నీట్ UG 2025 ఫలితాలు ఈరోజు వచ్చే అవకాశం ఉంది. దాదాపు 22.7 లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాశారు. అధికారిక వెబ్‌సైట్ neet.nta.nic.in లో ఫలితాలు, స్కోరు, ర్యాంక్ చూసుకోవచ్చు.
NEET UG Result 2025 : నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నిర్వహించిన నీట్ UG 2025 పరీక్ష పలితాలు ఇవాళ (శనివారం) విడుదలయ్యే అవకాశాలున్నాయి. జూన్ 14, 2025 లోపు ఫలితాలు వస్తాయని ఇప్పటికే NTA ప్రకటించింది… కాబట్టి ఈరోజు నీట్ UG 2025 ఫలితాలు విడుదల చేస్తారని భావిస్తున్నారు.
దేశవ్యాప్తంగా వైద్యవిద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో ఈ NEET పరీక్షను నిర్వహిస్తున్నారు. ఇలా ఈ ఏడాది 22.7 లక్షలకు పైగా విద్యార్థులు పరీక్ష రాశారు. మే 4, 2025న మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఒకే షిఫ్ట్‌లో పరీక్ష జరిగింది. దేశవ్యాప్తంగా 5453 పరీక్షా కేంద్రాల్లో అభ్యర్థులకు ఎగ్జామ్ నిర్వహించారు. నెల రోజులకు పైగా ఈ పరీక్షా ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. వారి ఎదురుచూపులకు నేటితో తెరపడనుంది.
NEET UG 2025 ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి - NTA అధికారిక వెబ్‌సైట్
NEET UG 2025 ఫలితాలు ఎక్కడ, ఎలా చూసుకోవాలి?
NEET UG 2025 ఫలితాలు విడుదలయ్యాక ఈ కింది స్టెప్స్ ఫాలో అయి మీ స్కోర్‌కార్డ్, ర్యాంక్ చూసుకోవచ్చు
- ముందుగా అధికారిక వెబ్‌సైట్ neet.nta.nic.in ఓపెన్ చేయండి.
- హోమ్ పేజీలో “నీట్ UG 2025 పలితాలు” లింక్ మీద క్లిక్ చేయండి.
- మీ అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ లేదా ఇతర లాగిన్ వివరాలు ఎంటర్ చేయండి.
- “సబ్మిట్” క్లిక్ చేస్తే మీ ఫలితాలు స్క్రీన్ మీద కనిపిస్తాయి.
- ఫలితాలు డౌన్‌లోడ్ చేసుకుని, ప్రింట్ తీసుకోండి.
NEET UG 2025 ఆన్సర్ కీ ఎప్పుడు వచ్చింది?
నీట్ UG 2025 ఆన్సర్ కీ జూన్ 3న విడుదల చేశారు. జూన్ 5 వరకు అభ్యంతరాలు తెలియజేయడానికి అవకాశం ఇచ్చారు. ప్రతి ప్రశ్నకు అభ్యంతరం తెలియజేయడానికి ₹200 చెల్లించాల్సి వచ్చింది. ఈ అభ్యంతరాలను నిపుణులు పరిశీలించి, సరైన సమాధానాలతో ఫైనల్ ఆన్సర్ కీ విడుదల చేసారు.
నీట్ UG 2025 ఫలితాల్లో ఏముంటాయి?
ఫలితాల్లో ఈ కింది వివరాలు ఉంటాయి
- మొత్తం మార్కులు
- ఆల్ ఇండియా ర్యాంక్ (AIR)
- కేటగిరీ ర్యాంక్
- క్వాలిఫైయింగ్ స్టేటస్
- కట్-ఆఫ్ స్కోర్
NEET UG మార్కులు ఎలా కేటాయిస్తారు?
- సరైన సమాధానం: +4 మార్కులు
- తప్పు సమాధానం: -1 మార్కు
- సమాధానం ఇవ్వని ప్రశ్న: 0 మార్కులు
నీట్ UG మెరిట్ లిస్ట్ 2025
పరీక్ష ఫలితాలతో పాటు నీట్ UG 2025 ఆల్ ఇండియా మెరిట్ లిస్ట్‌ను NTA విడుదల చేస్తుంది. ఈ మెరిట్ లిస్ట్ ఆధారంగా MBBS, BDS, ఇతర అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ప్రభుత్వ రిజర్వేషన్ విధానం ప్రకారం ప్రవేశాలు ఉంటాయి. పరీక్షలో అక్రమాలకు పాల్పడిన వారి ఫలితాలు రద్దు చేస్తామని NTA స్పష్టం చేసింది.
తెలుగు రాష్ట్రాల్లో ఎంబిబిఎస్ సీట్లెన్ని?
తెలుగు రాష్ట్రాల నుండి దాదాపు లక్షమందికి పైగా నీట్ (నేషనల్ ఎలిజిబిలిటి కమ్ ఎంట్రన్స్ టెస్ట్) పరీక్ష రాసారు. కేవలం తెలంగాణలోనే 72 వేలమంది ఈసారి నీట్ రాసారు... రాష్ట్రంలోని 190 పరీక్షా కేంద్రాల్లో వీరంతా ఎగ్జామ్ రాసారు. తెలంగాణలో మొత్తం 33 ప్రభుత్వ, రెండు డీమ్డ్ యూనివర్సిటీలు (సనత్ నగర్ ఈఎస్ఐ, బిబినగర్ ఎయిమ్స్), 29 ప్రైవేట్ వైద్య కళాశాలలు ఉన్నాయి. వీటిలో 8515 ఎంబిబిఎస్ సీట్లు ఉన్నాయి.
ఇక ఆంధ్ర ప్రదేశ్ విషయానికి వస్తే 70 వేలమందికి పైగా ఈసారి నీట్ పరీక్ష రాసారు. మే 4న ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1.30 వరకు మొదటి సెషన్.. మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్ పరీక్ష నిర్వహించారు... ఇలా ఒకేరోజు ఏపీలోని వివిధ నగరాలు, పట్టణాల్లోని 140 పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులు ఎగ్జామ్స్ రాసారు. ఏపీలోని ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో 6,500 ఎంబిబిఎస్ సీట్లు ఉన్నాయి… వాటిని ఈ నీట్ పరీక్షా ఫలితాల ఆధారంగానే భర్తీ చేస్తారు.