Asianet News TeluguAsianet News Telugu

కోట్ల కొలువులు గోవిందా.. పేదల బతుకు ఆగమాగం.. ఓఈసీడీ హెచ్చరిక

గతంలో కనీ వినీ ఎరుగని విలయం.. శతాబ్ద కాలంలో ఇంత సంక్షోభం ఏనాడూ చూడలేదని ప్రముఖ రేటింగ్ సంస్థ ఎస్ అండ్ పీ అంచనా వేసింది. రెండో దశ కరోనా దాడి జరిగితే దేశ జీడీపీ -7.6 శాతానికి పడిపోవచ్చునని అంచనా వేసింది.  
 

Worst global recession in nearly a century: OECD
Author
Hyderabad, First Published Jun 11, 2020, 11:40 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

పారిస్: కరోనా వైరస్‌ దెబ్బకు ప్రపంచం ఇప్పట్లో కోలుకునే పరిస్థితి  లేదని ఆర్గనైజేషన్‌ ఫర్‌ ఎకనామిక్‌ కోఆపరేషన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ (ఓఈసీడీ) వ్యాఖ్యానించింది. ఈ మహమ్మారి ఓ భీకర అంతర్జాతీయ మాంద్యానికి దారితీసిందని, దాదాపు గత శతాబ్ద కాలంలో ఇలాంటి పరిస్థితిని చూడలేదని పేర్కొన్నది.

వర్షాకాలం ప్రారంభం కానున్న నేపథ్యంలో మళ్లీ అంటురోగాలు విజృంభించే వీలుందని ఓఈసీడీ హెచ్చరించింది. ఇంకా రెండో దశకు చేరుకోకముందే ఇంతటి విలయాన్ని చూస్తున్నామని, ఇక ఆ దశకు చేరితే నష్టాలను ఊహించడం కష్టమేని వ్యాఖ్యానించింది. 

ఓఈసీడీ బుధవారం తమ అంతర్జాతీయ ఆర్థిక నివేదికను విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ తీవ్రత కనిపిస్తున్న విషయం తెలిసిందే. నియంత్రణ తప్ప నివారణే లేని ఈ మహమ్మారి కట్టడికి దాదాపు అన్ని దేశాలు లాక్‌డౌన్‌ పాటించిన సంగతీ విదితమే. 

భారత్‌లోనూ రెండు నెలలకుపైగా లాక్‌డౌన్‌ అమలవగా.. ఈ పరిస్థితులు ఆయా దేశాల్లో కోట్లాది ఉద్యోగాలను మింగేశాయని తెలిపింది. ముఖ్యంగా యువత, పేద ప్రజలను తీవ్రంగా ప్రభావితం చేసిందని చెప్పింది. ‘ఓఈసీడీ ఏర్పాటైన దగ్గర్నుంచి బహుశా ఇలాంటి అనిశ్చితిని, వైపరిత్యాన్ని చూడలేదు’ అని ఆ సంస్థ సెక్రటరీ జనరల్‌ ఏంజెల్‌ గుర్రియా అన్నారు. ఎప్పట్లాగే ఇప్పుడు కూడా అంచనాలను వేసే పరిస్థితి కాదన్నారు. 

అయినా రెండోసారి కరోనా విజృంభించకపోతే ప్రపంచ జీడీపీ ఈ ఏడాది -6 శాతంగా ఉండొచ్చని ఏంజెల్ గుర్రియా చెప్పారు. వచ్చే ఏడాది మాత్రం 2.8 శాతం వృద్ధి కనపడవచ్చని అంచనా వేశారు.ఈ ఏడాది ఆఖర్లో వైరస్‌ మళ్లీ విస్తరిస్తే వృద్ధిరేటు -7.6 శాతానికి పడిపోవచ్చునని సంస్థ సెక్రటరీ జనరల్‌ ఏంజెల్‌ గుర్రియా పేర్కొన్నారు. ఏదిఏమైనా కొవిడ్‌-19 మళ్లీ వ్యాపించినా.. వ్యాపించకపోయినా పరిణామాలు మాత్రం చాలా తీవ్రంగానే ఉంటాయని హెచ్చరించారు. 

కరోనా ప్రభావం కూడా దీర్ఘకాలం ఉండొచ్చని సంస్థ సెక్రటరీ జనరల్‌ ఏంజెల్‌ గుర్రియా అభిప్రాయపడ్డారు. కరోనాను వీలైనంత త్వరగా అదుపు చేయకపోతే ఆర్థిక వ్యవస్థ కోలుకోలేదన్నారు. 

also read లాక్‌డౌన్ లో పార్లే-జి బిస్కెట్లు 'రికార్డ్'..ప్రతిఒక్కరు తినే బిస్కెట్ బ్రాండ్

వరుసగా 13వ ఏడాది పాత రేటింగ్‌నే కొనసాగించిన ఎస్‌అండ్‌పీ
భారత సార్వభౌమ రేటింగ్‌ను అంతర్జాతీయ రేటింగ్‌ సంస్థ ఎస్‌అండ్‌పీ మరోసారి యథాతథంగా కొనసాగించింది. భారత ఆర్థిక వ్యవస్థ కుదుటపడుతుందని, వచ్చే ఏడాది నుంచి పుంజుకొంటుందని ఎస్‌అండ్‌పీ పేర్కొన్నది.

అయతే పెట్టుబడుల గ్రేడ్‌లో అత్యంత దిగువన ఉండే ‘బీబీబీ-’ రేటింగ్‌నే ఎస్ అండ్ పీ మళ్లీ ఇచ్చింది. భారతకు ఎస్‌అండ్‌పీ ఈ రేటింగ్‌ను ఇవ్వడం ఇది వరుసగా 13వ ఏడాది. భారత దీర్ఘకాలిక వృద్ధిరేటుకు సమస్యలు పెరుగుతున్నాయని తెలిపింది. 

ప్రస్తుతం చేపట్టిన ఆర్థిక సంస్కరణలను సమర్థంగా అమలు చేయగలిగితే దేశ వృద్ధిరేటు మెరుగవుతుందని బుధవారం ఓ ప్రకటనలో ఎస్‌అండ్‌పీ తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిరేటు 5 శాతం క్షీణిస్తుందని అంచనా వేసింది. అయితే వచ్చే ఆర్థిక సంవత్సరంలో జీడీపీ 8.5 శాతానికి పెరుగుతుందని, 2022-23లో 6.5 శాతానికే పరిమితమవుతుందని పేర్కొన్నది. 

గత ఆర్థిక సంవత్సరం (2019-20)లో దేశ ఆర్థిక వృద్ధిరేటు 4.2 శాతానికి క్షీణించి 11 ఏండ్ల కనిష్ఠస్థాయికి పడిపోయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం భారత్‌కు ‘బీబీఏ-’ లాంగ్‌టర్మ్‌ రేటింగ్‌, ఏ-3 షార్ట్‌టర్మ్‌ ఫారిన్‌, లోకల్‌ కరెన్సీ రేటింగ్‌ ఇవ్వడం దేశ వాస్తవిక జీడీపీ సగటు కంటే ఎక్కువగా ఉండటాన్ని, బాహ్య పరిస్థితులు బలంగా ఉండటాన్ని, మారుతున్న ద్రవ్య విధానాలను ప్రతిబింబిస్తున్నాయని ఎస్‌అండ్‌పీ పేర్కొన్నది. 

భారత్‌లో బలంగా ఉన్న ప్రజాస్వామిక సంస్థలు స్థిరమైన విధానాలను ప్రోత్సహిస్తున్నాయని, ఈ బలాలు.. దేశ తలసరి ఆదాయం తగ్గుదల, ద్రవ్యలోటు పెరుగుదల లాంటి అంశాల వల్ల ఉత్పన్నమవుతున్న సమస్యలకు సమతూకంగా ఉన్నాయని ఎస్ అండ్ పీ తెలిపింది. కరోనా సంక్షోభంతో కుదేలైన భారత ఆర్థిక వ్యవస్థ మళ్లీ పుంజుకొంటుందన్న తమ అంచనాలను స్టేబుల్‌ అవుట్‌లుక్‌ ప్రతిబింబిస్తున్నదని ఎస్‌అండ్‌పీ తెలిపింది.

Follow Us:
Download App:
  • android
  • ios