బజాజ్ నుంచి తొలి కారు ‘క్యూట్’: మార్కెట్లోకి ఎప్పుడంటే?
ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ ఇప్పుడు కార్ల తయారీకి శ్రీకారం చుట్టింది. పల్సర్, డిస్కవరీ, అవెంజర్, డామినర్ లాంటి ద్విచక్ర వాహనాలతో ఇప్పటికే మార్కెట్లోనూ, వినియోగదారుల్లోనూ తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకున్న బజాజ్.. కొత్తగా ఓ కారును విడుదల చేసేందుకు సిద్ధమైంది.
న్యూఢిల్లీ: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ ఇప్పుడు కార్ల తయారీకి శ్రీకారం చుట్టింది. పల్సర్, డిస్కవరీ, అవెంజర్, డామినర్ లాంటి ద్విచక్ర వాహనాలతో ఇప్పటికే మార్కెట్లోనూ, వినియోగదారుల్లోనూ తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకున్న బజాజ్.. కొత్తగా ఓ కారును విడుదల చేసేందుకు సిద్ధమైంది.
బజాజ్ క్యూట్ పేరుతో తొలిసారిగా కార్లను విడుదల చేస్తోంది. ఏప్రిల్ 18న అధికారికంగా ఈ కారును భారత మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు సంస్థ మంగళవారం వెల్లడించింది. కాగా, భారత్‌లోనే తొలి క్వాడ్రిసైకిల్ ఇదే కావడం గమనార్హం. అంటే డిజైన్, వినియోగం పరంగా ఆటో, కారుకు మధ్యస్థంగా ఈ వాహనం ఉంటుంది.
2018లోనే కేంద్ర రోడ్డు, రవాణా మంత్రిత్వ శాఖ క్వాడ్రిసైకిల్ వాహనాల తయారీకి ఆమోదం తెలిపింది. ఈ వాహనాలను వాణిజ్యపరంగానూ, వ్యక్తిగత అవసరాల కోసం వాడుకోవచ్చు. బజాజ్ క్యూట్‌ను తొలిసారిగా 2012 ఆటో ఎక్స్‌పోలో ప్రవేశపెట్టారు. ఆ తర్వాత 2016 ఆటో ఎక్స్‌పోలో ప్రొడక్షన్ వెర్షన్‌ను ప్రదర్శించారు.
216సీసీ సామర్థ్యం, సింగిల్ సిలిండర్ ట్విన్ స్పార్క్ ఇంజిన్‌తో మోనో ఫ్యూయల్ వెర్షన్‌లో అందుబాటులో ఉంది. పెట్రోల్ వెర్షన్, సీఎన్జీ వెర్షన్ లో అయినా వాడుకోవచ్చు. పెట్రోల్ వెర్షన్‌లో ఈ కారు 13 బీహెచ్‌పీ పవర్, 18.9ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. సీఎన్జీ వెర్షన్‌లో 10బీహెచ్‌పీ పవర్, 16ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5 స్పీడ్ గేర్‌బాక్స్ కలిగివుంది.
బజాజ్ క్యూట్ వాతావరణ రక్షణను అందించే ఏర్పాట్లు ఉన్నాయని సంస్థ పేర్కొంది. రద్దీ ప్రాంతాల్లో సులభంగా ప్రయాణించే అవకాశం ఉంది. బజాజ్ క్యూట్ పెట్రోల్ వెర్షన్ ధర రూ. 2.64లక్షలు, సీఎన్జీ వెర్షన్ ధర రూ. 2.84లక్షలు(ఎక్స్‌షోరూం)గా ఉంటుందని తెలిపింది. ఈ ధర ఆటో రిక్షా కంటే కేవలం రూ. లక్ష ఎక్కువగా ఉంది.