దాదాపు అన్ని మేజర్ బ్యాంకులు కూడా తమ పొదుపు ఖాతాదారులు కనీస మొత్తాలను ఎప్పుడూ బ్యాంకులో నిల్వ ఉంచుకునేలా చూసుకుంటున్నాయి. కనీస నిల్వలు లేకపోతే ఖాతాదారులకు పెనాల్టీలు కూడా వేస్తున్నాయి. దీంతో ఖాతాదారులు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్బీఐ నుంచి ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఇతర పెద్ద బ్యాంకులన్నీ కూడా నెలవారీగా కనీస మొత్తాలను నిల్వ ఉంచాలనే నిబంధనలను అమలు చేస్తున్నాయి. 

ఎస్బీఐలో కనీస మొత్తం(మినిమిమ్ బ్యాలెన్స్) ఎంతంటే.?

sbi.co.inలో పేర్కొనబడిన ప్రకారం..  మెట్రో, పట్టణ ప్రాంతాల్లో ఉండే ఎస్బీఐ ఖాతాదారులు కనీసంగా రూ. 3వేలు నిల్వ ఉంచుకోవాలి. లేదంటే పెనాల్టీ పడుతుంది. సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లోని బ్రాంచ్ ఖాతాదారులు కనీస నెలవారీ నిల్వగా రూ. 2వేలు, రూ. 1000 ఉండాలని పేర్కొంది. 

ఐసీఐసీఐ బ్యాంకులో కనీస నిల్వ: 

ఐసీఐసీఐ బ్యాంకు ఖాతాదారులు మెట్రో, అర్బన్ బ్రాంచీల వారైతే కనీస నెలవారీ నిల్వ రూ. 10,000 ఎప్పుడూ ఉంచుకోవాలి. లేదంటే పెనాల్టీ తప్పదు. ఇక సెమీ అర్బన్ ఖాతాదారులు రూ. 5వేలు, రూరల్ లోకేషన్స్‌లోని ఖాతాదారులు రూ, 2వేలు కనీస నిల్వగా ఉంచుకోవాలి. గ్రామీణ లొకేషన్లలోని ఖాతాదారులు రూ.1000 కనీస నిల్వగా ఉంచుకోవాలి.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో కనీస నిల్వ:

పెనాల్టీలు పడకుండా ఉండాలంటే.. మెట్రో, ఆర్బన్ లొకేషన్లలోని హెచ్‌డీఎఫ్‌సీ ఖాతాదారులు రూ. 10,000 కనీస నిల్వగా నిర్వహించాలి. సెమీ అర్బన్ శాఖల్లోని ఖాతాదారులు నెలవారీగా రూ. 5,000 కనీస నిల్వను ఉంచుకోవాలి. రూరల్ బ్రాంచీలలోని ఖాతాదారులు రూ. 2,500గా కనీస నిల్వను నిర్వహించాలి. లేదంటే ఏడాది కాల పరిమితితో రూ. 10,000 ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలి.