తీవ్ర అనారోగ్యంతో శనివారం ఉదయం కన్నుమూసిన ప్రముఖ పారిశ్రామికవేత్త, ఐటీసీ ఛైర్మన్‌ వై.సి.దేవేశ్వర్‌ (72) సిగరెట్ల వ్యాపారంలో దిగ్గజ సంస్థగా ఉన్న సంస్థను విభిన్న వ్యాపారాలలోకి అడుగు పెట్టించారు. అన్నింటిలోనూ కంపెనీని ఉన్నత స్థితికి తీసుకెళ్లిన ఘనత దేవేశ్వర్‌ది. 

రెండు దశాబ్దాల పాటు చైర్మన్ కం సీఈఓగా దేవేశ్వర్
1996లో కంపెనీకి ఛైర్మన్‌, సీఈఓగా బాధ్యతలు చేపట్టిన ఆయన రెండు దశబ్దాలపాటు ఆ పదవులను విజయవంతంగా నిర్వహించారు. భారతదేశంలో సుదీర్ఘకాలం పాటు ఒక కార్పొరేట్‌ సంస్థకు అత్యున్నత అధికారిగా సేవలందించిన వాళ్లలో దేవేశ్వర్‌ కూడా ఒకరు.

ఐటీసీనే ఇంటిపేరుగా మలుచుకున్న దేవేశ్వర్
2017లో సీఈఓ పదవి నుంచి వైదొలిగినా, తుదిశ్వాస విడిచేదాకా ఆయన నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ హోదాలోనే ఉన్నారు. ఆయనకు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఐటీసీకి పర్యాయ పదంగా మారిన దేవేశ్వర్ దానినే తన ఇంటిపేరుగానూ మలుచుకున్నారు.

దేవేశ్వర్ ‘ఆశీర్వాద్’ తరహా బ్రాండ్ల సృష్టికర్త 
‘ఆశీర్వాద్‌’ వంటి పలు గొప్ప భారత బ్రాండ్ల సృష్టి కూడా ఆయన చలవే. ఆయనే వై.సి.దేవేశ్వర్‌. పూర్తి పేరు యోగేశ్వర్‌ చందర్‌ దేవేశ్వర్‌. కార్పొరేట్‌ సర్కిళ్లలో ఆయనను అంతా చనువుగా వైసీడీ అని పిలుస్తారు. అప్పటివరకు కేవలం సిగరెట్ల వ్యాపారంలోనే దిగ్గజంగా ఉన్న ఐటీసీని.. బహుళ వ్యాపారాలు నిర్వహించే కంపెనీగా తీర్చిదిద్దిన ఘనత ఆయనదే.

బ్లూచిప్ కంపెనీల్లో ఒకటిగా ఐటీసీ
మార్కెట్‌ విలువ పరంగా దేశంలోనే బ్లూచిప్ కంపెనీల్లో ఒకటిగా ఐటీసీ అవతరించడంలోనూ ఆయనదే కీలక పాత్ర. ఐటీసీ సీఈఓగా దేవేశ్వర్ ప్రయాణం తొలినాళ్లలో అంత సజావుగా సాగిపోలేదు. ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్నారు. సమస్యలూ పరీక్షించాయి.

దేవేశ్వర్‌కు తొలి రోజు నుంచే సవాళ్లు 
ఛైర్మన్‌, సీఈఓగా బాధ్యతలు చేపట్టిన తొలి రోజు నుంచే దేవేశ్వర్‌కు సవాళ్లు మొదలయ్యాయి. రెట్రోస్పెక్టివ్‌ ఎక్సైజ్‌ పన్ను కింద ఐటీసీ రూ.803 కోట్లు చెల్లించాలంటూ నోటీసులు వచ్చాయి. ఆ రోజుల్లో కంపెనీ సంవత్సరం పొడుగునా ఆర్జించే లాభానికి ఈ విలువ మూడు రెట్లు. 

హేతుబద్ధ విధానంతో ముందుకెళ్లిన దేవేశ్వర్
ఐటీసీ భవితవ్యంపై కూడా వాటాదారులు, బోర్డు సభ్యుల మధ్య బేధాభిప్రాయాలూ తలెత్తాయి. వ్యాపార విభాగాల హేతుబద్దీకరణ ద్వారా ఈ సవాలన్నీ ఒక్కొక్కటి ఆయన పరిష్కరించుకుంటూ వచ్చారు. ఆర్థిక సేవలు, వంట నూనెలు, విదేశాల్లో రెస్టారెంట్లు, స్థిరాస్తి వ్యాపారాలను విక్రయించారు. 

విభిన్న వ్యాపారాల్లోకి అడుగు పెట్టాలని ఐటీసీ నిర్ణయం
కీలక సిగరెట్‌ వ్యాపారంపైనే పూర్తిగా దృష్టి పెట్టకుండా ఇతర వ్యాపార విభాగాల్లోనూ అడుగుపెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. దేవేశ్వర్‌ కంటే ముందు ఐటీసీ ఛైర్మన్‌గా వ్యవహరించిన వాళ్లు కూడా ఈ ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు. అదే తరహా అనుభవాలు దేవేశ్వర్‌ హయాంలోనూ ఎదురయ్యాయి. 

ఒడిదొడుకులను అధిగమిస్తూ దేవేశ్వర్ ముందడుగు
కానీ తనకు ఎదురైన ఒడుదొడుకులన్నీ ఎదుర్కొంటూ ముందుకు సాగారు. ఎఫ్‌ఎమ్‌సీజీ వ్యాపారంలో వినూత్న బ్రాండ్లను ప్రవేశపెట్టారు. వ్యవసాయ వ్యాపారంలోనూ కొత్త తరహా విధానాలకు శ్రీకారం చుట్టారు దేవేశ్వర్. 

దేవేశ్వర్ హయాంలోనే ఈ-చౌపల్ ప్రారంభం
దేవేశ్వర్‌ హయాంలోనే రైతులను అంతర్జాతీయ విపణులకు అనుసంధానం చేసే ఇ-చౌపల్‌ను ఐటీసీ ప్రారంభించింది. హోటళ్ల వ్యాపారంలోనూ ఐటీసీకి ప్రపంచ వ్యాప్త విశిష్ఠతను తీసుకొచ్చారు. గొప్పగొప్ప భారతీయ బ్రాండ్ల సృష్టికి ఆయన విశేష కృషి చేశారు. 

2017లో ఐటీసీ సీఈఓగా వైదొలిగిన దేవేశ్వర్
ఐటీసీకి చెందిన అన్ని వ్యాపార విభాగాలను విజయపథంలో పయనించేందుకు నిర్విరామ కృషి చేసిన దేవేశ్వర్‌ 2017 ఫిబ్రవరిలో సీఈఓ పదవి నుంచి వైదొలిగారు. అయితే 2022 వరకు నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గా బోర్డులో కొనసాగేందుకు ఆయనను కంపెనీ నియమించింది.

సీఈఓగా తప్పుకున్నా.. ఎప్పటికప్పుడు సంస్థ తీరుపై ఫోకస్
సీఈఓ బాధ్యతల నుంచి తప్పుకున్నా.. ఐటీసీ పనితీరును ఆయన ఎప్పటికప్పుడు గమనిస్తూనే  ఉండేవారు. చికిత్స నిమిత్తం ఆయన తన నివాసాన్ని దేశ రాజధానికి మార్చారు. ఢిల్లీలోనే కంపెనీ ఉన్నత స్థాయి యాజమాన్యం సమావేశాలు నిర్వహించింది. 

దేవేశ్వర్ కు ఐటీసీ ఎంతో ప్రాధాన్యం
కొన్ని బోర్డు సమావేశాలు కూడా హస్తినలోనే జరిగాయి. దీనిని బట్టి చూస్తే దేవేశ్వర్‌కు ఐటీసీ ఉన్నత యాజమాన్యం ఇచ్చే ప్రాధాన్యమేమిటో అర్థం చేసుకోవచ్చు. అందుకే ఆయన కార్పొరేట్‌ చరిత్రలో ఓ లెజెండ్‌. ఆయన మరణం ఐటీసీకి తీరని లోటే.

ఐటీసీలో ఇలా దేవేశ్వర్ ప్రస్థానం
1968లో సాధారణ ఉద్యోగిగా దేవేశ్వర్ ఐటీసీలో అడుగుపెట్టారు. 1984 ఏప్రిల్‌ 11న ఐటీసీ బోర్టులో డైరెక్టరుగా నియమితులయ్యారు. 1996 జనవరి 1న సీఈఓ, ఛైర్మన్‌గా బాధ్యతల స్వీకరించారు. 2017లో సీఈఓగా బాధ్యతల నుంచి వైదొలిగారు. మరణించేనాటికి నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ హోదాలోనే ఉన్నారు. 

1991-94 మధ్య ఎయిరిండియా చైర్మన్‌గా దేవేశ్వర్
ఐఐటీ ఢిల్లీ, హార్వర్డ్‌ బిజినెస్‌ స్కూల్‌లో చదువు పూర్తయ్యాక 1968లో ఐటీసీలో ఉద్యోగిగా చేరారు. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి 1996లో ఛైర్మన్‌, సీఈఓ పదవిని చేపట్టారు. 1991-94 మధ్య ఎయిరిండియాకు ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించారు.

ఇలా అత్యుత్తమ సీఈఓల్లో ఒకరుగా గుర్తింపు
2013లో ప్రపంచంలోని అత్యుత్తమ సీఈఓల్లో దేవేశ్వర్‌కు ఏడో ర్యాంకును హార్వర్డ్‌ యూనివర్శిటీ ఇచ్చింది. అంతకుముందు 2011లో ‘పద్మభూషణ్‌’ అవార్డు సొంతం చేసుకున్నారు. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా సెంట్రల్‌ బోర్డులో దేవేశ్వర్ డైరెక్టర్‌గా పనిచేశారు. 

పలు ఇండస్ట్రీ సంస్థలకు ఇలా సారథ్యం
నేషనల్‌ ఫౌండేషన్‌ ఫర్‌ కార్పొరేట్‌ గవర్నెన్స్‌, నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అప్లయిడ్‌ ఎకనమిక్‌ రీసెర్చ్‌, నేషనల్‌ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌, వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ బోర్డు, యూకే- ఇండియా సీఈఓ ఫోరమ్‌, యూఎస్‌- ఇండియా సీఈఓ ఫోరమ్‌లో సభ్యుడిగా సేవలు అందించారు. సీఐఐ అధ్యక్షుడిగాను దేవేశ్వర్‌ పనిచేశారు.

1998లో ఇలా ఇతర వ్యాపారాల విక్రయం
ఐటీసీలో 1998- వంట నూనెలు, ఆర్థిక సేవల వ్యాపారాలను విక్రయించేశారు దేవేశ్వర్. 2000లో విల్స్‌ లైఫ్‌స్టయిల్‌ ప్రారంభించి, ఐటీసీ ఇన్ఫోటెక్‌ ఏర్పాటు చేశారు. ఇ-చౌపల్‌ ప్రారంభించారు. 2002-03 ఆశీర్వాద్‌ బ్రాండ్‌, సన్‌ఫీస్ట్‌ బిస్కెట్లను ఆవిష్కరించారు. 

ఇలా బ్రాండ్ల ఆవిష్కరణ.. బ్రాండ్ల కొనుగోళ్లు
2007-09 మధ్య బింగో, ఫియామా బ్రాండ్లను దేవేశ్వర్ ఆవిష్కరించారు. అదే ఏడాది ఐటీసీ మార్కెట్‌ క్యాపిటలైజేషన్ విలువ రూ.లక్ష కోట్లకు చేరుకున్నది. 2012- జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ నుంచి సావ్లాన్‌ బ్రాండ్‌ను ఐటీసీ కొనుగోలు చేయడంలో దేవేశ్వర్ పాత్ర కీలకం. 

ఐటీసీ ప్రస్థానం ఇలా 1910 నుంచి ప్రారంభం
1910 ఆగస్టు 24న ఇంపీరియల్‌ టొబాకో లిమిటెడ్‌ (ఐటీఎల్) పేరుతో ఏర్పాటై.. 1970లో ఇండియన్‌ టొబాకో లిమిటెడ్‌గా పేరు మార్చుకున్నది. కాలక్రమేణా కంపెనీ పేరు ఐటీసీగా స్థిరపడింది. కోల్‌కతా కేంద్రంగా సంస్థ కార్యకలాపాలు సాగాయి. 

ఐటీసీ బ్రాండ్లు ఇవే
ఎఫ్‌ఎంసీజీ, ఆతిథ్యం, కాగితం, కాగితం బోర్డులు, ప్యాకేజింగ్‌, వ్యవసాయ వ్యాపారం, ఐటీ, సిగరెట్లు తదితర విభాగాల్లో వ్యాపార లావాదేవీలు ఐటీసీకే సొంతం. ఇక  ప్రముఖ బ్రాండ్లు.. ఆశీర్వాద్‌, మంగళదీప్‌, బింగో, సన్‌ఫీస్ట్‌, క్లాస్‌మేట్‌, పేపర్‌ క్రాఫ్ట్‌, యెప్పి, మింటో, క్యాండీమాన్‌, ఐటీసీ మాస్టర్‌ చెఫ్‌, ఫియేమా, వివేల్‌, శావ్లాన్‌, షవర్‌ టు షవర్‌, విల్స్‌, హోమ్‌లైట్‌లు ఐటీసీ స్పెషాలిటీ. ఇంకా సంస్థ ఆధ్వర్యంలో ఐటీసీ హోటల్స్‌, వెల్‌కమ్‌ హోటల్స్‌, ఫార్చ్యూన్‌ వెల్‌కమ్‌ హెరిటేజ్‌ హోటల్స్ నిర్వహిస్తున్నారు. 

దేవేశ్వర్ సేవలు మరువలేనివి: మోదీ 
భారత పారిశ్రామిక రంగానికి దేవేశ్వర్‌ అందించిన సేవలు మరువలేనివి. ఆయన కృషి ఫలితంగానే అంతర్జాతీయంగా పేరొందిన భారతీయ కంపెనీగా ఐటీసీ ఖ్యాతి గడించింది.  దేవేశ్వర్‌ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, ఐటీసీ గ్రూపునకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నానని మోదీ పేర్కొన్నారు.  

తెలంగాణ ప్రగతికి దేవేశ్వర్ సహకారం
తెలంగాణ పారిశ్రామికాభివృద్ధికి దేవేశ్వర్‌ ఎంతో సహకారాన్ని అందించారని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు పేర్కొన్నారు. 2015, జూన్‌లో హైదరాబాద్‌లో జరిగిన టీఎస్‌ఐపాస్‌ ప్రారంభ సభలో పాల్గొన్నారని చెప్పారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానన్నారు.

దేవేశ్వర్ లేని లోటు తీర్చలేనిది: సీఐఐ అధ్యక్షుడు విక్రమ్ కిర్లోస్కర్
భారత పారిశ్రామిక రంగానికి దేవేశ్వర్‌ లేని లోటు తీర్చలేనిదని సీఐఐ అధ్యక్షుడు విక్రమ్ కిర్లోస్కర్ పేర్కొన్నారు. సుస్థిర వ్యాపారాన్ని నిర్మించే విషయంలో ఆయనకున్న నిబద్ధత, అకుంఠిత దీక్ష ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయం అని అభిప్రాయ పడ్డారు. ఆయన కుటుంబ సభ్యులకు ఈ సమయంలో మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నానని తెలిపారు.

ఐటీసీని ఉన్నత శిఖరాలకు చేర్చిన దేవేశ్వర్: అరుణ్ జైట్లీ
ఐటీసీ ఛైర్మన్‌ దేవేశ్వర్‌ మరణం విషాదకరం. కార్పొరేట్‌ వృత్తి నిపుణుడిగా, ఓ వ్యాపారిగా కంపెనీని ఉన్నత శిఖరాలకు చేర్చడంలో ఆయన ఎంతోగానో కృషి చేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని, కుటుంబ సభ్యులకు మనోనిబ్బరాన్ని ప్రసాదించాలని దేవుణ్ని ప్రార్థిస్తున్నానని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ తెలిపారు.

వరల్డ్ బ్రాండ్‍గా ఐటీసీకి పేరు తెచ్చిన దేవేశ్వర్ కృషి అనన్యసామాన్యం
ఐటీసీని ప్రపంచస్థాయి బ్రాండ్‌గా తీర్చిదిద్దడంలో దేవేశ్వర్‌ కృషి అనన్యసామాన్యం. ఆయన నడచిన బాట పాతతరంతో పాటు, కొత్తతరం పారిశ్రామికవేత్తలకూ అనుసరణనీయం. దేవేశ్వర్‌ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని  ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేర్కొన్నారు.

కలత మిగిల్చిన దేవేశ్వర్ మరణం: కిరణ్ మజుందార్
దేవేశ్వర్‌ మరణ వార్త విని తీవ్రంగా కలత చెందానని బయోకాన్ చైర్ పర్సన్ కిరణ్ మజుందార్ పేర్కొన్నారు. ఐటీసీని అగ్రిటెక్‌ సహా పలు రంగాల్లోకి అడుగుపెట్టించిన ఓ వ్యాపార దిగ్గజంగా ఆయన ఎప్పటికీ గుర్తుండిపోతారన్నారు.

తమను దు:ఖసాగరంలో ముంచేశారు: ఐటీసీ ఎండీ 
తమ ఛైర్మన్‌ దేవేశ్వర్‌ మరణం మమ్మల్ని దుఃఖసాగరంలో ముంచిందని ఐటీసీ ఎండీ సంజీవ్ పురి తెలిపారు. సంస్థకు సుస్థిరమైన వృద్ధిని సాధించేందుకు ఆయన ఎప్పుడూ పరితపిస్తూ ఉండేవారని, వ్యాపార సంస్థలు సమాజానికి మేలు చేసేలా ఐటీసీ వ్యాపార విధానాన్ని మార్చారన్నారు. ప్రస్తుతం దాదాపు 60 లక్షల మందికి ఐటీసీ చేయూతను అందిస్తోందన్నారు.

కార్పొరేట్ దిగ్గజం దేవేశ్వర్: మమతా బెనర్జీ
వై.సి.దేవేశ్వర్‌ మరణం పట్ల విచారాన్ని వ్యక్తం చేస్తున్నానని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పేర్కొన్నారు. కార్పొరేట్‌ ప్రపంచంలో ఆయన ఓ దిగ్గజం,  పారిశ్రామిక రంగానికి సారథి, ఆయన కుటుంబానికి, సహోద్యుగులకు, ఆత్మీయులకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నానని తెలిపారు.