ మోడల్ కార్లను రీకాల్ చేస్తున్నట్లు టయోటా ప్రకటించింది.
also read కియా మోటార్స్ నుండి మరో రెండు కొత్త మోడల్ కార్లు....
2011-2019 మధ్య గల కొరొల్లా, 2011-13 మధ్య విక్రయించిన మాట్రిక్స్, 2018లో విక్రయించిన అవలోన్, 2013-18 మధ్య విక్రయించిన అవలోన్ హైబ్రీడ్ మోడల్ కార్లను రీకాల్ చేస్తున్నట్లు తెలిపింది. అమెరికా, కెనడాలో హోండా 27 లక్షల కార్లను వెనక్కి రప్పించనున్నట్లు తెలిపింది. టకాట ఎయిర్ బ్యాగ్లతో పని చేస్తున్న మోడళ్లను రీకాల్ చేయనున్నట్లు వెల్లడించింది. 1996-2003 మధ్య విక్రయించిన అక్యూరా మోడల్ కార్లను రీ కాల్ చేస్తున్నామని తెలిపింది.
1998-2000 మధ్య విపణిలో ఆవిష్కరించిన అకార్డ్ కూప్, సెడాన్, 1996-2000 మధ్య విపణిలోకి వచ్చిన సివిక్ కూప్ అండ్ సెడాన్ కార్లు, 1997-2001 మధ్య అందుబాటులోకి వచ్చిన సీఆర్-వీ, 1998-2001 మధ్య వినియోగదారులు కొనుగోలు చేసిన ఒడిస్సీ, 1997-98 మధ్య విక్రయించిన ఈవీ ప్లస్ మోడల్ కార్లను రీకాల్ చేస్తున్నామని హోండా కార్స్ తెలిపింది.